ఉప్పు నీటిని తాగు నీరుగా మార్చగలమా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, 5.8.2019న ఇజ్రాయెల్‌లోని హదెరా డీశాలినేషన్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు సముద్ర జలాలను మంచినీరుగా మార్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి,నిపుణులు ఏమంటున్నారో చూడండి.
” వర్షపు నీరు నదుల్లోనూ, వర్షపాత ప్రాంతాల్లోనూ ఉన్న వివిధ లవణాలను మోసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు నీరు ఉప్పుమయం అయ్యింది. సముద్రపు నీరు తాగు, సాగునీరుగా పనికిరాదు. ఇలాంటి నీరు తాగితే జీర్ణవాహిక తన నిర్మాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సముద్రపు నీటిలో ఉన్న కొన్ని నిరింద్రియ లవణాలు రక్తంలో కలిస్తే మన జీవ భౌతిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వ్యవసాయానికి ఈ నీరు వాడితే, పొలంలో ఉన్న సారాన్ని హరించి వేస్తాయి. పంటలు సరిగా పండవు.
అయితే,
సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మంచినీరుగా మార్చడం వీలుకాదు. కానీ సముద్రపు నీటిని తక్కువ మోతాదులో ‘రివర్స్‌ ఆస్మోసిస్‌’ ద్వారా మంచి నీటిగా మార్చగలం. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌, స్వేదన ప్రక్రియల ద్వారా ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అవకాశం సైంటిఫిక్‌గా ఉంది.
మనం తాగే నీరు, సాగు నీరు వర్షాల నుంచి వచ్చిందే. వర్షాలు సముద్రపు నీటి నుంచి వచ్చే మేఘాల నుంచే కాబట్టి సముద్రంపై నీరు పరోక్షంగా మంచి నీరుగా మారినట్టే కదా!” అంటున్నారు, జనవిజ్ఞానవేదిక , వరంగల్‌ కన్వీనర్‌,ప్రొఫెసర్‌ ఎ. రామచంద్రయ్య.


సముద్రపు నీటిని పూర్తిగా మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, కింగ్‌ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరినీ ఆకట్టుకుంటోంది.


సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం ద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది.
ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్‌ ప్యానెల్స్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ శాస్త్రవేత్తలు సోలార్‌ ప్యానెల్స్‌ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్‌ ప్యానెల్స్‌ వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది.
ఈ ఏర్పాటు వల్ల సోలార్‌ ప్యానెల్స్‌ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని అదే సమయంలో ప్యానెల్స్‌ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Share.

Leave A Reply