చేనేత కార్మికులకు చేయూత

Google+ Pinterest LinkedIn Tumblr +

చేనేత కార్మికులకు చేయూత
హైదరాబాద్‌లో తమిళనాడు చేనేతల ప్రదర్శన

భారత దేశపు చేనేత రంగంలో ప్రముఖ స్ధానంలో ఉంది తమిళనాడు. ఇక్కడ రెండున్నర లక్షల మంది నేత కార్మికులు చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీరి కోసం 1,300 హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడా చేనేత కార్మికుల ఆకలి చావులు కనిపించవు. దీనికి ప్రధాన కారణం వారికి ప్రభుత్వం అండగా ఉండటమే. వారి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడానికి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడానికి డిపార్టు మెంట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌,తమిళనాడు సంస్ధ కృషి చేస్తోంది.
దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో నేతన్నలు నేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారు. ఇలావచ్చిన లాభాలతో నేతకార్యికుల జీవనోపాధుల మెరుగుదలకు తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మే1 నుండి 10వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని వైడబ్ల్యూసిఏ లో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ టి.ఎన్‌.వెంకటేష్‌ మేడే రోజున ప్రారంభించి మాట్లాడుతూ….
”చేతి వృత్తులను కాపాడితే మన సంస్కృని కాపాడినట్టే… నేతకార్మికులకు అండగా వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మార్కెట్‌ చేయడానికి తమిళనాడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరు,ముంబాయి,కోల్‌కత్తా,ఢిల్లీ నగరాల్లో ప్రదర్శన,అమ్మకాలు నిర్వహించాం. ప్రతీ నగరంలో రూ.70 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయి. ముంబాయిలో రూ.కోటి దాటింది. చేనేతకు ప్రజలు ఇస్తున్న మద్దతు సంతోషం కలిగించింది.

ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి హ్యాండ్లూమ్స్‌ డిపార్టు మెంట్‌ సహకారంతో పదిరోజుల పాటు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కాంచీపురం పట్టు వస్త్రాలతో పాటు ఆరణి,సేలం,త్రిభువనం సిల్క్‌ దుస్తులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. 10 నుండి 50శాతం వరకు డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నాం. తమిళనాడులో కూడా ఇక్కడి చేనేతల ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణ హ్యాండ్లూమ్‌ అధికారులను ఆహ్వానిస్తున్నాం. దీని వల్ల సంస్కృతి,సంప్రదాయాలు పరస్పరం తెలుసుకునే అవకాశం కలుగుతుంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ ప్రీతీమీనా మాట్లాడుతూ…
”ఇలాంటి ప్రదర్శనలు అమ్మకాల వల్ల చేనేత కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా చేనేతలను మార్కెటింగ్‌ చేయడం వల్ల వారి జీవనోపాధులు మరింత మెరుగవడానికి తమిళనాడు హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కృషి ఎంతో స్ఫూర్తి దాయకం. తెలంగాణ రాష్ట్రంలో కూడా చేనేత కార్మికుల జీవనోపాధుల అభివృద్దికి తీవ్రంగా కృషిచేస్తున్నాం. వారి బీమా, పించన్‌ సౌకర్యంతో పాటు ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది దుస్తుల కోసం చేనేత ఉత్పత్తులనే వాడుతున్నాం. పోచంపల్లి,నారాయణ పేట్‌ చేనేతలకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్‌ ఇమేజ్‌ తేవడానికి ప్రదర్శనలు,మేళాలు నిర్వహించ బోతున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, తమిళనాడు హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డిప్యూటీ డైరెక్టర్లు రాంగోపాల్‌రావు, ఎం.పలని సామి పాల్గొన్నారు.

Share.

Comments are closed.