ఎత్తైన కొండ దారిలో, కిందకి దిగితే జలపాతం…

Google+ Pinterest LinkedIn Tumblr +

అరణ్య స్పర్శ 4:

(Aranyakrishna)
రాత్రి మిగిలిన పొంగల్నే మళ్ళా వేడి చేసి సిద్ధం చేసారు లోహితాక్షన్, బాపిరాజు, Jayati Lohithakshan. జయతి మంచి చాయి కూడా ఇచ్చారు. పెదకొండ గూడేనికి వీడుకోలు, తమ నాగరికి ప్రవర్తనతో మా మనసుల్ని ఆకట్టుకున్న ఆ ఆదివాసీలకు ధన్యవాదాలు తెలిపి రంపచోడవరం బైల్దేరాం. దారిలో కనబడ్డ చిన్న జలపాతాలు, పెద్ద పెద్ద రాళ్ళు, తోటలు, గోశాల చూస్తూ, చేతికందిన కాయలు తెంపుకుంటూ రంప చేరాం. అక్కడ రాజస్థానీ మిఠాయి దుకాణంలో సమోసాలు తిని, గుంటూరు నాయుడు బడ్డీ హోటల్లో టీ తాగి మారేడిమిల్లి చేరుకున్నాం. అక్కడ అమర్నాధ రెడ్డి తయారు చేసిన “బొంగులో చికెను”, ఇతర పదార్ధాలు తిని “టైగ్రిస్” జలపాతం దగ్గరకు బయలుదేరాం. మిగతా అందరూ బస్సెక్కి బయల్దేరితే నేను, శ్యాం గారు ఇద్దరం లోహితాక్షన్ మోటార్ సైకిల్ మీద బయల్దేరాం. మారేడిమిల్లి నుండి సుమారు 70 కి.మీ. వుంటుందేమో. శ్యాం గారు చాలా మంచి మోటార్ సైక్లిస్టు. ఇన్నాళ్ళు నేను చాలా మంచి మోటార్ సైక్లిస్టునని, మా గొప్ప స్పీడు మీదెళ్ళగలనని అనుకునే వాడిని. ఆయన్ని చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను.

బ్రహ్మాండమైన శీతల వాతావరణం. ఫ్రిజ్ లో కూర్చున్నట్లుంది మోటార్ సైకిల్ మీద కూర్చుంటే. నేనేమో కాటన్ పాంట్, టీ షర్ట్ తో వున్నాను. హైదరాబాద్ నుండి స్వెటర్, ఇయర్ క్యాప్స్, బ్లాంకెట్ తీసుకెళ్ళటం మర్చిపోయాను. ఆ స్పీడుకి ఛలి కోసేస్తున్నది. వెళ్ళే దారిలో ఒక చిత్రం జరిగింది. మేం మధ్యలో అనేక చోట్ల ఆగి వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వచ్చాం. అటువంటి ఒక చోట ఎవరో జీన్స్ జాకెట్ మర్చిపోయి వెళ్ళారు. “అది మీ కోసమే వుంది. తీసుకోండి” అన్నారు శ్యాం గారు. ఆ రకంగా బతికి పోయాను. ఆ అజ్ఞాత వస్త్రదాతకి ధన్యవాదాలు. ఆ రకంగా నాకొక జ్ఞాపిక దొరికిందన్న మాట. చింతూరు, మోతుగూడెం మీదుగా పుల్లూరు చేరుకున్నాం. పుల్లూరు పక్కన ఎత్తైన కొండ దారిలో కొంచెం కిందకి దిగితే జలపాతం వుంది. అయితే అప్పటికే చీకటి పడుతున్నది. మేం ఎక్కడ బస చేయ్యాలో తెలియదు. నేను, శ్యాంగారు బస్సు కంటే ముందే చేరుకున్నాం కదా. ముందుగానే ఎక్కడ దిగాలో స్పాట్ సెలెక్ట్ చేసాం. జలపాతానికి కొంత పైన వాగు పక్కన చూసుకున్నాం.

రెండు కొండల మధ్య లోయలో నిండుగా పారుతున్న వాగు మరో నీటి చెలమ నడుమ గులకరాళ్ళ సంపద పక్కన కాస్తంత మట్టి నేల చూసుకున్నాం. పూర్తిగా కిందకి దాకా దిగాల్సిన అవసరం లేకుండానే ఎంచుకున్నాం. మళ్ళీ రోడ్డు మీదికొచ్చి మిగతా మిత్రులు ఎక్కిన బస్సునాపి, వాళ్ళతో కలిసి చలచల్లటి నీళ్ళతో పలకరించిన వాగుని దాటి మా బస కి చేరుకున్నాం. ఇది నిజానికి గొప్ప సాహసం. అందరికీ లోపల కొంత గుబులుగానే వున్నా గొప్ప ఎగ్జైట్మెంట్ కూడా వుంది. వెళ్ళగానే చేసిన మొదటి పని క్యాంప్ ఫైర్ వేసుకోవటం. ఎండిన కొమ్మలు, దుంగలు బోలెడున్నాయి. క్యాంప్ ఫైర్ వేసుకోగానే ఆ ప్రాంతం మీద మాకేదో పురాతన పరిచయం వున్నట్లు అనిపించింది. చూస్తుండగానే చిమ్మ చీకటి పడిపోయింది. అమావాస్య రోజులు. మిణుగుర్లు ఒక్కొక్కటి వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నాయి. వాగు చప్పుడు. మిణుగుర్ల హడావిడి. పైన ఆకాశాన్ని నక్షత్రాలు స్వాధీనం చేసుకుంటున్నాయి.

నేనూ, శ్యాం గారు 15 కి.మీ. దూరంలో వున్న మోతుగూడేనికి భోజనం తీసుకొద్దామని మళ్ళీ మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కాపలాదారుణ్ని పలకరించి మేం దిగిన చోటు చెప్పి “అక్కడ సేఫ్టీ పర్లేదా?” అని అడిగాం. “పర్లేదండి! ఏం కాదు. కానీ ఫారెస్టోళ్ళు ఎక్కడి నుండో తీసుకొచ్చి ఓ మూడు పులుల్ని అక్కడ అడవిలో వదిలామంటారు మరి” అన్నాడు. “క్షణంక్షణం” సినిమాలో శ్రీదేవిలా తయారైంది మా మానసిక స్తితి. సరే అనుకొని భోజనం తీసుకొని వెనక్కొచ్చి గుట్ట పైకి చేరుకొని చూసాం. ఎక్కడ దిగాల్నో వెంటనే గుర్తుపట్టలేక పోయాం. వాళ్ళు చలి కాచుకుంటున్న క్యాంప్ ఫైర్ కనబడుతుంది. అయినా ఇబ్బంది పడ్డాం. ఎలాగో స్మగ్లర్లలా మేము, వాళ్ళు టార్చిలైట్లు బ్లింక్ చేస్తూ మొత్తం మీద మా ఆరుబయలు అడవి బసని చేరుకున్నాం. “ఒక గొప్ప సీన్ మిస్సయ్యారు తెలుసా మీరు?” అంటూ పక్కనే అచ్చు క్రిస్మస్ ట్రీని పోలిన చెట్టుని చూపించి “దాని కొమ్మల నిండా మిణుగుర్లు వాలాయ్” అంటూ చెప్పారు మిత్రులు. అయ్యో, మనం మిస్సయ్యేమే అనుకొని నిరాశ పడ్డాం. శ్యాంగారు ప్లాస్టిక్ వినియోగానికి పూర్తి వ్యతిరేకం. ఆయన ముందుగానే చెప్పారు మొత్తం ట్రెక్ లో ప్లాస్టిక్ లేకుండా గడపాలి అని. అందుకే స్టీల్ గ్లాస్, పళ్ళెం తెచ్చుకోమన్నారు. ఇప్పుడు భోజనమేమో ప్లాస్టిక్ కవర్లలో కట్టిచ్చారు. అప్పటికీ మోతుగూడెంలోకి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు తెలియకపోయినా పరిచయం చేసుకొని అడిగారు స్టీల్ క్యారేజి దొరుకుతుందా అని. దొరకలేదు. ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించిన ఆయన సణుగుడు :] మధ్య భోజనాలు కానిచ్చేసాం. చలిమంటలలోకి కట్టెల్ని ఎగదోస్తూ చిటపటల శబ్దాలు, వాగు సవ్వడి వుంటూ ఆ పూటకి పొట్ట పూజ నిర్వహించాం. శ్యాంగారు అంత చిమ్మ చీకట్లో, ఛలిలో కూడా “అయిననూ పోయి రావలె హస్తినకి” అన్నట్లు స్నానం చేయాల్సిందే అని పట్టుబట్టారు. చివరికి వాగులో ఆయనొక్కడే చేయాల్సొచ్చింది. క్రమశిక్షణ విషయంలో ఆయనో శంకరశాస్త్రి అంతటివాడన్న విషయం అర్ధమైంది.

ఇంక ఏ చెప్పమంటారు ఆ రాత్రి గురించి? బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాక మా సామాను బైటనొదిలేసి టెంట్లలోకెళ్ళి నిద్రకుపక్రమించాం. అర్ధరాత్రి మెలుకువ వచ్చి టెంటు తెరిచి చూసాను. ఇందాకనుకున్న క్రిస్మస్ చెట్టుకి నిండుగా దీపాల్లా వెలుగుతూ మిణుగుర్లు వెలుగు పూలల్లా పూసాయి. చెట్టు నిండా ప్రమిదలు అలంకరించినట్లుంది. పైన ఆకాశంలో నక్షత్రాలు మిణుగుర్లలా కనిపించాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కప్పుకొని అలా నిద్రపోయాను. మరుసటి రోజు పొద్దున్నే నిన్నటి కంటే కొంచెం ఎర్లీ గా లేచాను. నిన్న 7 గంటలకి లేస్తే ఈ రోజు 6.59 కే నిద్ర లేచానన్న మాట.  నిన్న మిగిలిన అన్నం కొంతమందిమి బ్రేక్ ఫాస్ట్ చేసాం. పక్కనే వున్న జలపాతం దగ్గరకు వెళ్ళాం. ఇంక చూసుకో నా సావిరంగా! ఒక్కొక్కరు ఛంగున బాల్యంలోకి గెంతేసారు. జలపాతం దగ్గర ఇంకెవ్వరూ లేరు. కేవలం మేం మాత్రమే వున్నాం. మరే ఇతర టూరిస్టులు లేరు. ఆ రకంగా మేము మాత్రమే విశాల జలపాత ఆలింగనాన్ని అనుభవించగలిగాం. జలపాత స్పర్శలో దేహం, మనసు పరవశించాయి. పరిమళించాయి.

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply