అమావాశ్య రాత్రుల్లో మిణుగుర్ల సంబరం

Google+ Pinterest LinkedIn Tumblr +
(AranyaKrishna)

అరణ్యస్పర్శ-5
క్రితం సారి పలమనేరు అడవుల్లో అడవిగాచిన వెన్నెల ఎంత గొప్పగా వుంటుందో అనుభవంలోకి రాగా ఈ సారి రాత్రి అడవిని అలముకున్న అంధకారం ఎంత మహాద్భుతంగా వుంటుందో చూసాను. అమావాశ్య రాత్రుల్లో మిణుగుర్ల సంబరం చూసాను. తెల్లవారగానే జలపాత స్పర్శ మరో మహత్తర అనుభవం. అక్కడివరకు ఒక వాగుగా మంద్రంగా ప్రవహించిన నీరు ఒక్క సారిగా లోతైన పల్లం రాగానే ఒక జలపాతంగా మారటం ఓ విస్మయకర సౌందర్య ప్రవాహం. పరీక్షించి చూడాలే కానీ ప్రకృతిలో నీరు ఓ బాహుబలి. దూకే అవకాశం దొరకాలే కానీ జలం తన బలం ఎంతటిదో చూపగలదు. జలపాత పరిష్వంగం నుండి బైటపడి రోడ్డు మీదకి వచ్చాం. వేటకి వెళుతున్న గిరిజనుల దగ్గర బాణం విల్లంబులు తీసుకొని వేణు కాసేపు వేటగాడిలా ఫోజిచ్చి తన వేట మోజు తీర్చుకున్నాడు. ఈ లోపు శ్యాంగారు మోతుగూడెం వెళ్ళి ఎలాగో ఓ ఆటో తీసుకొచ్చి మమ్మల్ని బైలుదేర తీసారు. ఇంక అక్కడి నుండి మేమో సుడిగాలి పర్యటన మొదలెట్టాం. సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి సౌందర్యం రెండూ పెనవేసుకున్న డాముల్ని, ఎత్తైన ప్రాంతం నుండి లోయవంటి ప్రదేశాల్లో మొగ్గలా ముడుచుకున్న పల్లెల్ని, ప్రయాణిస్తున్న మేరా రెండువైపులా జిగేల్మనిపించే ఆకుపచ్చదనంతో ఘాట్ రోడ్లు, వృక్ష వక్షోజ భారంతో గర్వంగా తొణకిసలాడే కొండ వరుసల్ని, మొత్తం మీద గడిపిన ప్రతి క్షణమూ నిరంతరం మనసులో ప్రవహించే జ్ఞాపకంగా మిగిలిపోగల అనుభూతితో వెనుతిరిగాం. మళ్ళీ మోతుకూరు వచ్చి బస్సెక్కి భద్రాచలం చేరాం.
ఆ మూడురోజుల పర్యటన ఒక కాగడాలా నా గుండెలో ప్రజ్వలించగలదు. ఏదో కాసేపు డైవర్షన్ కోసం వెళ్ళినట్లు వెళ్ళలేదు. తప్పిపోయిన పిల్లాడు తల్లి ఒడిని వెతుక్కున్నట్లు నన్ను నేను వెతుక్కున్నాను. యుగాల నాటి అవిఛ్చిన్న ప్రకృతి సంపదలో నా పూర్వీకుల అడుగుజాడల సవ్వడి విన్నాను. అపరిచిత పురాస్మృతులేవో నన్నుక్కిరిబిక్కిరి చేసాయి. కానీ ఈ అడవి ఇలా ఎన్నాళ్ళు వుండగలదు? మానవుడు బతకటానికి అవసరమైన ప్రాణవాయువుని, స్వఛ్ఛమైన ముడిసరుకుల్ని ఇవ్వగల అడవిలోకి ప్రకృతి విలువ తెలుసుకోటానికి, అధ్యయనం చేయటానికి, అనుభూతి చెందటానికీ కాక సరదాకి, మజా చేసుకోటానికి వెళ్ళి, అక్కడ కూడా ప్లాస్టీక్ ని వెదజల్లి, మద్యం బాటిళ్ళు పగలగొట్టే అనాగరిక విశృంఖలత్వానికి అడవి గాయపడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా పదిహేడేళ్ళ బాపిరాజుకి ఒకటెక్కువగా బృందంలో వున్న మిగతా ఆరుగురికీ సమానంగా కృతజ్ఞతలు. ముందే చెప్పినట్లు శ్యాంగారు గొప్ప ప్రకృతి ప్రేమికుడే కాదు, నలుగురికీ ఆ ప్రేమని పంచాలన్న ఆరాటమున్నవాడు. మంచి డైనమిక్ పర్సన్. కార్యదక్షత కలిగిన ప్రయోగశీలి. ఆయన ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించగల సమర్ధుడని భావిస్తున్నాను. జయతి, లోహితాక్షన్ ఇద్దరూ విలువైన వ్యక్తులు. అల్పమైన భౌతిక విషయాల్ని వదిలేసిన వాళ్ళు. వాళ్ళిద్దరూ విస్తృతంగా అడవి ప్రాంతం గుండా సైకిళ్ళ మీద ప్రయాణించిన వాళ్ళు. అందుకే వాళ్ళిద్దరికీ “బైసికిల్ బర్డ్స్” అనే బిరుదుని ప్రదానం చేసాను. :] అనవసర వస్తుజాలంలో దారి తప్పి పోకుండా వాళ్ళు నిరంతరం ప్రయాణిస్తున్నారు. ఒక స్థిరమైన నివాసం లేక పోవటంలోని సంతోషమేమిటో వాళ్ళని చూస్తే అర్ధమవుతుంది. ఇంక వేణుతో సౌకర్యవంతంగా వుంటుంది. సానుకూల దృక్పధం వున్నవాడు. దేనికైనా కలిసొచ్చే వ్యక్తి. తొందరగా సర్దుకుపోగలిగిన, అలవాటు పడగలిగిన తత్వం వున్నవాడు. సందీప్, కల్పనలిద్దరూ ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చారు. వాళ్ళిద్దరూ జీవితాన్ని సంతోషానికే అంకితమిచ్చిన గంధర్వ జంటలా కనిపించారు. వారిద్దరి హాస్యం, చురుకుదనం, కలగలపుదనం ఎంతగానో నచ్చాయి.

మూడోరోజు రాత్రి తిరిగి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)లో రైలెక్కి మరుసటి రోజు తెల్లవారుజాము హైదరాబాదు చేరుకొని, మళ్ళీ ఏమెరగనట్లు తొమ్మిది ముప్పావుకల్లా ఆఫీసు అటెండెన్శ్ రిజిస్టర్లో సంతకం చేయటం ద్వారా తప్పిపోయిన గొర్రెపిల్ల తిరిగి మందలో చేరినట్లు పాత జీవితాన్ని పునరుద్ధరించుకున్నాను.
(సమాప్తం)
పి.ఎస్.: అన్నట్లు వచ్చే దారిలో భద్రాచలంలో టైముండటంతో కొంతసేపు ఆగాం. ఎక్కడికెళ్ళినా విశ్వాసాలతో సంబంధం లేకుండా నా అవగాహన కోసం అక్కడి అన్ని మతాలకు చెందిన ప్రముఖ మందిరాలేమైనా వుంటే చూసే అలవాటుంది. నాకక్కడ మన సమాజం బాగా అర్ధం అవుతుంటుంది. అలాగే భద్రాచలంలోని రామాలయం కూడా చూసాం. లోపలున్న మ్యూజియంలో కంచర్ల గోపన్న చేయించిన ఆభరణాలు ప్రదర్శనలో వున్నాయన్న సమాచారం కూడా ఒక ఆకర్షణే. మెట్లెక్కి రామాలయంలోకి వెళ్ళి చూస్తే ఒక విచిత్రమైన వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా ధరల పట్టికలే. ఈ పూజకి ఇంత, ఆ సేవకి అంత అనే వాటితో పాటు, సీతారాములకి పెట్టిన బట్టల్ని కూడా అమ్మకానికి పెట్టారు. “అబ్బో చాలా రేట్లున్నాయి” అని భక్తులు గొణుక్కుంటూ వెళ్ళటం జరిగింది. అడుగడుగునా రేట్ చార్టులే. ఏదో మాల్లోకి వచ్చిన ఫీలింగొచ్చింది. మనిషిని సృష్టించిన ప్రకృతిఇచ్చే తాత్వికతకి, మనిషి సృష్టించిన దేవుడిచ్చే ఆధ్యాత్మికతకి తేడా తెలిసిపోయింది.

Share.

Leave A Reply