పొలం …పని కాదు… బాధ్యత

Google+ Pinterest LinkedIn Tumblr +

పొలం …పని కాదు బాధ్యత
మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పట్నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. బడి నుంచి ఇంటికి రాగానే అమ్మ కోసం వెతికితే పొలం లో ఉంది అని చెప్పేవాళ్ళు. దాంతో సైకిల్ వేసుకొని పొలం వైపు వెళ్లేదాన్ని. అక్కడ అమ్మతో పాటు కలుపుతీయడం, కాయలు కోయడం, మొక్కజొన్న పొత్తులు తెంచడం చేసేదాన్ని. అలా చిన్నప్పట్నుంచే పొలాల మధ్యలో తిరగటం, చల్లని పైరగాలిని పీలిస్తే తెలియని ఉత్సాహం వచ్చేసేది. ఆ తర్వాత చదువు, పెళ్లి , పిల్లలు ఇంటి బాధ్యతలతో బిజీబిజీగా రోజులు గడిచిపోయాయి. పిల్లలు పెద్దయి కాస్త తీరిక సమయం దొరకగానే మళ్ళీ ఆలోచనలు పొలం వైపు పరుగులు తీశాయి. మా బంధువులంతా తమ పొలాలను కౌలుకు ఇచ్చినా నాకెందుకో మనమే చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచనతోనే హైదరాబాద్ కు దూరంగా ఉన్నా వారంలో రెండుమూడుసార్లు మా పొలం కి వెళ్తూ వస్తూ ఉన్నాను. నా చిన్నతనంలో పొలంలో ఎక్కువగా నువ్వులు, శనగలు, పెసలు, అనుములు కనిపించేవి. అయితే కమర్షియల్ క్రాప్స్ పండించడం ఎక్కువ కావడంతో మా పొలంలో నూ పత్తి, వేరుశనగ, వరి ఎక్కువగా వేసే వాళ్ళు. నేను పొలం వైపు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కమర్షియల్ క్రాప్స్ కంటే కూడా ఇంటి అవసరాలకు కావలసినవి పర్యావరణాన్ని పరిరక్షించేవి పండించాలన్న ఆలోచన వచ్చింది. భూసారాన్ని తగ్గించే రసాయనాలకు స్వస్తిపలికాం. సేంద్రియ ఎరువుల తయారీకి అనువుగా పొలంలోనే పశువుల కొట్టం ఏర్పాటు చేశాం. ఆవులు, బర్రెలు, మేకలు, కోళ్ళు కూడా పెంచుతున్నాం. వీటి పేడ పొలానికి ఎంతో మంచిది. అంతేకాదు పెసలు, సెనగలు, కొర్రలు, నువ్వులు, అనుములు వంటి పంటలను కూడా సాగు చేస్తున్నాం. వీటన్నిటితో పాటు ఇంటికి కావలసిన కూరగాయలను కూడా పెంచుతున్నాం. ఆధునిక పద్ధతుల్లో సంప్రదాయ వ్యవసాయం చేస్తూ తక్కువ నీటిని ఉపయోగిస్తూ మంచి దిగుబడి సాధించే ప్రయత్నం చేస్తున్నాం.

వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు అది ఒక జీవన విధానం అని ఎంతో మంది చెప్పారు. నిజమే పొలంలో పని చేయడం అనేది పని కాదు మన బాధ్యత. మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుంటున్నాం అన్న సంతృప్తి. పొలంలో తిరుగుతూ కాసిన కాయలను చూస్తూ వాటిని చేతితో తాకుతూ ఉంటే ఆ అనుభూతి మనసును ఎంతో ఆనందింపచేస్తుంది. మా పొలంలో కాసిన కూరగాయలను స్నేహితులకు, బంధువులకు ఇవ్వడం చాలా తృప్తిని ఇస్తుంది. ఇంతకన్నా మనిషికి ఏం కావాలి. మనం గడ్డి వేస్తే పశువులు పాలిస్తాయి. పేడ వేస్తే భూమి ఆరోగ్యకరమైన కూరగాయలను, ధాన్యాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రకృతికి మనం ఎంత చేసినా తక్కువే…..మనసారా ప్రణమిల్లడం, సంద్రీయ సేద్యంతో భూసారాన్ని కాపాడటం కన్నా మించి మనం ఏం చేయగలం అందుకే సంప్రదాయ పంటలను, వ్యవసాయాన్ని చేద్దాం అని నిర్ణయించుకున్నాం.

ఈరోజు మిల్లెట్ బ్యాంక్స్ పేరుతో విశాల గారు సంప్రదాయ పంటలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. భూమి తో మహిళలకు ఉన్న అనుబంధం ఎంత చెప్పినా తక్కువే. డాటర్స్ ఆఫ్ సాయిల్ అన్న పదం నా మనసును ఎంతో హత్తుకుంది. భూమి పుత్రిక అని సీతాదేవికి పేరు. ఈరోజు మట్టిలో తిరుగుతూ పంటలు పండిస్తున్న ఎంతోమంది మహిళలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షం వర్షాల కారణంగా నీటి పాలైనప్పుడు ఆ రైతు పడే బాధ వర్ణనాతీతం. సాంప్రదాయ వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే కష్టాలు గట్టెక్కుతాయి అని నా నమ్మకం.

– కొత్త కృష్ణవేణి శ్రీనివాస్,
హైదరాబాద్.

Share.

Leave A Reply