ఈ భూమ్మీద మనిషే మణిదీపం…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక వస్తువు అమ్మడం కోసం అడ్వర్టైజ్‌ మెంటు చేస్తున్నారంటే, ఆ వస్తువు నిత్యజీవితానికి అవసరం లేదని అర్థం. ఇటువంటి అవసరంలేని వస్తువులను కొనిపించడం కోసం కావల్సిన డబ్బుని సంపాదించడం కోసం మనిషిని గానుగెద్దులా పనిచేయించాలని, ఇలాంటి వస్తువులు కొనడంవల్లనే మనిషి విలువ పెరుగుతుందని పెట్టుబడిదారీ వ్యవస్థ రెచ్చగొట్టి మనిషిని పశువులా పనిచేయిస్తుంది. కొకకొలా నుండి బంగారం, వజ్రాల వరకు ఈ వస్తువుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ భూమ్మీద మనిషే మణిదీపం. ఆ ప్రాణానికి తెలివి, అవగాహన, ఆర్ద్రత, ప్రేమ, క్షమ, శ్రమ వంటి అదనపు అలంకారాలు లేకుండా అరుదుగా దొరికేవని చెప్పి కొన్ని రకాల రాళ్లూ, లోహాలతో అలంకారం చేసుకుని గొప్పలుపోవడం దేనికి సంకేతం? పైగా ఈ రాళ్లు, లోహాలు సంపాదించాలంటే పై విలువలన్నీ ఫణంగా పెట్టాలి. 
రాత్రిపగలు కష్టపడి, ఆందోళనా ఆదుర్దా పడి, సమయానికి తిండితినకుండా కష్టపడి సంపాదించిన డబ్బుకి తాను విలువిస్తున్నానని గుండాయన ప్రతి అరగంటకొకసారి, ప్రతి పత్రికలో చెబుతూంటే, వాడూ ఒక వ్యాపారస్తుడని, అమాయక జనాన్ని ఉచ్చులోకి లాగుతున్నాడని, దీనికోసం కోట్లాదిరూపాయలు అడ్వర్టైజ్‌ మెంటుల్లో ఎరగా పోస్తున్నాడని ఎందరికి అర్థమయ్యేను? నిజానికి పిల్లలకోసం సమయం గడపని ఏ తల్లిదండ్రీ వారికి మంచి భవిష్యత్‌ ఇవ్వజాలడని ఎన్నోజీవితాల్ని దగ్గరగా చూసిన అనుభవంతో చెప్పగలను. అభివద్దిచెందిన ఏదేశాల్లోనైనా ఇలా బంగారం, వజ్రాలను వారసత్వంగా, బహుమతిగా పిల్లలకివ్వడం చూశామా? మంచి చదువు, నడత, విలువలే కదా ఆస్తి అంటే?! 

ఈ బంగారు, వెండిల కోసం మధ్యతరగతి, కింది తరగతి జీవితాలు ఎంతగా చిధ్రమయ్యాయో ఎవరికి అర్థం కాగలదు? బంధాలు కాదు, ప్రాణాలే తీసుకుంటున్నారు. పొలంలో కూలిపనిచేసే మనిషిని కిలో బియ్యం ఎంత అనడిగితే తడబడుతుందిగానీ, జీవితకాలమంతా కలిపి పదికాసుల బంగారం కొనే తను, తులం బంగారం ధరమాత్రం టకీమని చెప్పగలదు. ఈ బంగారం పెళ్లిపీటలమీద పెళ్ళి ఆపేయగలదు, కన్నబిడ్డలమధ్య విభేధాలు తేగలదు, అవమానాలు సష్టించగలదు, ఆత్మన్యూనత రప్పించగలదు, ఉదయపు వాకింగ్‌ లో గొంతులు తెంపగలదు, నిన్ననే హాస్పిటల్‌ వద్ద చెప్పాడు, వద్దంటే వినకుండా పొలంవద్ద కాపలా వెళ్లిన ముసలమ్మ తలమీద బండరాయితో మోది గాజులు, కాళ్ల కడియాలు ఎత్తుకుపోయారని, బ్రతకడం కష్టమని! అభౌతిక జీవితనికి కనీస విలువ ఇవ్వని ఈ జాతి ఆధ్యాత్మిక చింతన, ఆ జీవితం సంపాదించిన వస్తువులకు ఎందుకు విలువిచ్చిందో అర్థంకాదు. ఏ గుడిగోపురాలైనా దగద్దగమానాయమై ఎందుకు వర్దిల్లుతాయో చెప్పరు. ప్రపంచంలో అత్యధికంగా ఈ లోహాల్ని పోగేసుకున్న దేశంగా ఎందుకు తయారయ్యిందో తెలియదు. పొలంలో విత్తనానికో, చేతివత్తులకు పెట్టుబడిగానో, అవసరాలకు ఆలంబనగానో వుండాల్సిన డబ్బు ఇలా లోహంగా ఎందుకు అనర్థంగా పోగుపడడం ఎన్నాళ్లు? 
బంగారం ఒక పొదుపుగా చూసే పనికిమాలిన అలవాటు ఈ దేశంలోనే వుంది. 
(ఇది రాసేటప్పటికంతా వివాహానికి గుర్తుగా వేలికున్న బంగారు వుంగరం తీసేసి రాస్తున్నా. సహచరికి ఎప్పటినుండో చెబుతున్నా, నువ్వే బంగారం, గొంతులో ఆ గొలుసెందుకు? బంధం అందరికీ తెలిశాక తాళి ఎందుకు? అని!)  – Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply