కరవు సీమ లో హరిత గ్రామం

Google+ Pinterest LinkedIn Tumblr +

మీరు ఇప్పటి వరకూ ఇళ్లు, విల్లాలు కట్టేవారిని చూసి ఉంటారు. అపార్టుమెంట్లు కట్టే వారినీ చూసి ఉంటారు. కానీ ఓ గ్రామాన్ని నిర్మించిన వ్యక్తిని ఎప్పుడైనా చూశారా. బహుశా చూసి ఉండరు. కానీ ఇప్పటి గ్రామాలకు పూర్తి భిన్నంగా కల్యాణ్ అక్కిపెద్ది సృష్టించిన ఈ అత్యాధునిక పల్లె గురించి తెలుసుకుంటే.. మీ ఆశ్చర్యానికి అంతు ఉండదు. ఔను పల్లెటూరు అంటే పూరి గుడిసెలు, విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లు, కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల, రాళ్లు తేలిన రహదారులు.. ఇలాంటి దృశ్యాలే మనకు తెలుసు. …..

అక్కిపెద్ది కల్యాణ్ సృష్టించిన ఈ నవతరం పల్లెలో మాత్రం ఇలాంటి ఇబ్బందులు మచ్చుకైనా కానరావు. అంతేకాదు. ఈ గ్రామం పూర్తిగా స్వయంపోషకం. ఆధునికమైన పేరు ప్రోటో విలేజ్.. విద్యుత్ కోసం ప్రభుత్వంపై ఆధారపడదు. సౌర, వాయు విద్యుత్ ఉత్పత్తి ద్వారా తానే కావలిస్తే ఎవరికైనా సరఫరా చేస్తుంది కూడా. వర్షపునీటిని సద్వినియోగం చేసుకుంటుంది. ఆ నీటితోనే పంటలు పండిస్తుంది. అత్యాధునికమైన విద్యా వసతులు ఇక్కడి ప్రోటో విలేజ్ ప్రత్యేకం. ఇళ్లు కూడా ఆధునిక సౌకర్యాలతో ఉంటాయి. కుటీర పరిశ్రమలూ ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఓ స్కేట్ బోర్డ్ పార్క్ కూడా ఉంది. ఇదంతా చూసి ఇదేదో మహానగరం పక్కనో.. పట్నం పొలిమేరల్లోనో ఉన్న గ్రామం కాదు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలోని టేకులోడు అనే మారుమూల పల్లె దగ్గరలో ఉంది.

అనంతపురం జిల్లాకే చెందిన కల్యాణ్ కు పల్లెటూళ్లంటే ఎంతో అభిమానం. అవి అనేక విషయాల్లో దీనంగా సర్కారు సాయం కోసం ఎదురుచూడటం గమనించాడు. అప్పుడే అతడు స్వయంపోషకమైన పల్లె కోసం ప్రోటో విలేజ్ కలగన్నాడు. దాన్ని నిజం చేసుకునేందుకు రెండేళ్లపాటు దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి ఆధునిక పద్దతులపై అధ్యయనం చేశాడు.

చివరకు సొంత జిల్లాకు చేరుకుని ఈ టేకులోడు గ్రామాన్ని ఎంచుకున్నాడు. అక్కడ కొంత బంజరు భూమి కొన్నాడు. స్వయంపోషక గ్రామ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అతడు ఆ బంజరు భూమిని.. పర్యావరణహితంగా.. స్వయంపోషకంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దిన తీరు అపూర్వం.

Farming in Proto Village,Anantapuram district

ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఏదో చెప్పేస్తే ఆ పల్లెటూరి జనం అంత సులభంగా నమ్మరు. ఈ విషయం కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకే కల్యాణ్ ఆ గ్రామంలోని అతి తక్కువ ఆదాయం ఉన్న ఓ బడుగు రైతు ఇంట్లో కొంతకాలం బస చేశాడు. వారితో కలసి పొలం పనికి వెళ్లాడు. వారిలో ఒకడిగా కలసిపోయాడు. ఆ తర్వాత వారికి ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా ఆదాయం ఎలా పెంచుకోవచ్చో చెప్పాడు. చెప్పడమే కాకుండా ఆచరించి చూపాడు. ఆ కుటుంబ ఆదాయం పెంచి చూపించాడు. దీంతో కల్యాణ్ కొత్త రకం పద్దతులపై ఆ కుటుంబానికే కాదు.. ఆ గ్రామస్తులకూ గురి కుదిరింది. అవును మరి మాటలు చెప్పే వారి కంటే
వాటిని ఆచరించే చూపే వారిని నమ్మకుండా ఉంటారా ఎవరైనా.

trenches in proto village farm

అలా గ్రామస్తుల్లో కలసిపోయాక.. తన ప్రోటో విలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఆ నవతరం గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ మరొకరికి సాయం చేయాలి. అదీ నియమం. అలా ఒకరికొరు సాయం చేసుకుంటూనే ఇళ్లు కట్టుకున్నారు. గ్రామంగా ఏర్పడ్డారు. ఇక్కడి ఇంటి నిర్మాణానికి ఖర్చు కూడా ఏమీ కాదు. అంతా స్థానికంగా దొరికే వస్తువులతోనే నిర్మాణం చేసుకుంటారు. సిమెంట్ వాడరు. ఎద్దులతో లాగే గానుగ ద్వారా తయారు చేసిన సున్నపురాయి, మట్టితోనే ఇళ్లు కట్టుకున్నారు. అంతే కాదు. ఆ ఇళ్లలో ఆధునిక సౌకర్యాలు అన్నీ అమర్చుకున్నారు.

ఓ ఆశయం కోసం యజ్ఞంలా పని చేస్తుంటే.. ఇతరులు సాయం అందిస్తారు. అలాగే ప్రోటో విలేజ్ నిర్మాణం కోసం కల్యాణ్ చేస్తున్న ప్రయత్నం మెచ్చిన ఓ స్నేహితుడు ఆ గ్రామస్తులకు ఓ విద్యుత్ తయారు చేసే గాలిమరను బహుమతిగా ఇచ్చాడు. దీంతో వారు గ్రామానికి అవసరమైన విద్యుత్‌ను తయారు చేసుకుంటున్నారు. సోలార్ విద్యుత్‌నూ వాడుకుంటున్నారు.

Kalyan Akkipeddi.with family

కల్యాణ్ ఇక్కడి వ్యవసాయ పద్దతులను సమూలంగా మార్చేశాడు. పొలాల్లో విరివిగా నీటి కుంటలు తవ్వి జలాశయాలుగా మార్చారు. మూసపద్దతిలో వ్యవసాయం చేయకుండా డిమాండ్‌ మేరకు పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్నారు. ఒక్క వ్యవసాయమే గ్రామానికి సరిపడా ఆదాయం అందించదని కల్యాణ్ కు తెలుసు. అందుకే సబ్బుల తయారీ వంటి కుటీర పరిశ్రమనూ ఏర్పాటు చేశాడు. ఆ గ్రామంలోని పిల్లల కోసం మాయాబజార్ పేరుతో ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న ఆధునిక పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయులు బోధన కంటే వారు స్వయంగా నేర్చుకునేదే ఎక్కువ. పిల్లల మానసికానందం కోసం ఓ స్కేటింగ్ గ్రౌండ్‌ కూడా రూపొందిస్తున్నాడు కల్యాణ్.

ఇలా ఒకటా రెండా.. కల్యాణ్ కృషితో ఓ స్వయం పోషక గ్రామం రూపుదిద్దుకుంది. ప్రగతిపథంలో దూసుకువెళ్లాలనుకునే గ్రామాలకు దిక్సూచిగా మారింది. ప్రోటో విలేజ్ కల సాకారం చేసుకున్నకల్యాణ్.. ఇలాంటి గ్రామాల రూపకల్పన కోసం ఎవరైనా ముందుకొస్తే వారికి అన్నివిధాలా సాయపడతానంటున్నాడు. ఈమెయిల్ అడ్రస్ : info@protovillage.org.

Share.

Leave A Reply