వైద్యం లేని భద్రాద్రి మన్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

వాళ్లకు రోగాలు వస్తే, వైద్యుడి కోసం,వాగులు వంకలు దాటి, మైళ్ల కొద్దీ దూరం నడవాలి.ఆకలైతే, తిండి లేక చచ్చిపోవాలి.మరో దారి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో జీవిస్తున్న గొత్తికోయల జీవన చిత్రం ఇది. 

Labour room@rallachiluka acasam
Dr.Narender,with patient


జబ్బుపడితే ఇబ్బందులే… 
గుట్టల మధ్య ఉన్న అటవీ ప్రాంతమది. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారులు లేవు. అలాంటి చోట బతుకుతున్న ఓ వద్ధుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు, భార్య తప్ప ఎవ్వరూ లేరు. ఈ దుస్థితిని చూసిన ఓ యువ వైద్యుడు మరో ఇద్దరు గ్రామస్తులను తోడు తీసుకొని రోగిని డోలీ (జెట్టీ) కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి చేర్చాడు. 
లక్ష్మీదేవిపల్లి మండలంలో గండ్రబందగుంపు(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) గ్రామస్తుడు నందయ్య కాళ్లు చేతుల్లో సత్తువ క్షీణించింది. నిరాశతో మంచాన పడ్డాడు. భార్య కోశమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇది తెలుసుకొని, ఆ గ్రామ సమీపంలోనే గిరిజనులకు వైద్య సేవలందిస్తున్న హోమియో డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌ ఆ గ్రామానికి వచ్చి, రోగిని పరీక్షించి, చేయి, కాలు పనిచేయకపోవడంతో పక్షవాతంగా నిర్ధరించి, సరైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లాలని సలహా ఇచ్చాడు. గ్రామం నుండి బయటకు రావడానికి దారి లేదని, స్ధానికులు చెప్పటంతో డాక్టరే జెట్టీ కట్టి, అయిదారు కిలోమీటర్లు నడిచి చింతకుంటకు తీసుకొచ్చి, అక్కడి నుంచి 108 వాహనంలో కొత్తగూడెం ఆసుపత్రిలో చేర్పించి, నందయ్యను కాపాడారు. ఇది గత నెల 24న జరిగిన సంఘటన. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అక్కడ లేక పోవడం వల్ల ఏర్పడిన దుస్ధితి ఇది. 
కారణాలు ఇవీ… 
దాదాపు 300 కుటుంబాల గొత్తెకోయలు జీవిస్తున్న ఈ ప్రాంతంలో చేతిపంపులు, బావులు లేక పోవడంతో వాగులు వంకల్లోని, బురదనీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. 30 ఏండ్ల క్రితం వలస వచ్చిన వదలాది మంది గొత్తెకోయ కుటుంబాలు పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల లోని అటవీప్రాంతాలలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. 
అందని సర్కారీ పథకాలు 
అడవుల్లో చింతపండు, ఎలక్కాయలు, బంక, చిల్లగింజలు, తేనె ఇప్పపువ్వు, తునికి, పాల, పరికిపండ్లు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆధార్‌, ఓటర్‌ కార్డులు అందజేసినప్పటికీ సంక్షేమ పథకాలు వీరి ఆవాసాల వైపు చూడవు. గుట్టలు,పుట్టల మధ్య బతుకుతున్న గొత్తెకోయలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, ఇళ్లు, పాఠశాలలను ఏర్పాటు చేస్తే,వారి జీవితాలు మెరుగవుతాయి. ఎండాకాలంలో కాలువలు, కుంటలు ఎండిపోవడంతో నీరు దొరకక ఇటు వానా కాలంలో వచ్చే బురదనీరు తాగలేక చావలేక బతుకుతున్నారు. 


మహిళల్లో రక్తహీనత 
వాగుల్లో బురద నీరు తాగడంతో వద్ధులు, చంటిపిల్లలు రోగాల బారిన పడుతున్నారు. నిత్యం జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలతోనే కాలం వెల్లదీస్తున్నారు. 
ఈ ప్రాంతంలోని పది గ్రామాలకు చెందిన 35 మంది మహిళలకు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ నరేందర్‌ వైద్యపరీక్షలు చేయించగా, వారిలో 33 మందికి రక్తహీనత ఉందని నిర్ధరణ అయింది. ఎక్కువ శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ. రక్తహీనత బారిన పడుతున్నారు. ముఖాలు పాలిపోయి, బక్కచిక్కి అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్‌ నరేందర్‌ తన సొంత ఖర్చుతో వారందరికీ, గోధుమలు,జొన్నలు,పల్లీ పిండితో చేసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నెలలో 15 రోజులు గిరిజనుల మధ్య ఉండి సేవలందిస్తున్నారు. 


Clinical and Community Health study in pregnant women , Lactating mothers and Under 5 Age children’s at Kranthi nagar hamlet 

To, Rajat Kumar Saini IAS , District Collector,VP.Gowtam IAS,PO,ITDA
Bhadradri Kothagudem District.

\” ఎవరూ పట్టించుకోని మా ఆవాసాల వైపు మీరొక సారి రావాలి సారూ. 
ఎండా, వానా, శీతాకాలం అనే భేదాలు లేకుండా మేము రోగాల పాలవుతున్నాం. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను మా వైపు చూడమనండి. 
ఉపాధి హామీ పనులు లేక, రేషన్‌ సరుకులు లేక పస్తులుంటూ ఆకలిని తట్టుకోలేక చెట్లమీది కీటకాలను తింటున్నాం. 
మా పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రం లేదు. అందుబాటులో స్కూల్‌ లేదు. 
మాకు కరెంట్‌ ఎలా ఉంటుందో తెలీదు. రాత్రులు మా గుడిసెల చుట్టూ జంతువులు తిరుగుతున్నాయి. రోగాలోస్తే పట్నం పోవడానికి దారులు కూడా లేవు. మా కనీస అవసరాల తీర్చి ఆదుకోండి….” 
ఇట్లు 
గొత్తి కోయ గిరిజన కుటుంబాలు 
పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాలు 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  .

Share.

Leave A Reply