సామాజిక బాధ్యత అంటే ఇదేనా, మెగా స్టార్ గారూ?

Google+ Pinterest LinkedIn Tumblr +

(Aranya Krishna)

సామాజిక బాధ్యత గురించి చిరంజీవి మాట్లాడినంతగా బహుశా మరే సినిమా హీరో మాట్లాడరు. ఆయన ఓ మాజీ రాజకీయ నాయకుడు కూడా! కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. పదవి వచ్చే అవకాశం లేకపోవటంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చేసారు. ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన మెగా హీరో అయితే ఆయన కుటుంబమే మెగా కుటుంబమనే పేరు సంపాదించుకున్నది. లక్షలాదిమంది అభిమానులున్న నటుడు. ఆయన ప్రతిభావంతుడైన నటుడే కావొచ్చు కానీ రాజకీయ అవకాశవాదం, స్వార్ధం వంటి లక్షణాల వల్ల వ్యక్తిగా ఆయన పట్ల నాకు చాలా ఫిర్యాదులున్నాయి. ఆయన రాజకీయ జీవితం గురించి, బాధ్యత లేని ఆయన సినిమాల గురించి ఇప్పుడు చర్చించ దలుచుకోలేదు. కానీ సామాన్య జన జీవితాల్ని అతలాకుతలం చేసి చావు బతుకుల్లోకి నెట్టిన కరోన సందర్భంలో ఆయన వ్యవహార శైలి చెప్పదలుచుకున్నా.

Aranya Krishna1
Aranya Krishna1

చెప్పా పెట్టకుందా పిడుగుపాటులా విధించిన లాక్డౌన్ సమయంలో లక్షలాది కుటుంబాల మనుగడ ఇబ్బందుల పాలైంది. ఆ సమయంలో ఆయన వందల కోట్లతో కొండమీదెక్కడో కట్టుకున్న తన ఇంటి వీడియోలు విడుదల చేసారు మీడియాకి. “ఆహా ప్రకృతి ఎంత అద్భుతంగా వుంది?” అంటూ మురిసిపోయారు. స్విమ్మింగ్ పూల్ తో కూడిన రాజ ప్రసాదం లాంటి తన ఇల్లు, గార్డెన్, అల్ట్రా మోడర్న్ కిచెన్ చూపించారు. ఆ కొండ కింద తనని ఇంతవాడిని చేసిన జన జీవితం స్తంభించి, తిండి కోసం పేదలు తిప్పలు పడుతున్న సందర్భంలో తన “వల్గర్ డిస్ప్లే ఆఫ్ రిచ్నెస్”కి పూనుకున్నారాయన. నాకైతే ఏమిటీ తెంపరితనం అనిపించింది. అసలాయనకి ఎలా మనసొప్పిందో అర్థం కాలేదు. త్యాగాలు చేయకపోవచ్చు. కానీ తన గొప్పదనాన్ని ప్రదర్శించుకునే సమయమా అది? మీడియా కూడా సిగ్గు లేకుండా ప్రచారం ఇచ్చింది.

మొన్నామధ్య తనకి కరోన వచ్చినట్లు ఆయనే ప్రకటించారు. మళ్లీ నెగెటీవ్ వచ్చిందన్నారు. ఆ వెంటనే వెటరన్ దర్శకుడైన కె.విశ్వనాథ్ ఇంటికి సతీ సమేతంగా వెళ్లి పలకరించారు. విశ్వనాథ్ కి ఇప్పుడు 90 ఏళ్ల పై మాటే! విశ్వనాథ్ గారి భార్యకి 80 ఏళ్లు పైనే వుండొచ్చు. ఆయన అలా చేయటం సామాజిక బాధ్యతరాహిత్యం. ఏదైనా అత్యవసరమైన పని వుంటే తప్ప బైటకి వెళ్లోద్దు అని మనం ఫోన్ చేసినప్పుడల్లా వచ్చే సందేశం. స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు అన్నీ వర్క్ ఫ్రం హోం ని అనుసరిస్తున్నాయి. ప్రపంచం మొత్తం కరోన పూర్తిగా కనుమరుగయ్యేవరకు విర్చువల్ గానే నడవాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఇప్పటికీ ప్రజల కదలికలు పూర్తిగా నియంత్రించబడటం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఇటువంటి సందర్భంలో తానే స్వయంగా అ వృద్ధ దంపతుల్ని కలిసి పలకరించి, ఆలింగనాలు చేసుకొని, దానికి మీడియాలో విస్తృత పబ్లిసిటీ ఇవ్వటమేమిటి? ఇది కరోన తీవ్రతని తక్కువ చేసీ చూపటం కాదా? ఎంతో మంది ప్రముఖులు కరోన బారిన పడ్డారు. నిన్నటికి నిన్న బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర చటర్జీ కన్ను మూసారు కరోన కారణంగానే. నేను విశ్వనాథ్ గారి ఆరోగ్యానికి బహుశా కలగబోయే చేటు గురించి కంటే చిరంజీవి వ్యవహార శైలి ఇచ్చే పరోక్ష సందేశం గురించే ఆలోచిస్తున్నాను. ఈ విపత్కర పరిస్తితుల్లో చిరంజీవి విశ్వనాథ్ ని కలవటం లక్షలాది మంది ఆయన అభిమానులకి, సామాన్య ప్రజలకి ఏం సందేశం ఇస్తుంది? కరోన పెద్ద సీరియస్ వ్యవహారమేమీ కాదు, లైట్ తీసుకోండి అనా? ఇది పైకి చిన్న కనబడే పెద్ద తప్పు.

అలాగే ఈ మధ్య చిరంజీవి, నాగార్జున కేసీఆర్ గారిని కలిసారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోల్లో అందరూ మాస్క్స్ వేసుకొని కనబడ్డారు, ఒక్క ఈ ముగ్గురు తప్ప! ముఖ్యమంత్రులూ, మెగాస్టార్లూ కోవిడ్ ప్రోటోకాల్స్ ని అనుసరిస్తే ఎంత ప్రభావవంతంగా వుంటుందో వాళ్లు దాన్ని పాటించకుండా పబ్లిక్లో కనబడినా అంతే దుష్ప్రభావం వుంటుంది.

ఇదేనా సామాజిక బాధ్యత అంటే చిరంజీవిగారూ?

Share.

Leave A Reply