ఆకుపచ్చని తల్లి, గొడిగార్‌ పల్లి

Google+ Pinterest LinkedIn Tumblr +

మెదక్‌ జిల్లా , కోహీర్‌ మండలం, గొడిగార్‌ పల్లి గ్రామంలో వ్యవసాయ భూమింతా ఎర్రమట్టి, నల్లమట్టి మిశ్రమం. జొన్న, అల్లం, ఆలుగడ్డ, చెరకు పంటలకు అనువైన నేల ఇది.
ఐతే ఇక్కడ దశాబ్దాలుగా భూగర్భ నీటి సంరక్షణను నిర్లక్ష్యం చేశారు. తక్కువ వర్షపాతం, అపుడపుడూ కురిసిన వానలు కూడా, పంటపొలాలమధ్య నుంచి పొంగి పొర్లుతూ దిగువ ప్రాంతాలకు వృధాగా పోయేవి. సారవంతమైన మట్టి కొట్టుకు పోయేది.
భూగర్భ జలాలు లేక, పంటలు సరిగా పండేవి కావు. సాగుబడి లేక, ఆదాయం రాక రైతులు నగరాలకు వలసలు పోయే వారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఊరు ఖాళీ అవుతుందని భావించిన గ్రామస్తులు ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒకరోజు పంచాయతీ ఆఫీసులో గ్రామసభ పెట్టి, నీటి సంరక్షణ పనులు చేసుకోకపోతే పంటల పండించడం కష్టమని,కరవు ప్రాంతంగా మారిపోతుందని,దీనికి తగిన పరిష్కారం చూడాలని తీర్మానం చేశారు.
అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన పెద్దలు కొందరు ఎగువన కురిసిన వాన నీటిని నిలపాలంటే చెక్‌ డ్యామ్‌ నిర్మించుకుంటే నీటిసంరక్షణ జరుగుతుందని సలహా ఇచ్చారు.
అందరి ఆమోదంతో వెంటనే అంచనాలు రూపొందించి, చెక్‌డ్యామ్‌కి అనువైన ప్రాంతాన్ని గుర్తించి జిల్లా పాలనాధికారుల ముందుంచారు. గొడిగార్‌పల్లి ప్రజల సమష్టి నిర్ణయం ప్రభుత్వ అధికారులను సైతం ఆలోచింప చేసింది. డ్వామా ద్వారా నిధులు మంజూరయ్యాయి.
నెల రోజుల పాటు గ్రామీణులంతా శ్రమదానం చేసి, 2010లో చెక్‌డ్యామ్‌ నిర్మించుకున్నారు. గత ఎనిమిదేండ్లుగా వానలు కురిసినపుడు సారవంతమైన మట్టి కొట్టుకు పోకుండా , నీరు నిల్వ ఉండేలా చెక్‌ డ్యామ్‌ ఆపుతోంది. భూమిలో తేమ శాతం పెరిగింది. గొడిగార్‌ పల్లిలో నేడు ప్రతీ రైతు ఆనందంగా ఉన్నాడు. వరి, మొక్కజొన్న పుష్కలంగా పండుతున్నాయి. 45 ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది.
జల మట్టం పెరిగింది
”ఈ చెక్‌ డ్యామ్‌ వల్ల మా గ్రామంలో ఎనిమిది బోర్లలో నీటిమట్టం పెరిగింది. సంవత్సరమంతా బోర్లలో నీళ్లు
ఉంటున్నాయి. 30 మంది రైతుల పొలాలకు నీరు అందుతోంది. గతంలో కంటే దిగుబడి అధికమైంది. బంజరు భూమిని బంగారంగా మార్చి, మా గ్రామాన్ని సుసంపన్నం చేసుకోవడానికి చెక్‌డ్యామ్‌ ఉపయోగ పడింది.” అని స్థానిక రైతు వీరన్న అంటున్నాడు.
ఇవీ ఫలితాలు
1, ఈ రైతుల సమిష్టి నిర్ణయం వల్ల తమ గ్రామాన్ని కరవు నుండి కాపాడుకున్నారు.
2, చెక్‌ డ్యామ్‌ నిర్మాణ వల్ల సాగు నీరే కాదు, పశువులకు కూడా నీరు అందుతోంది. పంటలతో పాటు పశుపోషణ కూడా పెరిగింది.
3, కోహిర్‌ మండలం అల్లం పంటకు ప్రసిద్ధి. చెక్‌డ్యాం నిర్మాణం వల్ల గొడిగార్‌పల్లి రైతులు అల్లం కూడా పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం బాగు పడటం వల్ల వలసలు తగ్గాయి.
……………
శ్యాంమోహన్‌ , Image Credits: M.S.Reddy

Share.

Leave A Reply