బొట్టు బొట్టు ఒడిసిపడితే…?

Google+ Pinterest LinkedIn Tumblr +

భూగర్భ జలాలు అడుగంటిన గ్రామాల్లో మంగళగూడెం(ఖమ్మం రూరల్‌మండలం) ఒకటి. 2009లో ఆక్కడ రైతులు సాగు చేయాలంటే చాలా కష్టాలు పడేవారు. వానలు పడినపుడు మిర్చి పండించినా ఎకరాకు 7 క్వింటాలు కూడా దిగుబడి వచ్చేది కాదు. ఇక కూరగాయలు పండించాలంటే సాగునీరు లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో జాగృతి స్వచ్ఛంద సంస్థ ఈ ప్రాంతంలో రైతుల భాగస్వామ్యంతో జలసంరక్షణ పనులు మొదలుపెట్టారు. 
మంగళగూడెం రైతులను ఐక్యపరిచి జల సంరక్షణపై అవగాహన కల్పించి వాననీటిని చెక్‌డ్యామ్‌లు, రాతికట్టల ద్వారా భూమిలోకి ఇంకింపచేసే పద్ధతులు వివరించారు. కోన వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా వాటర్‌షెడ్‌ గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. 
జలసంరక్షణ ఇలా: 
మంగళగూడెం వాటర్‌షెడ్‌ పరిధిలో 200 ఎకరాలు సాగులోకి వచ్చింది. వరి, మిర్చి, కూరగాయలు సాగు చేస్తున్నారు. గతంలో పది క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చిన మిర్చి వాటర్‌షెడ్‌ కార్యక్రమం అనంతరం భూగర్భ జలాలు పెరగడంతో 20 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. 
గుట్టల కింద కందకాలు, ఫారంపాండ్స్‌ నిర్మాణంలో 60 శాతం ప్రజలు శ్రమదానం చేసి పనులు పూర్తిచేశారు. 400 బావులు నిండాయి. వేసంగిలో కూడా సాగునీటికి లోటు లేదు. వ్యవసాయ భూముల ధరలు పెరిగాయి. సాగుభూమి విస్తీర్ణం 80 ఎకరాలు పెరిగింది. 
సామాజిక మార్పు : 
వాటర్‌షెడ్‌ కార్యక్రమంలో భాగంగా భూమి లేని పేదలు 250 మందికి జీవనోపాధుల మెరుగుదలకు నాబార్డ్‌ ద్వారా రుణాలిచ్చారు. వీటితో కిరాణాషాపులు, పశుపోషణ, బార్బర్‌ షాపులు పెట్టుకొని సుస్థిర జీవితం గడుపుతున్నారు. భూగర్భజలాలు పెరగడంతో భూముల విలువ పెరిగింది. 2008లో ఎకరం రూ. 2 లక్షలున్న భూమి నేడు రూ. 12 లక్షల ధర పలుకుతోంది. ప్రజల ఆర్థిక స్థితిగతులు మారాయి. ప్రధాన పంటలతో పాటు నిమ్మ, జామ తోటలు పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నట్టు వాటర్‌షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ కోన వెంకటేశ్వర్లు అన్నారు. దిగుబడులు పెరగడంతో 5 రైతు క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. 
ఇవీ ఫలితాలు 
1, చెక్‌డ్యామ్‌ని నిర్మించడంతో పై నుండి వచ్చే వాగు నుండి నీళ్లు నిలిచి, అరవై ఎకరాలకు తేమ అందుతోంది. గతంలో బోరు వేసినా నీరు పడక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సిరికొండ రాములు నేడు తన రెండు ఎకరాల్లో నాలుగు రకాల పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్నాడు. 
2, జల సంరక్షణ వల్ల పొలాలకు సాగు నీరుతో పాటు ప్రజలకు తాగునీరు కూడా లభ్యమవుతోంది. ”750 కుటుంబాలకు ప్రతీ రోజు మంచి నీరు అందుతుంది. మేమంతా శ్రమదానం చేసి వాలు కట్టలు, రాతికట్టలు నిర్మించడం వల్ల నేడు భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంది” అంటారు రైతు బుర్రా సీతయ్య. 
3, సాగు నీరు అందడంతో కరవును జయించిన రైతులు పాడి,పంటలతో సుస్థిర ఆదాయం పొందుతున్నారు. 

4, నీటి జాడ లేక కరవుతో అల్లాడిన ఈ గ్రామం నేడు పచ్చగా మారింది. రైతులంతా గుట్టల మీది నుండి వచ్చే వర్షపు నీటిని నిలువచేసుకోవడానికి తమ పొలంలో చిన్న నీటి కుంటలు తవ్వుకుంటారు. 
5, ఎండాకాలంలో కూడా, పొలంలో పశువులకు, పక్షులకు దాహం తీర్చడానికి, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు, నీటికుంటలు ఉపయోగపడుతున్నాయి. 
6, దిగుబడులు పెరిగి రైతులు సుస్థిర జీవనోపాధులు పొందుతున్నారు. 

Share.

Leave A Reply