కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా, నా కొడకా…

Google+ Pinterest LinkedIn Tumblr +

కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా, నా కొడకా! MAVERICK AND A MAGNIFICENT POET ఎంత సరదా మనిషో. స్టైలిష్ గా వుంటాడు. లవ్లీ గా నవ్వుతాడు. పలకరింపుతోనే పడగొడతాడు. అరుణ్ సాగర్ ని చూస్తే ప్రేమించబుద్ధవుతుంది.. కరడుగట్టిన మగాళ్ళకైనా, కాంతులీనే ఆడవాళ్లకైనా! ఎందుకో తెలీదు. ఎంత నచ్చుతాడో గిట్టనివాళ్ళకైనా, కవిత్వం పట్టనివాళ్ళకైనా! మాటల్లో స్నేహాన్ని పంచియివ్వడంఅతనికే చేతనవును, గ్లాసులో పెగ్గు వొంచి యిచ్చినంత తేలిగ్గా. నాలాగా నీలాగా మామూలుగానే ఉంటాడా, ఐనా వో మెరుపేదో మెరిసి, ఒక చినుకేదో కురిసి, ఒక వలపేదో ఇంద్రధనస్సులా హృదయాకాశంలో విరబూస్తుంది. అరుణ్ సాగర్ గాణ్ణి ఆత్మీయంగా హత్తుకోవాలనిపిస్తుంది.

కబుర్లు… కబుర్లు చెబుతాడు. షార్ప్ గా జోకేస్తాడు. ఫక్కున నవ్వించే ఆ పంచ్, ఆ రిపార్టీ… తను నోట్లో షోగ్గా సిగిరెట్ పెట్టుకుంటే, ‘నేనే’ వెలిగించాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. Pleasure seeking, fun loving, happy go lucky … success driven … అని మనకి యిట్టే తెలిసిపోతుంది. మెట్రోపాలిటిన్ Rat race లో అతనో spoilt brat అనీ ఈజీగా కనిపెడతాం. ఇదంతా నిజం కాదని తెలియడానికి కొంత టైమ్ పడుతుంది. అతను – నాన్ సీరియస్ కాదనీ, సరదాల జల్సారాయుడూ కాదనీ, ఆడ సీతాకోకచిలకల చేలాంచలాల వెంటబడే మగపురుగు అస్సలు కాదనీ అర్థం కావడానికి నిజంగానే టైమ్ పడుతుంది. అరుణ్ సాగర్ కలల తీరం గోవా కాదనీ, గోదావరి జలాల్లో మునిగిపోతున్న గిరిజనుల కన్నీటి బతుకులు ఆ కవిని కుదిపేస్తున్నాయనీ అవగతం కావడానికి తప్పకుండా ఇంకొంత కాలం పడుతుంది.

ఆరోజు సాగర్ పుట్టినరోజు. ఏ సంవత్సరమో గుర్తులేదు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సాయంకాలం వో భారీ get together.నా భార్య నళినికి చాలామంది జర్నలిస్టులు తెలిసినట్టే , అరుణ్ సాగరూ తెలుసు. టీవీ 9లో ఆ ప్రోగ్రాం బాగుందీ, ఈ సింగర్ బాగా పాడలేదు అని ఫోన్ చేసి చెబుతూవుండేది.

“మీ వొపీనియన్ నాకు చాలా ముఖ్యం. ఫోన్ చేసి చెబుతూవుండండి” అని సాగర్ నళినీతో అంటూవుండేవాడు. ఆ పార్టీ ధూంధాం గా జరిగింది. కవులు, రచయితలు, ఆర్టిస్టులు, జర్నలిస్టులు… మర్చిపోలేని సెలబ్రేషన్ అది. కే శ్రీనివాస్, ఆర్టిస్టు మోహన్, శిఖామణి, ప్రసాదమూర్తి, కూనపరాజు కుమార్, రజనీకాంత్… లిస్టు చాలా పెద్దది. ఒకమూల టేబుల్ దగ్గర జర్నలిస్టు సత్యవతి, నళిని, మరికొందరు రచయిత్రులు కూర్చున్నారు. పార్టీ నడుస్తోంది. స్త్రీలకి ప్రత్యేకించి ఖరీదైన వైన్ సర్వ్ చేశారు. ఎంతసేపూ కబుర్లూ, జోకులేనా? నళినీని పాట పాడమనరా.. అన్నాడు మోహన్. “ఈ పార్టీని నీ పాటే రక్షించాలి” అని భార్యని పొగిడాను. నవ్వుల నదిలో పువ్వుల పడవా కదిలే…మనసున మల్లెల మాలలూగెనే… వెన్నెలలోనే విరహమేలనో… అందానికి అందము నేనే, జీవనమకరందము నేనే.. మలయానిల లాలనలో…ఛాంగురే … ఛాంగు ఛాంగురే…పాట వెంట పాట… నళిని పాడుతూనే వుంది. సత్యవతీ, మిత్రులంతా ఆహా వోహో అంటూనే వున్నారు.

‘మీ ఆవిడ అసాధ్యురాల్లా వుందే’ అని స్నేహితులు నా భుజం చరిచారు. ఘుమఘుమలాడే భోజనంతో అరుణ్ సాగర్ పుట్టినరోజు పండగ ముగిసింది. కట్ చేస్తే.. మర్నాడు మధ్యాన్నం కవి శిఖామణి మోహన్ ఆఫీసుకి వచ్చాడు. రాసుకొచ్చిన పద్యాన్ని తీసుకొచ్చాడు. చదవమని నాకిచ్చాడు. నళినీ గురించి పోయెమ్. పాట బాగుంది సరే, నా ప్రేమ మాటేమిటి! నువ్వూ, నీ పాటా రెండూ కావాలి – అని కవి ప్రపోజల్. చదివి, నేను కించిత్ ఇబ్బందిపడ్డాను. శిఖామణి ఆ పోయెమ్ మోహన్ కి యిచ్చాడు. “బావుందబ్బా చాలా” అన్నాడు. నాలుగు రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి వివిధ పేజీలో ఆ పోయెమ్ వచ్చింది. “సాగర్ పార్టీలో పాట పాడిన నళినీ గారికి…” అని శిఖామణి రాశారు. ఆరోజు అరుణ్ సాగర్ నళినీకి ఫోన్ చేశాడు. “ఏరా సాగర్, అంత పార్టీ జరిగిందా? మమ్మల్ని పిలవలేదేం! ఆంధ్రజ్యోతిలో ఆ పోయెమ్ చూస్తేనేగానీ తెలియలేదు. మిత్రద్రోహి” అని చాలమంది స్నేహితులు ఫోన్లు చేశారని చెప్పాడు.

అరుణ్ సాగర్ నాకు తెలుసు. నేనూ తనకి తెలుసు. అంతే మేం స్నేహితులం కానేకాము. మోహన్ తమ్ముడిగా, జర్నలిస్టుగా నేను, రవిప్రకాష్ తర్వాత మీడియా స్టార్ గా, post modern poetగా… అలా మాత్రమే సాగర్ తెలుసు. తక్కువ తెలుగు, ఎక్కువ ఇంగ్లీష్ తో ‘మేల్ కొలుపు’ రాస్తాడనీ తెలుసు. 2011 డిసెంబర్, మోహన్ కి 60 ఏళ్లు. ఏమైనా చెయ్యాలి అనుకున్నా. టీవీ 9 ఆఫీసుకి వెళ్లాను. సాగర్ని కలిశాను. “నేను ప్రకాష్. మోహన్ త…” అయ్యో! మీరు తెలియకపోవడం ఏంటీ! చెప్పండి – అన్నాడు. “మోహన్ 60” అని వివరించాను.మర్నాడు ఉదయం మోహన్ దగ్గరికి కారేసుకుని వచ్చాడు. దుర్గం చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. తాటాకుల పాక టీకొట్టు, మూసేసి వుంది. అక్కడో సన్నని చెక్కబల్ల. “మోహన్ సర్, ఇక్కడ కూర్చోండి. ఇంటర్వ్యూ చేస్తాను” అన్నాడు. కెమేరా కదిలింది. చాలసేపు మోహన్ మాట్లాడాడు. ఇంటర్వ్యూ బాగా వచ్చింది. తర్వాత కొన్ని రోజులకే ఆంధ్రజ్యోతిలో “మోహనా, వో మోహనా!” అంటూ మోహన్ పై సాగర్ పెద్ద వ్యాసం రాశాడు. అరె, సాగర్ కి మోహన్ ఇంత బాగా తెలుసా! అని ఆశ్చర్యపోయాను. రచయిత కూనపరాజు కుమార్ కొంతకాలం సాగర్ తో కలిసి పనిచేశాడు టీవీలో. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ఈవెనింగ్ పార్టీకి నన్నూ పిలిచారు. కొంచెం లేట్ గా వెళ్ళాను. సాగర్, కుమార్, మరో 15, 20 మంది… పార్టీ నడుస్తోంది. సాగర్ నన్ను కొందరికి పరిచయం చేశాడు.

ఒక టీవీ జర్నలిస్టు, “ప్రకాషంటే?” అన్నాడు. “మోహన్ తమ్ముడంటారు గానీ, ఆయన జర్నలిస్టు, రాయడు గానీ… ప్రకాష్ రాయడం మొదలుపెడితే ఇక ఎవ్వరూ మిగలరు” అన్నాడు అరుణ్ సాగర్. నేను అప్పటికే రాయడం మానేసి, జర్నలిజం వదిలేసి చాలా ఏళ్ళయిపోయింది. గతంలో నేను రాసినవి ఏవన్నా సాగర్ చదివే అవకాశం లేదు. నాతో కలిసి పనిచేసిన ఖమ్మం జర్నలిస్టులెవరన్నా చెప్పారేమో తెలీదు. అది సాగర్ సహృదయత! అయినా మేం స్నేహితులం కాదు. Just we know each other.

2016 జనవరి నెల. బాగ్ లింగంపల్లి నుంచి ఆటోలో బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని మోహన్ ఆఫీసుకి వెళ్తున్నాను. లక్డీకాపూల్ దాటుతుండగా, నా ఫోన్ రింగయింది. “ఎక్కడున్నారు?” సాగర్ అడిగాడు. “మోహన్ దగ్గరికి వెళుతున్నా” అని చెప్పాను. “వోకే. ఇద్దరూ కలిసి ప్రెస్ క్లబ్ కి వచ్చేయండి. 20 నిమిషాల్లో నేనక్కడ వుంటాను” అని చెప్పాడు. “తప్పకుండా రండి. మిస్ కాకండి” – హెచ్చరించాడు.మోహన్ రాలేనన్నాడు. వొక్కన్నే ప్రెస్ క్లబ్ కి వెళ్ళాను. అరుణ్ సాగర్ కవిత్వం “మ్యూజిక్ డైస్” మల్టీ కలర్ పుస్తకం రెండు కాపీలు యిచ్చాడు. “మోహన్ సర్ ని రెవ్యూ రాయమనండి. మీరు కూడా రాయరాదూ…” అన్నాడు. మోహన్ కి చెప్పాను. తప్పకుండా రాస్తానన్నాడు.

సాగర్ నాలుగు రోజుల్లోనే మోహన్ కి రెండుసార్లు ఫోన్ చేసి రాయమని అడిగాడు. ఇన్సిస్ట్ చేశాడు. “మోహన్ తో రాయించండి” అని నాతో అన్నాడు. ఎప్పుడూ ఏమీ అడగని మనిషి. Why is he so particular? చాల కాలం క్రితం స్టార్ హాస్పిటల్లో వున్న సాగర్ ని చూడ్డానికి వెళ్ళాం. లంగ్స్.. సీరియస్ ప్రాబ్లమే అని చెప్పారు. మరోసారి ఫ్రెండ్స్ ని అడిగాను. తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు.

‘మ్యూజిక్ డైస్’ చదివాను. ‘ఒక మరణవాంగ్మూలం’ అనే మాట సూటిగా గుచ్చుకుంది. తనింక కొన్ని రోజులే ఉంటాడనీ, డాక్టర్లు చెప్పేశారనీ.., సాగర్ కీ తెలుసుననీ… సన్నిహితులు చెప్పారు. ప్రాణం విలవిల్లాడిపోయింది.లాంగ్ డ్రైవ్ లూ, పార్టీలూ, స్నేహితులూ అంటూ easy గా వుండే సాగర్ ఇంత సీరియస్ కవా? నిర్వాసితులూ, విస్తాపితులైన గిరిజనుల దుఃఖాన్ని ఇంత గొప్ప కవిత్వంగా రాయడం మరొకరివల్ల అయ్యేపనేనా?భద్రాచలం డివిజన్ అనే మొదటి కవిత నుంచి, ఆఖరి ‘జలదీక్ష’ దాకా … ఎంత వేదన! ఎన్ని కన్నీళ్లు. అచ్చమైన, స్వచ్చమైన కవిత్వం! మునిగిపోయే ప్రాంతాలు, ముగిసిపోయే పేద గిరిజన జీవితాలు… గొప్ప concern తో రాశాడు ప్రతీ అక్షరం. అవి కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లు రా, నా కొడకల్లారా… అంటూ పట్టరాని కోపంతో వూగిపోయాడు.

మైదానవాసి నిర్వాసితుడవడం వేరు, ఆదివాసీ నిర్వాసితుడవడం వేరు. విస్తాపన గిరిజనుడికి మరణమే. వొరేయ్, వియార్ మర్దరర్స్.పొలాన్ని రక్తంతో పండిస్తారా ఎక్కడైనా!రుధిరమా, మన ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇంధనం?అని నిలేసి ప్రశ్నించాడు సాగర్. నీ జనమే పోరాడుతున్నచోటకనీసం గొంతయినా కలపకపోవడం నేరం – అనీ అన్నాడు. గోదాట్లో కలిసిపోతారొరేయ్.ఇది డెత్ సెంటెన్స్ – అని హెచ్చరించాడు.

2016, ఫిబ్రవరి 11 .‘మ్యూజిక్ డైస్’ కవిత్వం పుస్తకం వచ్చి కేవలం నెలరోజులయిందేమో!ఆనంద్ నగర్ కాలనీలో పొద్దున్నే పేపర్ చదువుకుంటున్నా. పెద్దగా ఏడుపు వినిపిస్తోంది, మా బెడ్రూమ్ లోంచి. నళిని గుండెలు అవిసిపోయేలా ఏడుస్తోంది. నాకు భయం వేసింది. ఏం జరిగింది? అని భుజమ్మీద చెయ్యేస్తే, సెల్ ఫోన్ చూపించింది. సాగర్ ఫోటో… ARUN SAGAR IS NO MORE – అనే MESSAGE …

సాగర్ నళినీకి మిత్రుడేమీ కాదు. తెలిసినవాడు, అంతే. ఒక్కసారి కలిసినా సాగర్ని మర్చిపోలేం. అది ఆ మానవుడి ప్రత్యేకత! సాగర్ నవ్వుతూ షేక్ హాండిచ్చినా చాలు, అదొక చెరగని సంతకం! భద్రాచలం గోదావరి కెరటాల మీంచి ఇప్పటికీ అతను నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తుంది.దూరాన్నించి ఆ విషాద సంగీతమేదో వినిపిస్తూనే ఉంటుంది….

Taadi prakash

చివరిమాట :ఆర్టిస్ట్ కారంకి శ్రీరాం, కూనపరాజు కుమార్, మువ్వా శ్రీనివాసరావు, నాగళ్ల దుర్గాప్రసాద్, అరుణ్ సాగర్ ఒక మిత్ర ముఠా. శ్రీరాం హరిశ్చంద్ర పద్యాలన్నా, రంగుల బొమ్మలన్నా, శ్రీరాం అమోఘంగా వండే అడవి పంది మాంసం కూరన్నా సాగర్ కి ఎంతో ఇష్టం. గోరటి వెంకన్న పాటనీ, డాన్స్ నీ శ్రీరాం మిమిక్రీ చేస్తే సాగర్ పడీపడీ నవ్వేవాడు. మందుపార్టీలని కొట్టిపారేస్తారు గానీ, అవన్నీ అందరం కలిసి బతికిన మధుర క్షణాలు. *రండి. 2021 ఫిబ్రవరి 11. విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో అందరం కలిసి సాగర్ ని తలుచుకుందాం. అతని కవిత్వాన్ని హృదయానికి హత్తుకుందాం.

TAADI PRAKASH 9704541559

Share.

Leave A Reply