ఒక కార్టూనిస్టు ప్రేమ పోరాటం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

” నన్ను నారాయణ అంటరు ,ఇదే ఆఫీసులో యాడ్స్‌ సెక్షన్‌ లో పనిచేస్తున్నా…” బంజారాహిల్స్‌లో ఒక డైలీలో పనిచేస్తున్నపుడు, ఫుల్‌ హ్యాండ్స్‌ వైట్‌ షర్ట్‌ని మోచేతులు వరకు మడిచి అమాయకపు నవ్వుతో నా సీట్‌ ఎదురుగా కూర్చొని అన్నాడు.
చేతిలో ఉన్న ఆల్బమ్‌ని నా ముందు పెట్టి తెరిచాడు… పత్రికల్లో వేసిన నా కార్టూన్లు కలక్షన్‌ అది. వాటిల్లో ఒక్కటి కూడా నా దగ్గర లేదు. నాకేనా అన్నట్టు చూశాను. జాగ్రత్తగా వెనక్కి తీసుకొని, తను గీసిన నాలుగు కార్టూన్లు చూపించాడు.. కుదురైన గీతలు,చక్కని కామెంట్‌, హాయిగా ఉన్నాయి… ‘నారు’ పేరుతో గీశాడు. అప్పటి నుండీ మా స్నేహం మొదలైంది. కొంతకాలానికి అతడు ఒక హిందీ పత్రికలో కార్టూనిస్టుగా చేరాడు.

Cartoons by Naaru

ఆ తరువాత, కొన్నాళ్లకు నేను, జూబ్లీ హిల్స్‌లోని ఒక డైలీలో ఫీచర్స్‌ హెడ్‌గా చేరిపోయాను.
అక్కడ మళ్లీ ‘నారు ‘ప్రత్యక్షమయ్యాడు, ఈ సారి తనుగీసిన కార్టూన్‌ ఆల్బంతో. అప్పటికే కార్టూనిస్టుని చూడమని ఆ పత్రిక ఎడిటర్‌ నాకు చెప్పడంతో, నారుని పరిచయం చేశాను. వెంటనే ఉద్యోగంలో చేరిపోయాడు.

Cartoonist Naaru with HariPushpa
Naaru cartoons in SURYA daily

ఇష్టమైన కార్టూన్‌ ఉంటుంది కానీ, ఇష్టమైన కార్టూనిస్టు ఉండాలని రూలేమీ లేదు కానీ, నారు జీవితాన్ని చూస్తే, అతని మీద గౌరవం పెరుగుతుంది. ఆదర్శాల గురించి అందరు మాట్లాడతారు కానీ అతడు ఆచరించి చూపిస్తాడు. 3 దశాబ్దాల క్రితం ‘నలుపు’ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేస్తున్న మల్లెపూవు వంటి మనసున్న పేదింటి అమ్మాయి హరిపుష్పను తొలి చూపులోని తన లైఫ్‌ పార్టనర్‌గా డిసైడ్‌ చేసుకున్నాడు. ‘ఆమెను పెళ్లాడిన తరువాత ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది…’ అంటాడు నారు, ఒక సారి ప్రెస్ క్లబ్ లో ఆమెను పరిచయం చేస్తూ…
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్టీసీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించినపుడు, తన భార్యతో ఎగ్జామ్స్‌ రాయించి, బోధన్‌లో కండక్టర్‌గా ఉద్యోగం పొందేలా చేశాడు. అలా ఇద్దరు శ్రమించి ,కొంత పొదుపు చేసి బిడ్డల్ని చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు…
రెండు నెలలుగా జీతంలేక భార్య సమ్మెలో తిరుగుతుంటే, నారు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కార్టూన్లు వేస్తున్నాడు.
” నా వైఫ్‌ కోసం, కార్టూన్లు వేయడం లేదు, నలభై వేల మంది కార్మికులకు అన్యాయం జరగ కూడదని వేస్తున్న.. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే కేసీఆర్‌ సారు, కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది..” అని అమాయకంగా చెబుతున్నాడు ఈ కార్టూనిస్టు.
ప్రస్తుతం ‘సూర్య’దిన పత్రికలో పొలిటికల్‌ కార్టూనిస్టుగా పనిచేస్తున్నాడు. నారు గీసిన వ్యంగ్యాస్త్రాలు ప్రభుత్వ పెద్దలను ఆలోచింప చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఏమో, అతడి గీతలు వారి తలరాతలు మారుస్తాయేమో… !!

Share.

Leave A Reply