అంతరించబోతున్న,ఒక మానవజాతి !!

Google+ Pinterest LinkedIn Tumblr +


వారు అడవులు, కొండలు, వదిలి రాలేరు. ఎలాంటి కనీస సౌకర్యాలు లేకపోయినా బతికేస్తుంటారు. వారిది కల్మషం లేని స్వచ్ఛమైన జీవితం. ప్రకృతికి హని చేయకుండా ,పర్యావరణానికి రక్షకులుగా, నిజాయితీగా ఉంటారు. రెక్కల కష్టం మీద బతుకుతుంటారు. వారే… కోలాం తెగ ప్రజలు. ఇప్పుడీ జాతి కనుమరుగయ్యేలా ఉంది.
ఆదిలాబాద్‌ జిల్లాలో, కోలాం గిరిజనులు ఎక్కువ జీవిస్తున్నారు.
2001లో 56వేలకు పైగా ఉన్న జనాభా, 2011నాటికి 44,912కు తగ్గి పోయిందని, అదిప్పటికి మరింత తగ్గిందనే సమాచారం ఆందోళన కరంగా ఉంది.
గిరిజన శాఖ ఇపుడు లెక్కలు తీస్తే మరింత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో కోలాం గిరిజనులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ 8 ఏళ్లలో వీరి జనాభా మరింత తగ్గిపోయిందని ఆదీవాసీ పరిశీలకులు అంటున్నారు.
వ్యాధులకు బలవుతూ…
తలసేమియా, డెంగీ, మలేరియా తదితర వ్యాధులతో మరణాల పాలవుతున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులతో పిల్లలు, వద్ధులు చనిపోతున్నారు. వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. కుమ్రం భీం జిల్లాలో, ప్రస్తుతం వీరి జనాభా 8వేలకు మించి లేదు. వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహనే ఉండదు. అక్షరాస్యతకు ఆమడ దూరం. ప్రభుత్వం వీరిలో చైతన్యం తెచ్చేందుకు నిర్దిష్టమైన కృషి చేయడం లేదు. ఆసిఫాబాద్‌, కెరమెరి, తిర్యాణి వాంకిడి, జైనూర్‌, సిర్పూర్‌(యు), కాగజ్‌నగర్‌ మండలాల్లోని గిరిజన తండాల్లో అసౌకర్యాల నడుమ, ఈ తెగ ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు.
అందని సంక్షేమం
మఖ్యంగా అసిఫాబాద్‌, తిర్యాణి,కెరమెరి,వ్యాంకిడి మండలాల్లో, చాలా కొద్దిమందికే దశాబ్దాల క్రితం సంక్షేమ పధకాల కింద నిర్మించిన పెంకుటిల్లు లాంటివి ఉన్నాయి. కొన్ని ఆవాసాలకు కనీసం నడిచేందుకు మట్టిదారులు కూడా లేవు. విద్య,వైద్య సదుపాయాలు లేక అక్కడి ప్రజలు దుర్భర స్దితిలో బతుకుతున్నారు.
కోలాం గిరిజనుల అభివృద్ధి కోసం ఉట్నూరు ఐటిడిఏలో ప్రత్యేకంగా ‘ కోలాం అభివృద్ధి అధికారి’ పోస్ట్‌ ఉన్నప్పటికీ చాలా కాలంగా అది ఖాళీగా ఉంది.
అడవి ఆధారం…
ఈ తెగ ప్రజలు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం అడవినే నమ్ముకుంటారు. ఎండాకాలంలో తేనె,వెదురు, ఇప్పపువ్వు,ఇప్ప పరక,జిగురు,బుట్టలు వంటివి సంతల్లో అమ్ముకొని జీవిస్తుంటారు. వీరు సంచార జీవులు. పోడు వ్యవసాయం చేస్తారు. కాస్త బహిరంగ ప్రదేశాల్లో బతుకుతున్న వారు పత్తి, తో పాటు ఇతర వాణిజ్యపంటలు సాగు చేస్తున్నారు. సాంస్కృతికంగా గోండు తెగతో కోలాం ప్రజలకు దగ్గర సంబంధాలున్నా, భాష,ఆచార వ్యవహారాల్లో చాలా తేడా ఉంది.
అంతరించి పోతున్న మరో తెగ
కోలాం తెగలాగే మరో తెగ ఉంది. దాని పేరు తోటి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకప్పుడు తోటి తెగ జనాభా 5వేలకు పైగా ఉండగా, ప్రస్తుతం 2వేలకు పడిపోయింది. వీరిలో 99 శాతం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు.
జాతి ఉనికిని కాపాడాలి…
” గిరిజన తెగల్లో కోలాం , తోటి. పూర్తిగా వెనుకబడిన తెగలు. ప్రభుత్వం ఈ ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తేవడం ద్వారా జాతిని ఉనికిని నిలబెట్టాలి.ఈ తెగలో ఒక్కరు కూడా ఉన్నత విద్యావంతులు లేరు. ఐటీడీఏ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలి. ” స్ధానిక ఆదివాసీలు అంటున్నారు.
( ఈ స్టోరీ అప్‌డేట్‌ అవుతోంది.. మరింత సమాచారం త్వరలో… ) Report/shyammohan.9440595858

Share.

Leave A Reply