తూరుపు కనుమల్లో ఎర్రబంగారం

Google+ Pinterest LinkedIn Tumblr +

విశాఖ జిల్లా, గొందిపాకలకు వెళ్లి ” కుశలవుడు ఎక్కడుంటాడు?” అని అడిగితే, ”ఆడు మామూలోడు కాదండీ బాబూ, మన్నెమంతా దున్నేత్తున్నాడు… అల్లదిగో ఆ పొలం వైపు ఎల్లి సూడండీ…” అన్నారు. 
‘కాఫీ గింజలు అయితేంటీ… స్ట్రాబెర్రీ అయితే ఏటి…? ఒళ్లొంచితే ఏదైనా పండుతుంది. ఇదానం తెలుసుకొని నిదానంగా పెంచాలి.’ మాతో అన్నాడు గుత్తులుగా పండిన స్ట్రాబెర్రీలు కోసి బుట్టలో వేస్తూ, బౌడు కుశలవుడు.
తూరుపు కనుమల్లో 15 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడైన స్ట్రాబెర్రీ సాగు చేసుకోవచ్చు. కానీ రైతులకు సహనం ఉండాలి. అంటాడీ రైతు. 
విశాఖ నుండి నాలుగు గంటలు భద్రాచలం రోడ్డులో ప్రయాణిస్తే తూరుపు కనుమల మధ్య ఊటీ లాంటి లంబసింగి తగులుతుంది. చింతపల్లి మండలం గొందిపాకల కుశలవుడి సొంతూరు. పెద్ద చదువులు చదవ పోయినా, అతడి సాగు పద్దతులు తెలుసుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ మారు మూల గిరిజనుడిలోని ప్రత్యేకేంటీ? 
సంప్రదాయానికి బ్రేక్‌… 
లంబసింగి ప్రాంతంలో రైతులు కొన్ని కూరగాయలు,ఆకు కూరలు, కుదిరితే కాఫీ పండిస్తారు. ఈ పద్దతిని బ్రేక్‌ చేశాడు కుశలవుడు. అందరికీ అందుబాటులో ఉండనివి, బోలెడు ఖరీదైనవి,ఎక్కడో కాశ్మీర్‌ వంటి శీతల ప్రాంతాల్లో పండే స్ట్రాబెర్రీ పంట సాగు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. మన నేలలో ఎన్నడూ వేయని పంటలు వేసి చేతులు కాల్చుకోవడం దేనికీ, అంటూ మిత్రులు హెచ్చరించినా లెక్క చేయకుండా కొత్తబాటలో అడుగులు వేసి, తీయని లాభాలు పొందుతున్నాడు. 
స్ట్రాబెర్రీనే కాదు,యాపిల్‌, మిరియాలు, కాఫీ, బార్లీ పంటల కోసం అతను చేసిన ప్రయోగాలు లెక్కలేనన్ని. ఇన్ని ప్రయోగాలు చేస్తున్నఅతడు చదివింది పదోతరగతి మాత్రమే. 

Kushalava at strawberry farm


కొత్తపంటల సాగు బడి… 
అతనికున్నది రెండెకరాలు. అది ఏమాత్రం సారవంతమైనది కాదు. ఆ అటవిలో వ్వవసాయ మెలకువలు చెప్పేవారు లేరు. అలాంటి పరిస్ధితుల్లో కళ్లు చెదిరే స్ట్రాబెర్రీలు వేసి తీయని ఎర్ర బంగారం పండించి చూపించాడు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే విదేశీపంటేమో అనుకునే మొక్కలను మన్యం నేలలో కూడా పండించి చూపించాడు. 
ఒక మిత్రుడి సాయంతో 12ఏళ్ల క్రితం పొలంలో తొలిసారిగా స్ట్రాబెర్రీని ప్రయోగాత్మకంగా పండించారు. లక్షరూపాయల వరకూ పెట్టుబడిగా పెట్టారు. కానీ చేతులు కాలాయి. కొత్తపంట కదాని తెలిసినవాళ్లందరూ తలాకొన్ని పండ్లు రుచి చూస్తామంటూ కోసుకు పోవడంతో పంట పండినా నష్టం వచ్చింది. 
ఆదర్శ రైతుగా… 
తొలి ప్రయత్నంలో లాభం రాక పోయినా, నిరాశచెందకుండా, శ్రమిస్తూ, వరుసగా స్ట్రాబెర్రీ సాగు చేశాడు. బార్లీ, గోధుమ వంటి సంప్రదాయేతర పంటలతో పాటు కాఫీ, మిరియాలు, బర్మా కొత్తిమీర వంటి బహుళ పంటలను సాగుచేస్తూ, చింతపల్లి వ్యవసాయాధికారుల దృష్టిలో పడ్డాడు. వైవిధ్య పంటల పట్ల అతనికున్న ప్రేమను గమనించిన వ్యవసాయాధికారులు కుశను ఆదర్శ రైతుగా గౌరవించి పరిశోధన సలహా మండలి సభ్యుడిగా తీసుకున్నారు. 
ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీ 
మన్యంలో గిరిజనులంతా అధిక దిగుబడుల కోసమని రసాయనిక ఎరువులకే, అలవాటు పడ్డారు. కానీ కుశలవ పూర్తిగా సేంద్రియ పద్దతిలో స్ట్రాబెర్రీ పండించాడు. పశువుల పేడ, వేపకషాయాలతో సాగు చేశాడు. అందుకే మార్కెట్‌లో దొరికే ఇతర ప్రాంతాల పండ్లకంటే, కుశ పొలంలో పండిన పండ్లు అద్బుతమైన రుచితో ఉంటాయని లంబసింగి కి వచ్చే పర్యాటకులు అంటారు. సేంద్రియ పద్ధతిలో ఇతడు పండించిన స్ట్రాబెర్రీలను ‘డ్యూడ్రాప్స్‌’ పేరుతో మార్కెట్‌ చేస్తున్నాడు. 
గతంలో కాఫీ పంటను కూడా ఆర్గానిక్‌ పద్దతిలో సాగు చేసి, కేంద్ర కాఫీబోర్డు అంతర్జాతీయ కాఫీ ఫైన్‌కప్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 
ఒక మొక్కకు కిలో పండ్లు 
స్ట్రాబెర్రీ మొక్కలు నాటిన 45రోజుల్లో కాత మొదలువుతుంది. అక్టోబర్‌ నుండి జనవరి వరకు పండ్లు వస్తాయి. కాయలు నేలకు తగిలితే పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే గట్ల పైన ప్లాస్టిక్‌ కవర్లు కప్పి దాని పైన మొక్కలు పెంచుతారు. 
ఒక మొక్కకు అరకేజీ నుండి కేజీ వరకు పండ్లు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీరికి 800 గ్రాముల పండ్లు వస్లున్నాయి. ఎకరాకు 24వేల మొక్కలు సాగుచేస్తున్నారు. 
” పండ్లను కోసిన వెంటనే రోడ్డు పక్కనే పెట్టి అమ్మేస్తున్నాం. లంబసింగి వైపు వచ్చే టూరిస్టులు వీటిని హాట్‌కేక్స్‌లా కొంటున్నారు. దిగుబడి పెరిగినపుడు పండ్లు వృధాకాకుండా ఎక్కువ కాలం నిలువ ఉండేలా ఫ్రూట్‌జామ్‌గా తయారు చేస్తున్నాం. పండ్లకంటే, వీటికే డిమాండ్‌ ఎక్కువ…” అని కుశ అంటాడు. 
ఒకపుడు కుశను నిరాశ పర్చిన తోటి గిరిజనులు నేడు అతడిని ఫాలో అవుతున్నారు. బగత తెగ గిరిజనులు కష్టజీవులు. అలాంటి రెండు వేల మందితో కుశలవుడు గిరిజన గ్రామ స్వరాజ్య సంఘాన్ని స్థాపించి సాగుపాఠాలు చెబుతున్నాడు. తొలిసారిగా సేంద్రియసాగు ధ్రువపత్రం పొందిన ఘనత కూడా ఈ సంఘానికే దక్కింది. ” చింతపల్లి మండలంలోని గొందపాకల,రాజుపాకల,సరిపురం లో మరో 8మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ సంటను సాగు చేయాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి.రిస్క్‌ కూడా ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే లాభాలు వస్తాయి. ఇక్కడ పండే స్ట్రాబెర్రీల రుచి దేశంలో ఎక్కడ కనిపించదు. ” అంటారు ఇదే ప్రాంతంలో ఆంధ్రా స్ట్రాబెర్రీ ఫాం నిర్వహిస్తున్న రైతు రాజ్‌కుమార్‌. 
ఇక్కడి రైతులు కొండవాలులో పారే ఊటనీటి తో సాగు చేస్తున్నారు. అందుకే దీని ఈ పండ్లు రుచిగా ఉంటాయి. 
….. శ్యాంమోహన్‌ (9440595858),  pics/Hari/ruralmedia

Share.

Leave A Reply