ఆడ,మగ శిలలుంటాయా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

TEMPLE_TOP VIEW_JAN_2019_

 
ఆడ,మగ శిలలుంటాయా? 
సరిహద్దులు లేని శిల్ప కళ 
120 మంది ముస్లిం శిల్పకళాకారులు
ఆ గుట్టమీద కరకు బండలు బద్దలవుతున్నాయి.ఒక వైపు ముడి రాయిని కత్తిరించే మిషన్ల హోరు, మరో వైపు ఉలి చప్పుళ్ల మధ్య, శిలలు అపురూప శిల్పాలవుతున్నాయి. మనసును లక్ష్యంపైనే పెట్టి రాయిని అద్భుత రూపాలుగా మార్చే పనిలో ఇక్కడ శిల్పులు,కూలీలు పనిచేస్తు, తమ ఉలులను కుంచెలుగా మార్చి అద్భుత కళా విన్యాసం చేస్తున్నారు. 
షేక్‌బాబూలాల్‌, మహమ్మద్‌ యూనిస్‌, షేక్‌ రబ్బానీ, షౌకత్‌ అలీ, షేక్‌జానీ… వీళ్లే కాదు దాదాపు 120 మంది ముస్లిం శిల్పకళాకారులు గత రెండేళ్లుగా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అపూర్వమైన కృష్ణ శిలలను అద్భుత కళారూపాలుగా మార్చే పనిలో, ఏడంతస్తులుగా నిర్మిస్తున్న మహారాజగోపురం నిర్మాణంలో క్షణం తీరిక లేకుండా, తనువును, మనసును లక్ష్యంపైనే పెట్టి ,దుమ్ము,దూళిలో పనిచేస్తున్నారు. వారి జీవన చిత్రాన్ని ‘రూరల్‌మీడియా’ రికార్డు చేసింది. 
మాకు కళే దైవం 
”మా తాతల కాలం నుంచి దేవతా విగ్రహాల తయారీలోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి, రెండేళ్లుగా యాదాద్రి పనులు చేస్తున్నాం. ఆలయాలే కాదు మసీదులు కూడా కడతాం, మహబూబ్‌నగర్‌ , కల్వకుర్తిలో చర్చిని నిర్మించాం. మాకు మతంతో సంబంధం లేదు. పనే దైవం. యాదాద్రి ఆలయ మహారాజగోపురాన్ని నిర్మించడం మా పూర్వజన్మ సుకతం” అని,సంతోషంగా అంటున్నారు, మండపాల నిర్మాణంలోబిజీగా ఉన్న షేక్‌ రబ్బానీ. 
వీరందరిదీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామం. 
కళకు సరిహద్దులు లేవు 
” భుక్తి కోసం చేపట్టే ఏ పనైనా భక్తితో చేయాల్సిందే. దీనికి కులం, మతంతో పనిలేదని చాటి చెబుతున్నారు ఇక్కడి శిల్పకారులు.భిన్న ప్రాంతాల,మతాల కళాకారులిక్కడ పనిచేస్తున్నారు. కళకు మతం అంటదు, ఓ బహత్కార్యాన్ని భుజస్కందాలపై వేసుకొని తెలంగాణ,ఆంధ్ర,తమిళనాడు నుండి 600మంది శిల్సులు,మరో రెండొందల కూలీలు,త ఇక్కడ శ్రమిస్తున్నారు. ” అని స్తపతి ఆనందాచారి వేలు చెప్పారు. 
ఆలయ శిల్పాలను చెక్కేటపుడు వీరు కఠిన నియమాలను పాటిస్తారు. ఉదయమే స్నానాదికాలు పూర్తి చేసుకొని మాత్రమే పనిని ప్రాంరభిస్తారు. పనిలో ఉన్నప్పుడు మాంసం, మద్యం ముట్టరు. 
ఆడ,మగ శిలలుంటాయా? 
హైదరాబాద్‌ నుండి 218 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి కొండపైన 2.33 ఎకరాల స్థలంలో జరుగుతున్న ఆలయ నిర్మాణంలో విగ్రహాలన్నీ కష్ణశిలతోనే జరుగుతున్నాయి. 
” ఆలయ నిర్మాణంలో వాడే శిలలను పురుషశిల, స్త్రీశిల, నపుంసక శిలలంటారు. స్త్రీ,పురుష శిలలను భూమిలోపల నుండి తీస్తారు వీటినే కష్ణశిలంటారు. దేవతా విగ్రహాలకు వాడుతారు. ఈ శిలను గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న గురిజేపల్లి, కోటప్పకొండ ప్రాంతం నుంచి సేకరిస్తున్నారు. ఎండాకాలంలో చల్లదనం,చలికాలంలో వెచ్చదనం ఇవ్వడం ఈ కృష్ణశిలల ప్రత్యేకత. ప్రధానాలయం అంతా కష్ణశిలతోనే నిర్మించడం దేశంలోనే ప్రథమం..” అని స్తపతి ఆనందాచారి వేలు వివరించారు. 
కొన్ని తరాల వరకు చెక్కు చెదరని శిల్పాలు 
కష్ణ శిల దొరికే ప్రాంతంలోని మట్టినమూనాలను సేకరించి ,చెన్నయ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పరీక్షలు చేయించిన తరువాతే వాడుతున్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల వరకూ ఈ శిలకు క్షయం ఉండదని ఆ పరీక్షల్లో తేలింది. 
గత 500 ఏళ్లలోనే దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి ఆలయం నిర్మించలేదని స్తపతులు అంటున్నారు. 
ముడి రాయిని శిల్పంగా మార్చాలంటే? 
” పేపర్‌ మీద వేస్తున్న బొమ్మ సరిగా రాకపోతే రబ్బరుతో చెరిపి మరోసారి వేయొచ్చు. కాని రాతిని శిల్పం చెక్కేటప్పుడు అలా కుదరదు.స్తపతులు రాయిని కొలతలు వేసి ఇస్తారు. దానికి అనుగుణంగా శిల్పాన్ని చెక్కుతాం. ప్రధానమైన శిల్పాలు చెక్కేటపుడు సాధ్యమైనంత వరకు అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తారు ”అని అంటారు రాయల సీమకు చెందిన శిల్పి సంజయ్‌. 
ముడి రాయిని నుంచి విగ్రహాన్ని తయారు చేయాలంటే ఆ పనిని 124 భాగాలుగా విభజించుకుంటారు. స్తపతులు చెప్పిన కొలతల ప్రకారం రాయిపై మార్కింగ్‌ వేసుకొని, దాన్ని తిరిగి ఎనిమిది నుంచి పది సార్లు సరిచేసుకుంటూ చివరికి శిల్పానికి అనుగుణంగా ఉండే దశకు తీసుకువస్తారు. 
రోజుకు రూ.2వేలు 
ఉదయం ఏడు గంటలకే మొదలయ్యే వారి దినచర్య సాయంత్రం ఏడున్నర తర్వాత ముగుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం మినహా వారూ శిల్పాలకు ప్రాణం పోసే పనిలోనే నిమగ్నమవుతారు. రాయిని శిల్పంగా మార్చే క్రమంలో పనులను బట్టి వీరికి రోజుకు రూ.1200 నుండి, రూ.2,000 వరకు పారితోషికం ఇస్తున్నారు. 
శాంతి మంత్రం 
” అందరూ కాక పోయినా కొందరు తప్పనిసరిగా పంచె ధరిస్తారు. నరసింహమూర్తి , పరశురాముడు వంటి రౌద్రంగా ఉండే విగ్రహాలు చెక్కుతున్నపుడు శిల్పులు శాంతి మంత్రం జపించడం ఆనవాయితీగా వస్తోందని” గుట్ట మొగిలి అనే శిల్పి చెప్పారు. 
రెండు లక్షల టన్నుల రాయితో శిల్పాలను చెక్కుతున్నారు పనులన్నీ వైష్ణవాచారం, ఆగమ, శిల్ప, వాస్తు శాస్త్రం ఆధారంగానే జరుగుతున్నాయంటున్నారు ప్రధాన స్తపతులు. 
” గర్భాలయం,ప్రధానాలయం శ్లాబు కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. ఆళ్వార్ల శిలారూపాలతో కూడిన స్తంభాలు, కాకతీయ స్తంభాలను కొలువు తీరాయి. ప్రస్తుతం సుదర్శన గోపురాల నిర్మాణం పూర్తికావచ్చింది. దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయి. 
మరి కొద్ది రోజుల్లో, మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.900కోట్లు,ఇప్పటి వరకు 500 కోట్లు వ్యయం అయింది.” అని యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్ద(యాడా)వైస్‌ ఛైర్మన్‌ జి.కిషన్‌ రావు అన్నారు.  (pic/k.rameshbabu/ruralmedia)

Share.

Leave A Reply