శబరితైలం…అద్భుతం!

Google+ Pinterest LinkedIn Tumblr +

 భద్రాచలం నుంచి మలుపులు తిరిగిన రహదారిలో నూటా ముప్పయి కిలోమీటర్లు ప్రయాణిస్తే..ఆంధ్ర సరిహద్దుల్లోని చింతూరు ఏజెన్సీ మొదలవుతుంది. అదంతా దట్టమైన అటవీప్రాంతం. రోడ్డుకు ఇరువైపులా ఇప్పపూల చెట్లు గొడుగుల్లా అల్లుకుని అలరిస్తాయి. ఆ చెట్ల కింద రాలిన ఇప్పకాయలను వెదురుబుట్టల్లో వేస్తుంటారు గిరిజనులు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు.. ఇలా కాయలు సేకరించడం ఇక్కడి జీవనవైవిధ్యం. ఈ ప్రాంత ప్రజలకు వయసు పెరిగినా అంత త్వరగా జుట్టు నెరవదు. దానికో రహస్యం ఉంది. చిన్నప్పటి నుంచీ వారు సొంతంగా చేసుకున్న ఇప్ప తైలాన్ని వాడటం. గిరిజనుల్లో రోగనిరోధక శక్తీ ఎక్కువే.. వాళ్లు తినే తిండిలో నెయ్యిలా దీన్ని వాడటమూ ఒక కారణం...

చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహించే శబరి నదికి ఇరువైపులా ఉంటుంది చింతూరు. ఈ మండలంలో అత్యధికులు కోయ, కొండదొర, కొండరెడ్లు, కొండకాపు, వాల్మీకి ఆదివాసీ గిరిజన తెగలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురి కాబోయే మండలం ఇది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన చింతూరు మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. ఇక్కడి ప్రతి గిరిజన కుటుంబానికి పది నుంచి ఇరవైకి పైగా ఇప్పచెట్లు ఉంటాయి. ఇవికాక అడవి నుంచి కూడా ఇప్పకాయలు, ఇప్పపూలు సేకరిస్తారు. వాటిని తమ అవసరాలకు వాడుకుని మిగిలినవి సంతలో విక్రయిస్తారు. దీనివల్ల ఆదాయం అంతంత మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితిని మార్చి ఇప్పను విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారుచేయించి, వారికి మెరుగైన సుస్థిర జీవనోపాధి కల్పించడానికి, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ముందుకు వచ్చాయి. 

అదో పెద్ద ప్రక్రియ

Mahua oil,
contact– 9492381609

భద్రాచలం సీతమ్మవారి ప్రసాదంగా ఇప్పపూలను స్వీకరించడం ఆనవాయితీ. ఇప్పనూనెను గిరిజనులు వంటల్లోనూ, ఔషధంగానూ వాడుతున్నారు. కాయలను మీరెలా సేకరిస్తారు అనడిగితే.. ‘తెల్లవారుజామునే చెట్ల కిందకు వెళ్లి, కాయలను సేకరించి, తొక్కతీసి ఎండబెడతాం. ఈ పండ్లను అడవిలోని చిలుకలు, కోతులు తిని గింజలను నేలరాల్చుతాయి. అలా కొన్నిసార్లు మాకు తొక్కతీసే పని తగ్గుతుంది. వాటిని తాటి బుట్టలో ఉంచి ఆవిరిపై వేడిచేస్తాం. ఒకవైపు పలకగా చెక్కిన రెండు పొడవాటి దుంగలను పైన కింద ఉండేట్లు అమర్చి, ఆవిరిపట్టిన గింజలను పెట్టి, తాటిమోకుతో గట్టిగా బిగిస్తే నూనె వస్తుంది.. దాన్ని సీసాల్లో నిల్వ చేసుకుంటాం..’ అంటారు సున్నం బుచ్చమ్మ, కుంజా నాగమణి. ఇలా నలుగురు కష్టపడితే తప్ప నూనె తయారవ్వదు.

‘..ఒక ఇప్ప చెట్టు నుంచి ఏడాదికి అరవై నుంచి ఎనభై కిలోల గింజలు లభిస్తాయి. ఈ గింజల్లో సుమారు ముప్పయి నుంచి ముప్పయి ఐదు శాతం నూనె ఉంటుంది. విత్తనంలో రెండు పిక్కలు ఉంటాయి. కాయల తొక్క తీసేందుకు కుటుంబసభ్యులు రోజంతా పనిచేస్తారు. మేము రూపొందించిన మధు డికార్టికేటర్‌ ద్వారా ఎనిమిది గంటల్లో చేసే పనిని ముప్పయి నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు గిరిజనులు. దీనివల్ల నాణ్యమైన పప్పు నూనె వస్తుంది..’ అని చెప్పారు ఇప్ప ఉత్పత్తులపై అధ్యయనం చేస్తున్న ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సయ్యద్‌ సుభాని. నూనె తీయడానికి కొందరు గిరిజన మహిళలకు ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. నూనె తీసే పది యంత్రాలను సమకూర్చింది.

AkulaRamana,P.O,ITDA,Chintoor,EGDistrict,AP

ఇప్పనూనె లేదా తైలాన్ని దైవ ఆరాధనకు, ఆరోగ్యానికి తరతరాలుగా వాడుతున్నారు. ఇక్కడి పిల్లల్లో ఎనీమియా సమస్య ఎక్కువ. దాని నివారణకు ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్ప ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి, బ్రాండ్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. నూనెను పరిశుభ్రంగా శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడానికి మూడొందల కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, యంత్రాల కొనుగోలుకు ప్రధానమంత్రి వన్‌ధన్‌ వికాస్‌ కేంద్ర పథకం ద్వారా పదిహేను లక్షలు వ్యయం చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తులలాగే ఈ అటవీ ఉత్పత్తులకు కూడా కనీసం మద్ధతు ధర ఇస్తాం. మొహ్వా ఆయిల్‌ అంటే ఇప్పనూనే. ఇప్పుడీ పేరుతో దొరుకుతోంది. త్వరలో శబరి ఇప్ప నూనె పేరుతో బ్రాండింగ్‌ చేయబోతున్నాం.   – ఆకుల రమణ, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌, చింతూరు

పోషకాలు అధికం..

ఇప్పనూనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇదొక అరుదైన తైలం. దీన్ని ఆదివాసీలు నెయ్యిగా భావిస్తారు. పండుగ సందర్భాలలో పులగం వంటకం (కిచిడి) చేసి, అందులో వేడి చేసిన ఇప్పనూనెను నెయ్యిలా కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఈ నూనెలో రోగనిరోధక శక్తితో పాటు అనేక పోషక విలువలు ఉన్నాయి. తల నూనెలా వాడటం వల్ల జుట్టు తెల్లబడదు. శీతాకాలంలో ఇప్పతైలాన్ని రాసుకుంటే.. శరీరం చలిని తట్టుకుంటుంది. దోమలు దగ్గరకు రావు. కీళ్లలో వచ్చే మోకాళ్ల నొప్పులకు స్వస్థత కలిగించి, ఉపశమనాన్ని ఇస్తుంది… అంటారు సంప్రదాయ గిరిజన వైద్యుడు పల్లాల భూమిరెడ్డి. మార్కెట్‌లో దొరికే అనేక రిఫైండ్‌ ఆయిల్స్‌ కంటే భిన్నంగా రోగనిరోధక శక్తిని పెంచే అడవి బిడ్డల ఇప్పనూనె ప్రకృతి అందించిన అమృతం. ( ఇప్ప తైలం కావాల్సిన వారు, సుభాని – 9492381609 కి ఫోన్ చేయండి.)

Report- శ్యాంమోహన్‌, ruralmedia30@gmail.com

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply