కేబుల్‌ టీవీ చందాదారుల హక్కులు …

Google+ Pinterest LinkedIn Tumblr +


డిజిటైజేషన్‌ వలన ధరలు పెరగటం అనేది ఒక పార్శ్వం మాత్రమే. అదే సమయంలో చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి, హక్కులు కల్పించటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ట్రాయ్‌ అనేక చర్యలు తీసుకోవటం రెండో పార్శ్వం. ట్రాయ్‌ కల్పించిన హక్కుల గురించి, సేవల పరంగా చందాదారు డిమాండ్‌ చేయదగిన అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే డిజిటైజేషన్‌ ఫలితం చందాదారునికి దక్కినట్టవుతుంది. 
సెట్‌ టాప్‌ బాక్స్‌ గురించి…. 
టీవీ చానల్స్‌ పంపిణీ సంస్థలు లేదా వారి పరిధిలోని కేబుల్‌ ఆపరేటర్‌ ప్రామాణికమైన సెట్‌ టాప్‌ బాక్స్‌ ను చందాదారుకు అమ్మవచ్చు. లేదా, తన నెట్‌ వర్క్‌ కు తగినట్టు ఉన్న బాక్స్‌ మార్కెట్లోనూ కొనుక్కోవచ్చునని చెప్పాలి . అలా కొనుక్కున్న సెట్‌ టాప్‌ బాక్స్‌ మీద యాజమాన్య హక్కు చందాదారుకే ఉంటుంది. 
చందాదారుకు కనీసం మూడేళ్ళపాటు ప్రసారాలలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత పంపిణీదారు/ స్థానిక ఆపరేటర్‌ మీదనే ఉంటుంది. అయితే చందాదారుడే చెడగొట్టి ఉండకూడదు. 
డిటిహెచ్‌ ఆపరేటర్‌ అయితే మరమ్మతుకోసం మనిషిని ఇంటికి పంపినందుకు ఒక్కో విడతకు రూ. 250 మించకుండా తీసుకోవచ్చు. అయితే సెట్‌ టాప్‌ బాక్స్‌ సంబంధమైన మరమ్మతు అయితే వచ్చినందుకేమీ తీసుకోరు. 
సెట్‌ టాప్‌ బాక్స్‌ గురించి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోగా పంపిణీదారు/ఆపరేటర్‌ మరమ్మతు చేయించాలి. ఆ లోపు ఇవ్వలేని పక్షంలో తాత్కాలికంగా మరో సెట్‌ టాప్‌ బాక్స్‌ అమర్చాలి. 
కేబుల్‌ లేదా డిటిహెచ్‌ కనెక్షన్‌ కోసం సర్వీస్‌ ప్రొవైడర్‌ కు దరఖాస్తు చేసుకున్న వారంలోగా కనెక్షన్‌ ఇవ్వాలి.కనెక్షన్‌ ఇచ్చినప్పటినుంచి కాకుండా, యాక్టివేషన్‌ జరిగిన రోజునుంచి కేబుల్‌ చార్జీలు అమలులోకి వస్తాయి. 
ఏదైనా చానల్‌ గాని, బొకే గాని తన సర్వీస్‌ నుంచి తొలగించమని చందాదారు కోరితే 72 గంటల్లోపు తొలగించాలి. తన నెట్‌ వర్క్‌ నుంచి ఏదైనా చానల్‌ లేదా బొకే ఆగిపోయే పరిస్థితి ఉంటే పంపిణీదారుడు 15 రోజుల ముందే స్క్రోల్‌ ద్వారా తెలియజేయాలి. ఇలా ముందస్తు నోటీసు లేకుండా చానల్‌ ఆపే అధికారం పంపిణీదారుకు ఉండదు. 
పే చానల్‌ యజమాని తన చానల్‌ ను ఉచిత చానల్‌ గా మార్చినప్పుడు, లేదా చానల్‌ ధర రూ.19 మించి నిర్ణయించినప్పుడు నిర్దిష్ట కాలవ్యవధితో సంబంధం లేకుండా ఆ చానల్స్‌ ను తొలగించి ఆమేరకు చందాదారు బిల్లు తగ్గించవచ్చు. 
చానల్స్‌ ఎంపిక 
నెట్‌ వర్క్‌ కెపాసిటీ ఫీజు కింద రూ. 130 అందరూ కట్టాల్సిందే. అందులో భాగంగా వచ్చే 100 ఉచిత చానల్స్‌ తీసుకోకపోయినా సరే. పే చానల్స్‌ తీసుకోకపోయినా ఇది తప్పదు. పే చానల్స్‌ తీసుకుంటే బిల్లు అదనం. 
ఉచిత చానల్స్‌ లో అందుబాటులో ఉన్న హెచ్‌ డి చానల్‌ ఒకటి తీసుకుంటే అది రెండు ఎస్‌ డి చానల్స్‌ కు సమానం. అంటే, నాలుగు హెచ్‌ డి చానల్స్‌ తీసుకుంటే వందలో ఇంకా ఎంచుకునే అవకాశమున్నవి 92 మాత్రమే. ఈ వందలోనే పంపిణీదారుడు తప్పనిసరిగా ఇవ్వాల్సిన 26 దూరదర్శన్‌ చానల్స్‌ కలిసి ఉంటాయి. తెలుగు ఉచిత చానల్స్‌ లో 20 కి పైగా న్యూస్‌ చానల్స్‌, ఐదు ఎంటర్టైన్మెంట్‌ చానల్స్‌ , పదికి పైగా ఆధ్యాత్మిక చానల్స్‌ ఉన్నాయి కాబట్టి సహజంగానే వాటన్నిటినీ కోరుకుంటారు. 
ఉచిత చానల్స్‌ ఎంచుకునే హక్కు చందాదారుడిదే తప్ప పంపిణీదారుడిది కాదు. అందువలన సగటున కనీసం 150 చానల్స్‌ ఇచ్చి అందులో ఎంచుకోమని అడుగుతారు. హిట్స్‌ ఆపరేటర్‌ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇవ్వగలుగుతున్నారు. 

కేబుల్‌ బిల్లు 
ఎమ్మెస్వో, లేదా డిటిహెచ్‌ ఆపరేటర్‌ ప్రీ పెయిడ్‌ లేదా పోస్ట్‌ పెయిడ్‌ విధానంలో బిల్లు వసూలు చేసుకోవచ్చు. కొందరికి ప్రీపెయిడ్‌ విధానం, మరికొందరికి పోస్ట్‌ పెయిడ్‌ విధానం కూడా వర్తింపజేయవచ్చు. కనెక్షన్‌ యాక్టివేషన్‌ అయినప్పటినుంచీ బ్రాడ్‌ కాస్టింగ్‌ సేవలు లెక్కలోకి వస్తాయి. బిల్లు తయారైన తేదీనుంచి చెల్లింపుకు కనీసం 21 రోజుల సమయం ఇవ్వాలి. 
ఫిర్యాదులు, పరిష్కారం 
ఎమ్మెస్వో లేదా డిటిహెచ్‌ ఆపరేటర్‌ చందాదారులకు ప్రసార సేవలు అందించటానికి ముందే కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. సేవలకు సంబంధించిన అభ్యర్థనలు, ఫిర్యాదులు తెలియజేయటానికి వీలుగా టోల్‌ ఫ్రీ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ ఇవ్వాలి. వెబ్‌ సైట్‌ ను, వెబ్‌ సైట్‌ ద్వారా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ప్రచారం చెయ్యాలి. సొంత చానల్స్‌ లో స్క్రోల్‌ కూడా వెయ్యాలి. బిల్లులు, రసీదుల మీద కూడా నెంబర్‌ ముద్రించి ప్రాచుర్యం కల్పించాలి. 
ప్రతిరోజూ కనీస ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటలవరకు అందుబాటులో ఉండాలి. 
కస్టమర్‌ కేర్‌ ఫిర్యాదు అందుకున్న వెంటనే రిజిస్టర్‌ చేసుకొని డాకెట్‌ నెంబర్‌ కేటాయించాలి. ప్రసారాలకు సంబంధించిన ఫిర్యాదులలో కనీసం 90% అయినా 24 గంటల్లో పరిష్కరించాలి. నోడల్‌ అధికారి పేరు, ఫోన్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ అడ్రస్‌, ఫాక్స్‌ నెంబర్‌ లాంటి సమాచారానికి ప్రచారం కల్పించాలి. వెబ్‌ సైట్‌ లో పెట్టాలి. 
పంపిణీదారుడు (ఎమ్మెస్వో లేదా డిటిహెచ్‌ ఆపరేటర్‌) గాని, స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ గాని చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్టు ట్రాయ్‌ కి ఫిర్యాదులు అందితే వాటిమీద వేగంగా దర్యాప్తు జరపాలని పంపిణీదారుణ్ణి ట్రాయ్‌ ఆదేశించవచ్చు. 30 రోజుల్లోగా పరిష్కరించి ట్రాయ్‌ కి, చందాదారుకూ తెలియజేయాలి. 
వినియోగదారులకు అవగాహన 
ఎమ్మెస్వో లేదా డిటిహెచ్‌/హిట్స్‌ ఆపరేటర్‌ ఒక వెబ్‌ సైట్‌ నడపాలి. తన సేవల సమాచారం అందులో పొందుపరచి చందాదారులో అవగాహన పెంచాలి. నిబంధనలు పాటించే బాధ్యత స్వయంగా తీసుకుంటూ ఏదైనా ఏజెన్సీకి వెబ్‌ సైట్‌ బాధ్యత అప్పగించవచ్చు. 
అందులో చానల్స్‌ వివరాలు, ఉచిత చానల్స్‌, పే చానల్స్‌, బొకేల వివరాలు, నెట్‌ వర్క్‌ కెపాసిటీ ఫీజు, సెట్‌ టాప్‌ బాక్స్‌ ధర, అద్దె వివరాలు, గ్యారెంటీ/వారంటీ, కొత్త కనెక్షన్‌ తీసుకునే విధానం, ఫిర్యాదుల పరిష్కార విధానం, టోల్‌ ఫ్రీ నెంబర్‌, మాన్యువల్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ తదితర వివరాలన్నీ ఉండాలి. ప్రతి ఎమ్మెస్వోలేదా డిటిహెచ్‌/హిట్స్‌ ఆపరేటర్‌ ఒక చానల్‌ ను ప్రత్యేకంగా వినియోగదారుల సమాచారం, అవగాహన కోసమే కేటాయించి నడుపుతూ ఉండాలి. దానికి అందరూ ఒకే రకంగా 999వ చానల్‌ కేటాయించాలి 
ఇతర అంశాలు 
ఎమ్మెస్వో లేదా డిటిహెచ్‌ ఆపరేటర్‌ ఆచరణకు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్‌ రూపొందించి వెబ్‌ సైట్‌ లో పెట్టాలి. దీన్నే హిందీ, ఇంగ్లీష్‌ తోబాటు ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా స్థానిక భాషలో ముద్రించాలి. ఉచిత చానల్‌ అయితే ఫ్రీ అనేమాట ఆ చానల్‌ ఎదురుగా రాయాలి.పే చానల్‌ అయితే గరిష్ఠ చిల్లర ధర పేర్కొనాలి. 
ఉచిత చానల్స్‌ 100 మించి కావాలనుకుంటే ప్రతి 25 చానల్స్‌ కూ రూ.20 వంతున అదనంగా చెల్లించాలి. ట్రాయ్‌ నిబంధనలన్నిటినీ పాటించేలా చూస్తూ ట్రాయ్‌ కి నివేదించటానికి ఒక అధికారిని నియమించుకోవాలి. చందాదారుల సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా వాడకూడదు. 
ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండు సెట్‌ టాప్‌ బాక్సులు కొనాల్సిందే. అయితే, ఇంటివరకూ వాడుతున్న నెట్‌ వర్క్‌ ఒకటే కాబట్టి పంపిణీదారుడు రాయితీ ఇవ్వదలచుకుంటే రెండో కనెక్షన్‌ కు వసూలుచేసే రూ.130 నెట్‌ వర్క్‌ కెపాసిటీ ఫీజులో మినహాయింపు/రాయితీఇవ్వవచ్చు. 
మరిన్ని వివరాలకు సంప్రదించండి… 
పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్‌ ఆపరేటర్లు తమ చందాదారులకు అందించాల్సిన సేవల గురించి స్థూలంగా తెలియజెప్పటం ఈ ఆర్టికల్‌ లక్ష్యం. దీని మీద ఏవైనా సూచనలున్నా, అనుమానాలున్నా bhavanarayana@yahoo.com అనే ఈ- మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. 
తోట భావనారాయణ సీనియర్‌ జర్నలిస్టు. 

Share.

Leave A Reply