మీ ఇంటికి వచ్చి Toilet కడతారు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

కుటుంబ వ్యక్తిగత అవసరాల్లో ముఖ్యమైనది మరుగుదొడ్డి.  మనిషికి కావలసిన కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కన్నా అతిముఖ్యమైనది  మరుగుదొడ్డి కలిగి ఉండడం. మొదటి మూడు కనీస అవసరాలైతే..మరుగుదొడ్డి మాత్రం కచ్చితంగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే మలవిసర్జన అనేది నలుగురిలో చేసే పని కాదు. పైగా అది లెక్కలేనంత మంది పసిపిల్లల ఆరోగ్యాన్ని ప్రాణాలకు హాని చేసే  చేసే పని.

మరుగుదొడ్లు లేకే అనర్థాలు

2014 వరకు భారతదేశంలో కేవలం 42 శాతం కుటుంబాలకే స్వంత  మరుగు దొడ్లు ఉండేవి. అక్టోబర్ 2, 2014న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘స్వచ్ఛ భారత్’ నినాదంతో మరుగుదొడ్ల నిర్మాణానికి పిలుపునిచ్చారు. దీంతో   ఈ మూడేళ్ళలో వాటిశాతం 64కు పెరిగింది. అయినా ఇంకా 36 శాతం కుటుంబాల వారు మల, మూత్ర విసర్జనకోసం బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నారు. మరుగుదొడ్డి లేకపోవడంవల్లే  ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు  అత్యాచారానికి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. మరుగుదొడ్లు లేక అనారోగ్యంబారిన పడుతూ..వారు మరలా ఆరోగ్యవంతులవడానికి ప్రతి ఏటా 54 వేల కోట్ల అమెరికన్ డాలర్లు ప్రజల ఆరోగ్యం కోసమే భారత  ప్రభుత్వం వెచ్చిస్తుందన్నది పచ్చి నిజం. వీటన్నింటినీ నియంత్రించాలనే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ‘స్వచ్ఛభారత్’ దిశగా కలిసి అడుగులు వేస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని..కల సాకారానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్  విషయానికివస్తే…  రాష్ట్రానికి మొత్తం 72 లక్షల మరుగుదొడ్లు అవసరం . ఈ మూడేళ్ళలో దాదాపు  44 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ఇంకా 28 లక్షలు నిర్మించాల్సి ఉంది. ముఖ్యమంత్రి ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ అంటూ నినదిస్తూ పొరుగు రాష్ట్రాల కన్నా ముందే శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం సాధించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తుతున్నారు. రాష్ట్రాన్నిపూర్తి ఓ.డి.ఎఫ్.  రాష్ష్ట్రంగా అంటే – ‘Open defection free’ – ‘బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రకటించాలనే సత్సంకల్పంతో ముందుకెళుతున్నారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ఓడీఎఫ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 7.08 లక్షల గ్రూపులు , 90 లక్షల మందికి పైగా సభ్యులున్న స్వయం సహాయక సంఘాలను ‘సెర్ప్’ భాగస్వామ్యుల్ని చేసింది.

 గర్భిణీలు, వృద్ధుల బాధలు వర్ణానాతీతం

మరుగుదొడ్డి లేకపోవడం వల్ల,  బహిరంగ మలవిసర్జన చేయడంవల్ల మంచి నీటివనరులు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. పచ్చగా ఉండే  పల్లెవాతావరణం.. దుర్వాసన, వాతావరణ కాలుష్యంతో పాడవుతోంది.  తిరిగి ఆ నీటినే తాగడంవల్ల డయేరియా వంటి అంటు రోగాలొచ్చి పిల్లల ఎదుగుదలకు చేటు జరుగుతోంది. అంతే కాదు రోగాల బారిన పిల్లల సంరక్షణ కోసం ఇంటి వద్ద ఉండిపోవడంతో పెద్దలకు పనిదినాలు వృథా అవుతున్నాయి.  మహిళలు, వృద్ధులు, గర్భిణీల పరిస్థితి మరీ దారుణం. మరో మార్గం లేక, చీకట్లో తప్ప మల విసర్జనకు అవకాశంలేని పరిస్థితుల్లో  స్త్రీలు అవసరమైన  వెంటనే మల విసర్జనకు  వెళ్ళలేక, అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందువల్ల వారు మలబద్ధకం, అజీర్ణం, మొలలు వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.  వృద్ధులు ఒంట్లో ఓపిక లేక…ఇంట్లో మరుగుదొడ్డి లేక..బయటికి వెళ్లేందుకు చేతకాక వర్షాకాలం పడే అవస్థలు అనుభవించే వారికే యెరుక. స్త్రీలను పూజించే సమాజం మనది. కానీ మల, మూత్ర విసర్జనకోసం ఆమెను ఆరు బయటకు పంపించడం భావ్యమా? అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. మరుగుదొడ్డి కట్టించుకోవాలి. తద్వార కుటుంబ గౌరవం పెరుగుతుంది.

ప్రభుత్వ సహాయం ఎలా పొందాలి?

ఇంట్లో మరుగుదొడ్డి ఉండడమే ఆరోగ్యకరం. శ్రేయస్కరం. కానీ శుభ్రత కచ్చితంగా పాటించాలి. కచ్చితమైన కొలతలతో మరుగుదొడ్డిని కట్టుదిట్టంగా కట్టించుకోవాలి. ప్రభుత్వమే ఎంత కొలతలుండాలో..ఎలా కట్టుకుంటే మంచిదో సవివరంగా చెప్పడమే కాకుండా..దగ్గరుండి మరుగుదొడ్డి నిర్మాణాన్ని  పూర్తి ఖర్చును భరించి పూర్తి చేయిస్తుంది. మరుగుదొడ్డి కట్టుకోవాలంటే ఇళ్లుకట్టుకునేంత స్థలం అక్కర్లేదు. అంత ఖర్చు ఉండదు. ఉన్న ఖర్చును కూడా ప్రభుత్వమే బాధ్యతగా భరిస్తుంది. మరుగుదొడ్డి గుంత  4×3 అడుగుల కొలతతో ఉంటే రూ.12వేలు, 4×6 అడుగుల కొలతతో ఉంటే రూ.15,000 ప్రభుత్వం ఇస్తోంది. పైగా, మీరు మరుగుదొడ్డి కట్టుకోవాలంటే ప్రభుత్వ కార్యలయాల చుట్టూ తిరగనవసరం లేదు. మీ గ్రామైక్య సంఘానికి దరఖాస్తు చేసుకుంటే చాలు… ‘వెలుగు’ సిబ్బంది మీకు అన్నివిధాలా సాయం అందిస్తారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని స్వయంగా మీ ఇంటికే తెచ్చిఇస్తారు.

పారదర్శకత కోసం జియో ట్యాగింగ్

ప్రభుత్వం అందించే సాయం మీకు రెండు విడతలుగా అందుతుంది. పునాదుల వరకు నిర్మాణం జరిగితే మొదటి విడత గా 6 వేలు ఇస్తారు. గోడలు, పైకప్పు కూడా కట్టడం పూర్తయితే మిగిలిన డబ్బు ఇస్తారు. అయితే ఇక్కడ మీరో విషయం గుర్తుంచుకోవాలి. ‘ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్’ మీ మరుగుదొడ్డిని ఫోటో తీసి వెలుగు ఆఫీస్ కు పంపిన తర్వాతే, మీ మరుగు దొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. మీ మరుగుదొడ్డి స్థలం దాని నిర్మాణం రికార్డుల్లో నమోదు చేయడాన్ని ‘జియో టాగింగ్’ అంటారు. అందిస్తున్న సాయం పక్క దారిపట్టకుండా ప్రభుత్వం తీసుకున్నపారదర్శక విధానమే తప్ప  ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏ కోశాన లేదు.

మరుగుదొడ్డిని ఎలా నిర్మించుకోవాలి?

మరుగుదొడ్డి నిర్మించుకునే ముందు .. వ్యర్థాలను బయటికి పంపడానికి మరుగుదొడ్డి సమీపంలో రెండుగుంతలను తవ్వాలి. ఒక్కో గుంత వ్యాసం ఒక మీటరు ఉండాలి. గుంతలోతు 1.2 మీటర్లు ఉంటే చాలు. అంతకు మించి లోతు పెరిగితే భూగర్భజలాలు కలుషితం అవుతాయి. గుంతకు గుంతకు మధ్య ఒక మీటరు దూరం ఉండాలి. సమీపంలో బోరు లేదా బావి ఉంటే వాటికి కనీసం 10 మీటర్ల దూరంలో ఈ గుంతలను తవ్వాలి. లేకపోతే వాటిలో ఉండే నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. రెండు గుంతలతో మాత్రమే మరుగుదొడ్డి కట్టుకోవాలి. ఒక గుంత వ్యర్థాలతో నిండిన తర్వాత మరో గుంతలోకి  వ్యర్థాలను పంపేందుకు అనువుగా కవాటం లాంటి ఏర్పాటు ఉండాలి. ఒక కుటుంబం దాదాపు ఆరు నెలల పాటు మరుగుదొడ్డిని ఉపయోగిస్తే ఒక గుంత నిండుతుంది.  ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని మార్చుకోవాలి. శుభ్రం చేసుకోవాలి. మరుగుదొడ్డి గుంతలలో అమర్చే ఒరలలో ఒకదానికి మరొక దానికీ మధ్య ఖాళీ ఉంచాలి. వీలయితే ఒరలకు చిన్నచిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వ్యర్థాలలోని నీరు బయటకు వెళ్ళిపోతుంది. గుంత అడుగున కాంక్రీటు చేయకుండా మట్టితోనే వదిలేయాలి. వెంట్ పైపును అమర్చకూడదు. గొట్టాలను వాలుగా నిర్మించినట్లయితే వ్యర్థాలు పోయేందుకు ఎక్కువ నీటిని ఉపయోగించే అవసరమూ ఉండదు.      మరుగుదొడ్డిని తవ్వే ముందు వెంట్ పైపును అమర్చకపోతే చాలు. ఎందుకంటే వ్యర్థాలు ఎరువుగా మారేందుకు అవసరమైన రసాయనిక చర్యలు జరగాలంటే వ్యర్థాల నుంచి వెలువడే వాయువులు బయటకు పోకుండా ఉండాలి. వెంట్ పైపును అమర్చడంవల్ల ఈ రసాయనిక చర్య సరిగా జరగదు.

మరుగుదొడ్డి నిర్మాణం,  కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి?

మరుగుదొడ్డి కట్టించుకునే వాళ్ల సంఖ్య పెరుగుతున్నా..వాటిని వాడే వాళ్లు ఎంతమందని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలగడం ఖాయం. చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు, కాని అవగాహన లేకపోవడంతో మలవిసర్జనకు తప్ప వాటిని అన్ని రకాలుగా  వినియోగిస్తున్నారు. చాలా మంది వంట చెరకు, ఎరువులు, పొలానికి వాడే మందులు దాచుకొనే గదిలా వాడుతున్నారు. మరుగుదొడ్డి లేనివాళ్లు ప్రతి ఇంటా వ్యక్తిగత  మరుగుదొడ్డి నిర్మించుకోడానికి  తక్షణమే దరఖాస్తు చేసుకోవాలి. మరుగుదొడ్లు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలలో మల, మూత్రవిసర్జన  చేయకూడదు. బావి, బోరువంటి వాటికి సమీపంలో మీ మరుగు దొడ్డి ట్యాంకు కట్టకూడదు. మంచినీటి చెరువులు, కుంటలు ఉన్నచోట్ల మల, మూత్ర విసర్జన చేయడం, చేతులు కడగడంలాంటి పనులు చేయకూడదు. మనం తినేముందు చేతులను శుభ్రంగా సబ్బుతో  కడుక్కోవాలి. మలవిసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. తద్వారా డయేరియాని 40 శాతం, శ్వాసకోశవ్యాధులను 30 శాతం తగ్గించవచ్చని  నిపుణులు  చెబుతున్నారు.

 

నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలే ఆదర్శం

మన రాష్ట్రం నుంచి ఇప్పటికే  వంద శాతం బహిరంగ మలవిసర్జన లేని జిల్లాలుగా ప్రధాన మంత్రి చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ లో నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ప్రకటించబడ్డాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల తర్వాత సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా అవతరించేందుకు  తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం పరిగెడుతోంది. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాల్లో శ్రీకాకుళం అట్టడుగున ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కడప, చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం ఉన్నాయి.

   అవగాహనే ముఖ్యం

మరుగుదొడ్డిని వినియోగించని వారికి అవగాహన కలిగించేందుకు పశ్చిమగోదావరి జిల్లా దువ్వాలో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. దువ్వ గ్రామంలో మహిళలు కమిటీలుగా ఏర్పడి బహిరంగ మలవిసర్జన జరగకుండా తెల్లవారు జామున గ్రామ పరిసరాల్లో ప్రతిరోజు  పహారా కాస్తున్నారు. బహిరంగ మలవిసర్జనకు వెళ్ళేవారికి ఆ పని వల్ల కలిగే ఇబ్బందులను, నష్టాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినా ..వాటిని వినియోగించడం లేదు. అందుకే మరుగుదొడ్డిని నిర్మించడం ఎంత ముఖ్యమో వినియోగించడం అంతే ముఖ్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

వెలకట్టలేని వెలుగుయంత్రాంగం కృషి

మరుగుదొడ్లి నిర్మాణం సొంతంగా చేపట్టలేని స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్త్రీనిధి (హెచ్ డీఐఎఫ్) సంఘాల నిధులు వినియోగించుకొనుటకు సమాఖ్యలు ముందుకొస్తున్నాయి. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలలోని 7.1 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టడానికి ‘వెలుగు’ యంత్రాంగం మరింత కృషి చేస్తోంది.

 స్వచ్ఛాంధ్రకు మనవంతు ప్రయత్నం చేద్దాం

దేశ వ్యాప్తంగా ఈ ఓడీఎఫ్ పై అవగాహన కోసం, దేశంలోని గ్రామలన్నింటినీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మార్చడం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. యావత్ దేశాన్ని వందశాతం ఓడీఎఫ్ గా మార్చేందుకు  ఉన్న అవకాశాలను పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలని చైతన్యవంతులను చేస్తున్నాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఇటువంటి అవగాహనా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. పేద,నిరుపేదలంతా ప్రభుత్వ సహాయంతో  మరుగుదొడ్డి నిర్మించుకోండి. ఆరోగ్యంతో పాటు మన ఇంటి ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడండి. మన నవ్యాంధ్ర కోసం ఆరోగ్యవంతమైన బిడ్డల్ని  అందించండి. మరుగుదొడ్డి నిర్మిద్దాం.. మనమంతా కలిసి మన రాష్ట్రాన్ని,దేశాన్ని పరిశుభ్రంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.

ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా ఆ ఇంటికి మరుగుదొడ్డి ఎంతో అవసరం. ఇది మన ఇంట్లోనివారి గౌరవానికి ప్రతిబింబం. మనం ఎంతటి సంస్కారవంతులమో చెప్పేందుకు ఓ నిదర్శనం. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీల పట్ల కుటుంబానికిగల ప్రేమకు అదే తార్కాణం.

 

 

Share.

Leave A Reply