ప్రజలకుసేవ చేస్తున్న4,13,417మంది బతుకు చిత్రం తెలుసా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

( By Aranya Krishna )

(October 9) “ప్రపంచ తపాల దినోత్సవం”! గుండె చప్పుడు కంటే మొబైల్ రింగ్ టోన్ కి ప్రాముఖ్యత ఇచ్చే ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగులకి లేదా ప్రజలకి ఏం పని ఉంటుందని చాలామంది అనుకుంటుంటారు. కొంచెం నేను చెప్పేది కూడా వినండి.

Aranya krishna

మూడున్నర దశాబ్దాలకు పైగా ఇందులో పనిచేస్తున్నా. నా గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా పోస్టాఫీసుతోనే పెనవేసుకు పోయింది. చిన్నప్పుడు గుంటూరు హిందూ హైస్కూలు నుండి ఇంటికివెళుతున్నప్పుడు మా ఆర్.అగ్రహారం పోస్టాఫీస్-522003 కనబడేది. ఏం పని లేకున్నా అక్కడ వున్న నాలుగు మెట్లెక్కి లోపలికి చూస్తే ఏదో ఆకర్షణ కనబడేది. కానీ అప్పుడు తెలీదు కదా నాకు నా జీవితంలో సుమారు నాలుగు దశాబ్దాలు పోస్టాఫీస్ తో ముడిపడిందని. వీధిలో కనబడ్డ పోస్ట్ మాన్ గొప్ప అబ్బురంగా కనిపించేవాడు. అతని చేతిలోకి ఆ ఉత్తరాల కట్ట ఎలా వచ్చేదో పెద్ద మిస్టరీ నాకు. తపాల శాఖలో నా ఉద్యోగం నా బతుకు తెరువు మాత్రమే కాదు. నాకెంతో ప్రీతి పాత్రమైంది. నా ఉద్యోగ జీవితాన్ని నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను. 38 ఏళ్ల తరువాత కూడా నాలో ఆ ఎగ్జైట్మెంట్ ఏ మాత్రమూ తగ్గలేదు.

ఏ ప్రగతిశీల భావజాలమూ తెలియక ముందు, నాకంటూ కుటుంబం ఏర్పడకముందు నుండీ నేను పోస్టాఫీస్ ఉద్యోగిని. నా భావజాలం, నా కుటుంబం ఎంతటి ముఖ్యమో నాకు నా ఉద్యోగం కూడా అంతే ముఖ్యం. ఈ ద్వంద్వ ప్రమాణాల, అవినీతిమయ వ్యవస్థలో ఏనాడూ ఆత్మవంచన, పరవంచన చేసుకోవాల్సిన పరిస్తితి కలగలేదు నా ఉద్యోగ జీవితంలో. అంత గొప్ప ప్రభుత్వ శాఖ నా తపాల శాఖ. అంతేకాదు. నా ఉద్యోగ జీవితంలో భాగంగా, యూనియన్ యాక్టివిటీస్ కారణంగానూ దేశమంతా విస్తృతంగా తిరిగే అవకాశం నాకు దొరికింది. దేశం యొక్క మూలమూలలూ చూసాను. అది కూడా అనేకసార్లు చూసాను. 1983 నుండి 1990 వరకు డిసిప్లినరీ కేసెస్ కి సంబంధించి నేను పని చేసిన ఒక పోస్ట్ కారణంగా ముఖ్యంగా కేరళ, తమిళనాడు, బీహార్, ఢిల్లీ…ఇవి బాగా తిరిగాను. తపాల వ్యవస్థ ప్రజా జీవితంలో, ముఖ్యంగా గ్రామీణ జన జీవితంలో ఎంత ముఖ్య భాగమో తెలుసుకొని ఎంతో గర్వపడ్డాను. సంబరపడ్డాను. అందుకేనేమో ఇన్నేళ్ల సుదీర్ఘ సర్వీసులో నాకేనాడు నా ఉద్యోగం బోర్ కొట్టలేదు. నా డిపార్ట్మెంట్ తో నాకు గొప్ప భావోద్వేగ బంధం వుంది. అందుకే ఏ విదేశం వెళ్లినా అక్కడి పోస్టాఫీస్ కనిపించినా గొప్పగా ఆనందపడి పోతాను. వాళ్లు నా కజిన్స్ అనిపిస్తుంది. కానీ ఏ మాటకా మాటే చెపుకోవాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ తపాల వ్యవస్థ మనదే. ఆధునిక సాంకేతిక సవాళ్లను తట్టుకొని నిలబడ్డది నా పోస్టాఫీస్. తనని తాను కొత్తగా మలుచుకొంటూనే వున్నది. ఎలాగో చెబుతాను వినండి.

రైల్వే అంటే రైళ్లకి సంబంధించింది కదా – అలాగే అధికభాగం జనం పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలకు సంబంధించిందనే అనుకుంటారు. కానీ పోస్టాఫీస్ ప్రధానంగా ప్రజల ఆర్ధిక వ్యవహారాలు కూడా చూస్తుంది. 1.57 వేల పోస్టాఫీస్ నెట్వర్క్ గ్రామీణులకు బాంకు వంటిదే. ఒక్క లోన్స్ ఇవ్వటం మినహా మేం బాంకు చేసే పనులన్నీ చేస్తాం. మా దగ్గర సేవింగ్స్ బాంక్, రికరింగ్ డిపాజిట్, సీనియర్సిటిజెన్ సేవింగ్స్ స్కీం, పిపిఎఫ్ తో సహా అన్నీ లభ్యం అవుతాయి. వంద రూపాయిలతో మీరు ఎస్బి అకౌంట్ ఓపెన్ చేయండి. మీకో డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. దాన్ని మీరు నగదు ఉపసంహరణకి ఏటీఎం గా ఏ బాంక్ మెషిన్లో అయినా వాడుకోవచ్చు. సేవా రుసుముల పేరుతో, పెనాల్టీల పేరుతో భారీ వడ్డనలుండవు. కేవలం 500 రూపాయిలతో మేం చెక్ అకౌంట్ ఇస్తాం. మా ఎన్నెస్సీ, కేవీపి సర్టిఫికేట్స్ కి తిరుగులేని విశ్వసనీయత వున్నది. ఏ పథకమైనా సామాన్య ప్రజలకి ఉపయోగపడే ప్రధానమంత్రి యొక్క ప్రతి పథకం పోస్టాఫీస్ ద్వారా ప్రజల్ని చేరుతుంది. పేద ప్రజల బీమా పథకాలు, ఆడపిల్లల్ని ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన…వంటి పథకాలకి చిరునామా పోస్టాఫీసే. ఈ దేశంలో పేదవారిని చేరటం కోసం కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని చేరాలంటే పేదవారికి దగ్గరి దారి పోస్టాఫీసే. “మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం”కింద చెల్లించబడే వేతనాలు పోస్టాఫీసు దారానే చెల్లించబడతాయి. అంతకు మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది లక్షలు కూడా లేని ఎస్బి ఖాతాలు ఈ పథకం ఆరంభంతో అనతికాలంలోనే కోటి దాటిపోయాయి పోస్టాఫీసులలో. ఆధార్ విజయవంతం కావటంలో కూడా పోస్టాఫీసు కీలకపాత్ర పోషించింది. ఆధార్ బట్వాడా పూర్తిగా పోస్టాఫీసుదే కాగా ప్రస్తుతం ఆధార్ నమోదు కూడా పోస్టాఫీసులో జరుగుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రారంభం కాకమునుపు వోటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్ దరఖాస్తుల స్వీకరణ కూడా పోస్టాఫీసులో జరిగేది. (ఇప్పుడు కూడా పాస్పోర్ట్ దరఖాస్తు ఆన్లైన్ సర్వీసు ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో లభ్యమవుతుంది.)

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పోస్టాఫీస్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా! అవును “తపాల జీవిత బీమా” పథకం బ్రిటీష్ వారి సమయంలో 1884లోనే అంటే ఇప్పటికి 136 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పని చేస్తూ, “ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా” కింద జారీ చేయబడుతూ ఐఆర్డీఎ పరిధిలోకి రాని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీ.ఎల్.ఐ.) ఆఫర్ చేసే “లో ప్రీమియం – హై బోనస్” బీమా పరిశ్రమలోని మరే ఇతర కంపెనీ ఇవ్వలేదు. కొంత కాలం క్రితం వరకు కేవలం ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పరిమితం చేయబడిన పీ.ఎల్.ఐ. ప్రస్తుతం డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు వంటి వృత్తి నిపుణులకు కూడా విస్తరించటం జరిగింది. ఇందులో భార్యాభర్తలు ఇద్దరి కోసం ఉద్దేశించిన సింగిల్ పాలసీ (యుగళ్ సురక్ష), చిల్డ్రన్స్ పాలసీ కేవలం పీఎల్లై కి మాత్రమే ప్రత్యేకం. ఏజెంట్ల హడావిడి, చాకొలేట్ రేపర్లు చుట్టినట్లు రైడర్ బెనిఫిట్స్ లేకుండా సరళంగా, సూటీగా వుంటాయి తపాల జీవిత బీమా పథకాలు. పీఎల్లై ఫీల్డ్ ఆఫీసర్గా ఎన్నో వందల స్కూళ్లను చూసాను. వాటి నిర్వహణ, వ్యవస్థని దగ్గర నుండి చూసే అవకాశం నాకు దక్కింది. అలాగే ఎన్నో కార్యాలయాల రూపంలో వుండే ప్రభుత్వ సర్వ సమగ్ర రూపాన్ని కూడా చూసాను.

పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఒక నిర్దిష్ట పనివిధానం వుంటుంది. ప్రభుత్వం యాభై పైసల నాణెం ముద్రించదు కానీ ఆ అర్ధ రూపాయి విలువకి మేం కాశ్మీర్ నుండి కన్య కుమారి వరకు సర్వీస్ ఇస్తాం. అద్భుతమైన అకౌంటింగ్ విధానమున్నది. చాలామంది అనుకుంటుంటారు పర్సనల్ కమ్యూనికేషన్ అంతా మొబైళ్లలో జరిగిపోతున్నది కదా, మనీ ఆర్డర్లతో ఇంక పనే లేనప్పుడు ఇంక పోస్టాఫీస్లో పనేముంటుందని. పీఎల్లై పాలసీలు అమ్మటానికి నేను ఫీల్డ్ మీదకి వెళ్లినప్పుడు నన్నెందరో ఇదే అడిగేవారు. కానీ వాళ్లందరికీ తెలియని విషయం ఏమిటంటే ఇప్పటికీ రిజిస్టర్డ్ పోస్ట్ కి ప్రత్యామ్నాయం లేదు. స్పీడ్ పోస్ట్ పెద్ద సక్సెస్. ఒక్కోసారి కార్వే వంటి కంపెనీలు ఇచ్చే బల్క్ మెయిల్ని ప్రాసెస్ చేసి, ట్రాన్స్మిషన్ కి, బట్వాడాకి సిద్ధం చేయటానికి పెద్ద పెద్ద హాళ్లు బుక్ చేస్తున్న సందర్భాలున్నాయి. పర్సనల్ మెయిల్ తగ్గినా కమర్షియల్ మెయిల్, బల్క్ మెయిల్ విపరీతంగా పెరిగింది. మా దగ్గర దేశవ్యాప్తంగా లక్షాకి పైగా దిన పత్రికలు, వార, పక్ష, మాస, ద్వైమాసిక పత్రికలు పోస్టల్ కన్సెషన్ ఉపయోగించుకొని చారణా, ఆఠణా ఖర్చుతో ప్రజల్ని చేరుతుంటాయి. “ప్రింటెడ్ బుక్ మాటర్” కింద ఒక పుస్తకాన్నిఒక రూపాయి, రెండు రూపాయిల ఖర్చుతో పంపించుకోవచ్చు.

డెలివరీలో డిలే గురించి చాలా జోక్స్ పేలతాయన్న విషయం నాకు తెలుసు. వందల రూపాయిలు తీసుకొని కొరియర్ వాడు పారేసినా అడగలేం. ఎందుకంటే అది ఇల్లీగల్. కానీ మేం ప్రతి అకౌంటబుల్ ఆర్టికల్ కి బాధ్యులం. మా దగ్గర ఒక్క ఆర్టికల్ మిస్ అయినా కఠినమైన శిక్షలుంటాయి. కాబట్టే మీకు 17 రూపాయిలకి ఖచ్చితమైన డెలివరీ వుంటుంది. మా కష్టాలు మాకున్నాయి. ట్రెయిన్లలో సార్టింగ్ తీసేసారు. ఆర్.ఎం.ఎస్. (రైల్వే మెయిల్ సర్వీస్) సెట్స్ తీసేసారు. ఇదివరకు వైజాగ్లో రైల్వే స్టేషన్లో వున్న ఆరెమ్మెస్ డబ్బలో పడేస్తే దాన్ని గోదావరి ఎక్స్ప్రెస్ (మా భాషలో దాన్ని వి-9 అవుట్ అంటాం) లో పంపీంచి మరుసటిరోజు హైదరాబాద్లో డెలివరీ చేయించేవారు. ఇప్పుడా పరిస్తితి లేదు. దానికి కారణాలు పైన వివరించాను కదా. స్టాఫ్ సంఖ్యలో కూడా బాగా కోత పడిపోతున్నది.

ఇప్పటి జనరేషన్ సంగతేమో కానీ పాత జనరేషన్స్ వాళ్లకి పోస్ట్ మాన్ తో గొప్ప అనుబంధం వుండేది. పోస్ట్ మాన్ ప్రతి ఒక్కరి నోస్టాల్జియాలో భాగం. విపరీతంగా పెరిగిపోతున్న అర్బనైజేషన్, అపార్ట్మెంట్స్ పోస్ట్ మాన్ల పాలిట శాపంగా మారాయి. మీరు బీఎసెనెల్ కి సబ్స్క్రైన్ చేస్తేనే తప్ప మీకు వారి సేవలందవు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. కానీ తపాల శాఖకి ఆ షరతులేమీ వుండావు. మీరు నగరం నడిబొడ్డులో వున్నా లేదా అరకు పక్కన డుంబ్రిగుడ మండలం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో కొండ మీద వున్న గిరిజన గూడెంలో వున్నా మీకు సేవలు అందించాల్సిందే. మనుషుల్ని డబ్బులతో, హోదాలతో, పరపతితో కాక చిరునామాలతో పోల్చుకునే మనుషులం బాబూ మేము!

భారతదేశ చరిత్ర, సంస్కృతితో ముడిపడ్డ ప్రభుత్వ శాఖ మా తపాల శాఖ. దేశ చరిత్ర, సంస్కృతితో ముడిపడ్డ ప్రతి సంఘటనని తపాల స్టాంపులు ప్రతిబింబిస్తాయి. వాటి వంక అలా ఎప్పుడైనా చూసారా? ఎందరో మహానుభావులు కనిపిస్తారు అందులో. తత్వ వేత్తలు, సంగీతకారులు, విద్వాంసులు, రచయితలు, కవులు, సైంటిస్టులు, సినిమా ఆర్టిస్టులు, స్వాతంత్ర్య సమరయోధులు…..ఇలా ఒక్కరనేమిటి? ఎందరో పోస్టల్ స్టాంపుల్లో సజీవులై వుంటారు. అంతేకాదు భారతదేశానికి ప్రత్యేకమైన ఫ్లోరా అండ్ ఫానా (చెట్టు చేమ), జంతువులు అన్నీ కనబడతాయి. తపాల స్టాంపుల సేకరణ (ఫిలేట్లి)ని “కింగ్ ఆఫ్ హాబీస్” (అభిరుచుల రారాజు) అని వర్ణిస్తారు. ద మోస్ట్ క్లాసిక్ హాబీ అది! ఎప్పుడూ గొప్పవాళ్లే ఎందుకు అందులో చోటు చేసుకోవాలి? మీరు కూడా పోస్టల్ స్టాంపుల్లో కనబడొచ్చు. “మై స్టాంప్” కింద కేవలం మూడొందల రూపాయిలకే మీకా అవకాశం దొరుకుతుంది. మీరు జస్ట్ అలా మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్లండి. మీ స్టాంపులు మీరు కోరుకున్న డిజైన్ తో లభిస్తుంది. నమ్మరా? అయితే కింద నేను చేయించుకున్న స్టాంప్ ఇస్తున్నా. చూడండి. ఇది మీ పిల్లల, మనవల, స్నేహితుల, సహచరుల, కుమారుల, కుమార్తెలకి పుట్టినరోజు బహుమతిగా వాళ్ల స్టాంప్ ఆల్బం ఇచ్చుకోండి. మేమూ సంతోషిస్తాం.

మొన్న లాక్డౌన్ సమయంలో కూడా మేం పని చేసామని చెప్పటానికి గర్విస్తున్నా. వలస కూలీల జన్ ధన్ ఖాతాల్లో ప్రభుత్వం వేసిన సొమ్ముని మేం ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా జస్ట్ వారి ఆధార్ వెరిఫికేషన్ తో వాళ్లకి సొమ్ము ఇచ్చాం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహించి మరీ వారికి మా సేవలు అందించాం.
****

ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా సేవలందించే సంస్థ మాది. వాడుకోండి బాబూ తపాల సేవల్ని. వాడుకున్న వారికి వాడుకున్నంత!

“ప్రపంచ తపాల దినోత్సవం” (అక్టోబర్ 9) సందర్భంగా ఈ దేశ ప్రజలకు సర్వీస్ ఇవ్వటానికి సిద్ధంగా వున్న నాబోటి 4,13,417 మందికి కనీసం శుభాకాంక్షలైనా చెప్పరా? – Aranya Krishna

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply