సూళ్లూరు పేట నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు?

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశానికి సుదీర్ఘ మైన తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కంటే పెద్దదైన సముద్రతీర ప్రాంతం గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. అయినా.. కూడా సూళ్లూరు పేట నుంచే రాకెట్‌ ప్రయోగాలు జరుగుతుండటం వెనుక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు కూడా, ఇక్కడి నుంచే గగనతలంలోకి వెళ్తూ ఉంటాయి కూడా. దీనికి కారణం, సూళ్లూరు పేట (AndhraPradesh) లోని శ్రీహరి కోట అన్ని విధాలా రాకెట్‌ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్‌ ప్రయోగ కేంద్రం అది.
ఈ ప్రాంతానికి ఇంత ప్రత్యేకత ఏంటి..? ఆ అనుకూలతలు ఎలాంటివి ? రాకెట్‌ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 8 కారణాలు ఉన్నాయి అంటారు సైంటిస్టులు.
1, భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం పెరుగుతుంది. భూ భ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.
2, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాకెట్‌ ప్రయోగ కేంద్రాలను పరిశీలిస్తే.. భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌ గయానాలోని కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్‌ దేశాలు తమ రాకెట్లను ప్రయోగిస్తున్నాయి.
3, భూ భ్రమణానికి-రాకెట్‌ వేగానికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు చెప్పేది ఒక్కటే.. గంటకు లక్షా 8వేల కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తిరుగుతున్న దిశలో రాకెట్‌ను ప్రయోగిస్తే అది కూడా ఎక్కువ వేగం అందుకుంటుంది. అయితే, భూపరిభ్రమణ వేగం అంతటా ఒకేలా ఉండదు. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. శ్రీహరి కోటలో ఈ అనుకూలత చాలా కీలకమైంది.
4, శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్‌ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు వేగం అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్‌ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు.
5, రాకెట్‌ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. ఆ రాకెట్‌ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది. కానీ, శ్రీహరి కోట చుట్టూ.. బంగాళాఖాతం, పులికాట్‌ సరస్సు ఉంటాయి. ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారం గానీ, ఇళ్లు కానీ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా.. రాకెట్‌ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.
6, రాకెట్‌ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. వీటిలో కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలనే, రాకెట్‌ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోటకు సమీపంలోనే రైలు, రోడ్డు,విమాన, నౌకామార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి అతి సమీపంలో ఉంది. ఇరవై కిలోమీటర్లలో రైల్వే స్టేషన్‌, 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై పోర్టు ఉన్నాయి.
7, రాకెట్‌ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
8, రాకెట్‌ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్‌ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది ‘రాకెట్‌ ప్రయోగాల కోట’ అయింది.
నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తి స్థాయి రాకెట్‌ నిర్మాణ కేంద్రంగా మారింది.
ఇలాంటి పరిస్ధితులే శ్రీహరికోటను అంతర్జాతీయ రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాయి. భారతదేశ కీర్తితో పాటు… ఆంధ్రప్రదేశ్‌ పేరుకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయి.

Share.

Leave A Reply