గ్రామం మాయం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జంతువుల మధ్య చీకట్లో జీవిస్తున్న , చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం ప్రజలు ఇల్లు, పశువులు, పొలాలు వదిలి పారిపోయారు, ఎందుకో తెలుసా..? చదవండి !!


అసలు కరెంట్‌ తీగ ఎలా ఉంటుందో కూడా తెలియని గ్రామం మాధవరం కుయ్యవంక(తవణం పల్లి మండలం,చిత్తూరు జిల్లా). చుట్టూ అడవి, మధ్యలో చిన్న పూరిళ్లలో యానాది గిరిజన తెగకు చెందిన 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరికీ రేషన్‌,ఆధార్‌ ,ఓటర్‌ కార్డులున్నాయి. కానీ విద్యుత్‌ లేదు. కిరోసిన్‌ గుడ్డిదీపాలతో రాత్రులు గడుపుతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా, రేషన్‌ సరుకులు,కిరోసిన్‌ తెచ్చుకోవాలన్నా 3కిలో మీటర్ల దూరంలోని మాధవరం సంచాయితీకి వెళ్లాలి.
” కరెంట్‌ లైట్‌ ఎలా ఉంటుందో ఇప్పటికీ మాకు తెలియదు. పిల్లలు హోం వర్క్‌ చేయడానికి వెలుగు లేదు. కనీసం బడికి వెళ్లాలన్నా మార్గం సరిగా లేక, ఆటో కూడా రావడం లేదు. దీనివల్ల ఇరవై మంది పిల్లలు బడి మానేశారు. ” అంటారు గ్రామస్ధులు. ఇక్కడి ప్రజలు పశువులు,గొర్రెల పోషణ చేస్తూ చిన్న కమతాల్లో కూరగాయలు పండిస్తున్నారు. గొర్రెల పై దాడి చేయడానికి తరచూ అడవి జంతువులు వీరి ఇళ్ల మధ్యకు రావడంతో అదొక జీవన్మరణ సమస్యగా మారింది.
టెన్త్‌ వరకు చదివిన గంగులమ్మ ఈ గ్రామంలో చదువుకున్న ఏకైక వ్యక్తి. పొలం పనులు చేసుకుంటూ సాయంత్రం పిల్లలకు చదువు చెబుతుంది.
” కరెంట్‌ కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తరచూ నక్కలు, ఏనుగులు మా గూడెం వైపు వస్తుంటాయి. సమీపంలో ఉన్న తుమ్మపాలెం అడవిలో చిరుత పులి సంచరిస్తుంది. వీటి నుండి కాపాడుకోవడానికి కట్టెలతో రాత్రుళ్లు మంటలు వేసుకొని కొందరు వంతుల వారీగా కాపలా కాయాల్సి వస్తోంది. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌కి కొండ దిగి 3 కిలో మీటర్లు దూరం పోవాలి. మాకు కనీసం వీధి లైట్లు వేసినా బాగుండేది.” అని మాతో ధీనంగా చెప్పింది గంగులమ్మ.


రూరల్‌ మీడియా టీమ్‌ ఆరేళ్ల క్రితం ఈ గ్రామానకి వెళ్లినపుడు గుర్తించిన అంశాలు. ఇటీవల ఆగస్టు నెల(2019)లో ఆ గ్రామంలో ఏదైనా మార్పు వచ్చిందా? అని పరిశీలించినపుడు షాకింగ్‌ వార్త తెలిసింది. ఆ గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాని వెనుక ఉన్న కారణాలను మాస్‌ ఎన్జీఓ సంస్ధ డైరెక్టర్‌ సునంద, ఇలా వివరించారు.

” విద్యుత్‌ లేక పోవడం వల్ల, మాధవరం కుయ్యవంక అభివృద్ధిచెందడం లేదు. పిల్లల చదువుకు దూరమవుతున్నారు. దోమల వల్ల వ్యాధులకు లోనవుతున్నారు. మాధవరం పంచాయితీకి కరెంట్‌ ఉన్నప్పటికీ దానిలో భాగమైన ఈ కుగ్రామానికి కరెంట్‌ లైన్‌ ఇవ్వడం లేదు. అటవీ ప్రాంతం వల్ల అటవీశాఖ అనుమతి కావాలని విద్యుత్‌ శాఖ అంటోంది. తరతరాలుగా వీరు ఇలా చీకట్లోనే మగ్గుతున్నారు. వారు సాగు చేసుకోవడానికి మా సంస్ధ తరపున పండ్ల మొక్కలు,కూరగాయల విత్తనాలు ఇచ్చాం. దాంతో జీవనోపాధిని పొందుతున్నారు. కానీ ఆగస్టు మొదటి వారంలో, ఏనుగుల గుంపు ఆ గ్రామం పై దాడి చేసింది, ప్రాణాలు కాపడుకోవడానికి వారంతా ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ” అన్నారు.
……………………
మాధవరం కుయ్యవంక గ్రామస్తులు ,pic by ,team ruralmedia

Share.

Leave A Reply