పులి చంపిన లేడి నెత్తురు!

Google+ Pinterest LinkedIn Tumblr +

కారంచేడు: పులి చంపిన లేడి నెత్తురు!

The rise of Katti Padma Rao – Part 1
——————————————-
అమెరికాలో నడిరోడ్డు మీద జార్జి ఫ్లాయిడ్ మెడ మీద మోకాలు పెట్టి ఊపిరితీస్తున్న పోలీసు అధికారికి నల్లజాతి మహోద్యమానికి పిలుపు ఇస్తున్నానన్న సంగతి అస్సలు తెలీదు.

విజయవాడ వంగవీటి రంగా హత్యకి పథకం పన్నిన వాళ్లకి చెల్లాచెదురుగా వున్న కాపులు అందర్నీ ఒకే తాటిపైకి తెస్తున్నామన్న స్పృహ అస్సలు లేనే లేదు.

కారంచేడులో దళితుల్ని బరిసెల్తో పొడిచి చంపిన వాళ్లకి ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగులేని దళిత ఉద్యమానికి తెర తీస్తున్నామన్న సంగతి, హవ్వ! సుతరామూ తెలీదు.

*** *** ***

1968. డిసెంబరు 25. తమిళనాడు
తంజావూరు జిల్లాలోని కీలవేణ్మని గ్రామం. వ్యవసాయ కూలీలైన దళితులందరినీ మార్క్సిస్టు పార్టీ ఆర్గనైజ్ చేసింది. కూలిరేట్లు పెంచమని అడిగారు. దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారు భూస్వాములు. గొడవలు జరిగాయి. దళితుల యిళ్లపై ఎర్రజెండాలు… భూస్వాముల ఇళ్లపై పసుపు జెండాలు! క్రిస్ట్ మస్ రోజు రాత్రి 10 గంటలకి
200 మంది గూండాలు భూస్వాములు
గ్రామం మీదికొచ్చారు. కూలి జనాన్ని
తరిమి తరిమి కొట్టారు. భయపడి దళితులు
ఒక యింట్లో దాక్కున్నారు. గూండాలు ఆ యింటిని తగలబెట్టారు. గడ్డీ, ఎండు కట్టెలూ వేయడంతో మంటలు ఎగసి పడ్డాయి. 44 మంది దళితులు సజీవ దహనం అయిపోయారు. ఇద్దరు పిల్లలు బైటికి వస్తే వాళ్లని పట్టుకుని మంటల్లోకి విసిరేశారు. ఆరుగురు పెద్దవాళ్లు పరిగెత్తివస్తే, దొరికిన యిద్దర్నీ నరికి అగ్నిలోకి తోసేశారు. ఐదుగురు మగవాళ్లూ,
16 మంది ఆడవాళ్లూ, 23 మంది పిల్లలూ ఆహుతి అయిపోయారు. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై. 1970లో కేసు నడిచింది. హత్యాకాండకి కారణమైన భూస్వాముల నాయకుడు గోపాలకృష్ణ నాయుడుకి కింది కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మద్రాసు హైకోర్టు 1975లో ఆ శిక్షను రద్దు చేసింది.
1980లో గోపాలకృష్ణ నాయుణ్ణి నరికి చంపేశారు.
తమిళనాట దళిత ఉద్యమం నీలి కెరటాలై ఎగిసిపడింది.

*** *** ***

1977 మే నెల 27 రాష్ట్రం బీహార్,
పాట్నాజిల్లా, బెల్చీ గ్రామం.

షరా మామూలే. అటు వాళ్లూ… ఇటు వీళ్లూ…

రెచ్చిపోయిన భూస్వాములు పదకొండు మందిని క్రూరంగా నరికి చంపేశారు. అందులో ఎనిమిది మంది దళితులు. ముగ్గురు కంసాలి వాళ్లు. జనతా పార్టీ జోకర్ల పాలన సాగుతున్న రోజులవి. రాజకీయ కొలిమిలో రాటుదేలిన ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా వున్నారు. బెల్చీ దారుణం విన్న వెంటనే ఢిల్లీ నుంచి బయల్దేరారు. విమానంలో పాట్నా వచ్చారు. పెద్ద కారులో బెల్చీ బయల్దేరారు. కారుని ఒక చోట ఆపారు. కుగ్రామం బెల్చీకి కారు వెళ్లే రోడ్డు లేదు. కారు దిగి నించున్నది ఇందిరాగాంధీ. ఆమెని ఎడ్లబండి మీద తీసికెళ్లాలా? అసాధ్యులైన కొందరు కాంగ్రెస్ నాయకులు కూడబలుక్కుని ఒక ఏనుగుని రప్పించగలిగారు. తెల్లచీర, తెల్లజాకెట్టుతో వున్న ఇందిరాగాంధీ ఆ నల్లటి ఏనుగు ఎక్కారు. బెల్చీ చేరుకున్నారు. పరుగు పరుగున వచ్చిన దళితుల్ని అక్కున చేర్చుకుని అప్యాయంగా పలకరించి, హామీలిచ్చి రాజకీయ డ్రామా పతాక సన్నివేశాన్ని సహజ నటనతో ఇందిరాగాంధీ పండించారు. మర్నాడు దేశంలోని అన్ని దినపత్రికలూ ఏనుగు మీద వెళ్తున్న ఇందిర ఫోటోలని మొదటి పేజీల్లో ప్రచురించాయి. బెల్చీ జాతీయ సమస్యగా తలెత్తుకు నిలబడింది.
1980లో జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దళితులు వోట్లు గుద్దిపారేశారు. 357 లోక్ సభ సీట్లతో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. కొన్ని గొర్రెలో, బర్రెలో కొద్దిపాటి బ్యాంకు రుణమో పొందిన దళితులు ఈ దేశంలో అణగారిన వారిగా, అడుక్కు తినే వాళ్లుగానే మిగిలిపోయారు.
దళితులపై ఎక్కడన్నా దారుణ హత్యాకాండ జరిగితే, దాని ప్రభావం అనూహ్యంగా వుంటుందని చెప్పడానికి యిదే వుదాహరణ. ఇందిర మళ్లీ ప్రధాని కావడంలో బెల్చీదే ప్రధాన పాత్ర అని అప్పటి పత్రికలు రాశాయి.

నేటికి 35 సంవత్సరాల క్రితం….

1985, జూలై, కారంచేడు… ప్రకాశం జిల్లా.
ఒక రకంగా చూస్తే మన దళితులు అదృష్టవంతులేమో అనిపిస్తోంది నాకు. దళితులు ఎవర్ని అయితే దూషించారో, శత్రువులని ద్వేషించారో వాళ్లే దళిత ఉద్యమానికి పునాది
రాళ్లు వేయడం! Is it irony? A Paradox?
Or poetic justice?

కమ్మ దురహంకారం కన్నీటి కారంచేడుని ఆవిష్కరిస్తే, మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు నెత్తురోడుతున్న చుండూరుని రెడ్లు తమ వంతు బహుమానంగా యిచ్చారు. ఇంటిపేరులోనే తప్ప చేతుల్లో ఏమీ లేని మాల పద్మారావుకి కత్తినీ, డాలునీ వాళ్లే సమకూర్చారు. పంటలతో, పారే కాల్వలతో అపార ధనరాశులతో తులతూగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇపుడు ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల్ని విస్మరించి బతికి బట్టకట్టలేదు.

అగ్రకుల అహంకారం అణగారిన వాళ్లకి అమృతంగా మారిన చారిత్రక సన్నివేశాన్ని నేను కళ్లారా చూశాను.

అక్టోబరు 6న విజయవాడ నడిబొడ్డున లక్ష మందికి పైగా హాజరైన సభలో దళిత మహాసభ కన్వీనర్ కత్తిపద్మారావు తుఫాన్ లా చెలరేగిపోతూ చేసిన ప్రసంగాన్ని జనం సంభ్రమాశ్చర్యంతో విన్నారు. అప్పటికి బలమైన నిర్మాణం వున్న సి.పి.ఐ, సి.పి.ఎంలు మాత్రమే విజయవాడలో అంత పెద్ద సభ ఆర్గనైజ్ చెయ్యగలవు. ఒక్క పద్మారావు, ఒక్క దళిత మహాసభ ఆ పనిని సులువుగా చేయగలిగాయి. ‘జై భీమ్’ నినాదంతో కమ్యూనిస్టు కోట దద్దరిల్లింది.

కారంచేడులో మాదిగ శక్తి

ప్రజాయుద్ధానికి శ్రీకాకుళం ఎలాగో, దళిత పోరాటాలకు కారంచేడు అలా… ఒక చారిత్రక గుర్తు.

ప్రకాశం జిల్లాలో చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో వుంది కారంచేడు. అది 16 వార్డులున్న పెద్ద పంచాయితీ గ్రామం. అందులో ఎనిమిది వార్డుల్లో కమ్మవారే వున్నారు. మిగిలిన 8 వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లున్నారు. 16వ వార్డులో అంతా దళితులే. అక్కడ రజకులు, యాదవులు, మంగలివాళ్లూ, ఉప్పర్లు, ముస్లింలు, చుండు నాయకులు. ఎరుకల, యానాదులతోపాటు మాల మాదిగలూ వున్నారు. వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో వున్నాయి. వందల ఎకరాలున్న కమ్మవారే పెత్తందార్లు. దగ్గుబాటి, యార్లగడ్డ, చాగంటి, పేర్ని, పూవాటి, మండా వంటి ఇంటి పేర్లతో వాళ్లదే ఆధిపత్యం!

TaadiPrakash

కమ్మవారి దొడ్లతో జీతానికి చాకిరీ చేసే వాళ్లని హీనంగా చూసేవాళ్లు. పనివాళ్లని కొట్టడం, ఎప్పుడైనా చంపడం కూడా అక్కడ అసహజం కాదు. ఎదురు తిరిగిన ఉప్పర్ల (బీసీలు)ని ఒక సారి కొట్టారు. కూలిరేట్ల కోసం జనాన్ని కూడగడుతున్న చుండు నాయకుల్లో ఒకడైన వెంకటేశ్వర్లుని కొట్టారు. అతను పారిపోయి మాదిగ పల్లెలో దాక్కున్నాడు. ‘మాకు వాణ్ణి అప్పజెప్పాలి’ అన్నారు కమ్మ పెద్దలు. ‘మేం రక్షిస్తాం’ అన్నారు మాదిగలు. మాదిగ పల్లెని ఎదిరించలేక వెనుదిరిగారు. మాలపల్లెపై కమ్మవారు దాడి చేసినప్పుడూ మాదిగలు అండగా నిలిచారు. మాదిగపల్లె మీద కక్ష పెంచుకున్నారు. ఒక్క కుటుంబమే నాలుగు వందల కుటుంబాలుగా విస్తరించిన మాదిగ పల్లె అది. తేళ్ల, దుడ్డు ఇంటి పేర్లు గలవాళ్లే ప్రధానంగా వున్నారు. వ్యవసాయ కూలీకి మాత్రం వాళ్లు కమ్మవారి మీదే ఆధారపడి వున్నారు. పొగాకు, పత్తి వంటి వ్యాపార పంటలూ పండిస్తారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య, పోలీసు రెవెన్యూ వ్యవస్థలు ఆయన కొమ్ము కాసేవి. కమ్మ కుర్రాళ్లు దళిత స్త్రీలని టీజ్ చేయడం చాలా సాధారణం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో వున్న భూస్వాములు ఎన్టీఆర్ రాకతో తెలుగుదేశంలో చేరిపోయారు. దళితులు మాత్రం కాంగ్రెస్ తోనే వున్నారు. ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ కి వోట్లు వేస్తుండటంతో కమ్మ వాళ్లు గొడవపడ్డారు. దళితులు ఎదురుతిరిగారు. కర్ర తిప్పడంలో నైపుణ్యం గల కండలు తిరిగిన యోధులు మాదిగలకు వున్నారు. వాళ్లలో మాదిగ పెద్ద యోహోషువా ఒకరు. ఆత్మాభిమానం గల మనిషి. ఎన్నికల గొడవల్లో మాదిగ శక్తికి జడిసి, వెనక్కి తగ్గిన కమ్మవాళ్లు దెబ్బతీయాలన్న కసితో వున్నారు.

1985 జూలై 16న పోతిన శీను, రాయినీడు ప్రసాద్ అనే కమ్మ యువకులు మాదిగవాడలోని మంచినీటి చెరువుకి గేదెలను తోలుకెళ్లారు. వాటికి కుడితి పెట్టి, ఆ కుడితినీళ్లు బక్కెట్లని చెరువులో కడిగారు. అలా చెయ్యకండని చెప్పాడు వికలాంగుడైన దళితుడు కత్తి చంద్రయ్య. అతని మీద కమ్మ యువకులు దాడి చేయబోతుండగా, నీళ్ల కోసం వచ్చిన మున్నంగి సువార్త వాళ్లను అడ్డుకుంది. వాళ్లు చర్నాకోల విసిరారు. ఆమె బిందె అడ్డం పెట్టింది. ఒక మాదిగ ఆడది మన మీద బిందె ఎత్తడమా?
కమ్మ కులాధిపత్యం బీటలు వారినట్టే…
ఎదురుదెబ్బ తియ్యాల్సిందే.

ఆ రాత్రే కారంచేడు కమ్మ పెద్దలు సమావేశం అయ్యారు. ఎలా? ఎప్పుడు? ఏ రకంగా? అనే కీలక అంశాలపై చర్చించారు. దళితులు ఇక ఎప్పటికీ మరిచిపోకుండా చావు దెబ్బతియ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. మారణాయుధాల సేకరణ మొదలైంది. మర్నాడు ఉదయం
ఆ గ్రామంలో ఏం జరిగింది?

కారంచేడు కండకావరం: ఏబీకే ప్రసాద్…
క్షణ క్షణం కారంచేడు – Report రేపు…

– తాడి ప్రకాష్, 97045 41559

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author, Tadi Prakash . The facts and opinions appearing in the article do not reflect the views of  Ruralmedia and Ruralmedia  does not assume any responsibility or liability for the same

Share.

Leave A Reply