నిజామ్‌ల కాలంలో నిజమైన పారిశుద్ధ్యం-2

Google+ Pinterest LinkedIn Tumblr +

మానవ వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోతే మానవ జాతి మనుగడే ప్రశ్నార్దకం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వతమైన , పర్యావరణహిత పరిష్కారం చూపగలిగిన విధానమే ఉన్నతమైన సంస్కృతి. ఈ సత్యాన్ని గ్రహించి, నిజాం పాలకులు మానవ జీవన మెరుగుదలకు పారిశుద్ధ్య వ్యవస్థను ప్రపంచ దేశాలతో, సమాంతరంగా ఎలా అభివృద్ధి పరిచారో, ‘నిజాం పాలన, 
పారిశుద్ధ్య ప్రగతి’ పుస్తక రచయిత, పరిశోధకుడు, ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ చేసిన గాదె వెంకటేష్‌ రూరల్‌మీడియా ఎడిటర్‌ కి వివరించారు. 
  
హైదరాబాద్‌ మురుగునీటి వ్యవస్ధ ఏర్పాటు …
క్రీ.శ.1926లో హైదరాబాద్‌ మురుగునీటి విభాగం ఏర్పాటయింది. 1908 (1318 ఫాల్సీ) సం.లో సర్‌. వీ.హ. మొదట నగరాన్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించి రూ|| 52 లక్షలతో వరద నీటి నిర్వహణ చేపట్టాలని సూచించాడు. కానీ ఎ.డబ్ల్యు. స్టోన్‌ బ్రిడ్జ్‌ అనే అప్పటి సానిటరీ ఇంజినీరు మోక్షగుండం విశ్వేష్వరయ్య ఇచ్చిన ప్రణాళికలకు మెరుగులు దిద్ది , ఈ మొత్తం పట్టణానికి వరద నీరు, మురుగునీటి నిర్వహణ చేయాలంటే రూ. 1.63 కోట్లు అవసరమని నివేదికలు తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను మిస్టర్‌ ఎం.ఎ. జమాన్‌ (కీ.శే.నవాబ్‌ అశాన్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌)కి అప్పగించారు. జమాన్‌ ఇంకొంత మంది అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్‌ నిపుణుల సలహాలతో, సూచనలతో కొద్ది మార్పు చేర్పులతో ప్రణాళికలను పటిష్ట పరిచి కాల్వల నిర్మాణం పనులు ప్రారంభించారు. 
ఆనాటి మురుగునీటి శుద్ధి కేంద్రాలు 
కాలువల ద్వారా సేకరించిన మురుగునీటి శుద్ధి కోసం.. ‘ఆక్సిడేషన్‌ పాండ్‌ టెక్నాలజీ’తో 53 ఎమ్‌ఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా నిర్మించారు. నీటిని అంబర్‌పేట మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన నీటితో 1100 ఎకరాలకు సాగునీరు అందించేవారు. స్లడ్జ్‌ని శుద్ధి చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేశాడు. ఇదంతా 1937-1940 కాలంలోనే నిజాం తెలంగాణ ప్రజలకు అందించాడు. అంటే దేశంలో మొదటి 3-4 మురుగునీటి శుద్ధి కేంద్రాలలో హైదరాబాదు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) ఒకటి. ఇతర దేశాల వాళ్ళు సైతం మురుగు నీటి కాల్వల నిర్వహణ, శుద్ధి అధ్యయనం కోసం ఇక్కడికే వచ్చేవారు. ఇప్పటికీ వస్తున్నారు. 1950లో హైదరాబాద్‌ మురుగునీటి వ్యవస్థకి సికింద్రాబాద్‌ మరియు పరిశ్రమల నుండి వచ్చే మురుగునీటి కాలువలను 6 లక్షలు ఖర్చుపెట్టి అనుసంధానం చేశారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ – డిటైల్డ్‌ బడ్జెట్‌ ఫర్‌ ద ఇయర్‌ 1351 ఎఫ్‌ (1950 ఎ.డి)). ఆ తర్వాత అంబర్‌పేట మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా 3 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మురుగునీటి విభాగం ఏర్పాట్లు చేసింది. 
ఆసిఫ్‌నగర్‌, నారాయణగూడలలో అప్పటికే ప్రసిద్ధి గాంచిన మంచి నీటి శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఆసీఫ్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రం 100 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుండడం అప్పటి నిజాం రాజు నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యత ఏపాటిదో తెలుస్తుంది. 1915లో వరదనీరు వ్యవస్థను, 1922లో మురుగునీటి వ్యవస్థను, 1940లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) నిర్మించి ఆధునిక సాంకేతిక విప్లవానికి నిజాం నవాబులు జంట నగరాలలో నాంది పలికారు. 
ఇదీ పారిశుద్ధ్య కార్మికుల పరిస్దితి 
విచిత్రమైన ముచ్చట ఏందంటే, కనీస పారిశుద్ధ్య సదుపాయాలకు నోచుకోని 95శాతం పారిశుద్ధ్య కార్మికులు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలే. వీరే దేశాన్ని పరిశుభ్రపరిచే పనిలో వున్నారు. వీరే, ఎందుకు ఈ వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారో, ఇతర ఏ ఆధిపత్య కులాల వాళ్లు ఈ వృత్తుల్లో ఎందుకు కనిపించరో, తెలియాలంటే భారతదేశ చాతుర్‌వర్ణ వ్యవస్థలోకి వెళ్లాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాల కంటే ఎక్కువగాపారిశుద్ధ్య కార్మికుల, పారిశుద్ధ్య మెరుగుదల కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ అవి పారిశుద్ధ్య కార్మికులను ఒక వర్గంగా చూస్తాయే తప్ప, కుల సమూహం అని అంగీకరించడం లేదు. స్వచ్ఛభారత్‌ లాంటి కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ పనిభారం పెంచేవిగా తయారయ్యాయి కానీ, వారికి ఒక గౌరవప్రద స్థానం కల్పించేవిగా లేకపోవడం విచారకరం.  -shyammohan(9440595858)

Share.

Leave A Reply