ఏది పోరాటం? ఏది స్వార్థం? ఏది స్వతంత్రం?

Google+ Pinterest LinkedIn Tumblr +

చరిత్ర, పాలిటీ, ఎకానమీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులని “సోషల్ సైన్సెస్” గా గాక, “ఆర్టు” సబ్జెక్టులుగా చదువుకున్న వాళ్లకు సైన్సులాగానే సోషల్ సైన్సులోని ప్రతిపదాలకు నిర్దుష్ట నిర్వచనం వుంటుందని తెలియదు, అందుకే స్వతంత్ర వీరులను, విముక్తి ప్రదాతలను పుట్టించి పోరాటాలను, యుద్దాలను నడిపిస్తూంటారు. ఒక్కడంటే ఒక్క భారతీయుడు గతం గురించి చరిత్ర రాయకపోవడం ఒక వైపైతే, మరోవైపు ప్రతిఒక్కడూ కథలూ, కవిత్వాలూ పురాణాలుగా రాసిన గడ్డమీద, ఈ వారసత్వాన్ని తప్పుపట్టడం నిజానికి తప్పే.

ప్రజలను దోచుకోవడం కోసం యుద్దాలు చేసేవాడు వీరుడు కాజాలడు, దోపిడీదారు అవుతాడు, దొంగ అవుతాడు. జనాన్ని దోచుకోవడంకోసం ఇద్దరు పోటీపడితే అది పోరాటం అవదు దోచుకోవడంకోసం జరిగే దొమ్మీ అవుతుంది. ఇటుపక్క పాలెగాడైనా, అటుపక్క తెల్లదొరైనా ఇద్దరూ ప్రజలమీద పడి పన్నులు లాగి వైభోగాలు అనుభవించడానికే. సామాన్య జనానికి ఒరిగేదేమీ వుండదు. అయితే మన వెర్రితనం ఏమంటే, మన మతమోడు, మన ప్రాంతంవాడు ఈదోపిడి చేస్తేనే బాగుందనిపిస్తుంది. ఈ దుస్థితే పోవాలంటాడు భగత్ సింగ్. ఈ దొమ్మీలు పెద్ద స్థాయిలో జరిగితే అవి యుద్దాలు అవుతాయి, దేశాలు ఇరువైపులా నిలబడి చేసుకునే యుద్దాలే ప్రపంచ యుద్దాలవుతాయి.

ఒక వ్యక్తి తన కష్టం తాను అనుభవించడానికి లేదా దోపిడీనుండి కాపాడుకోవడానికి చేసేది పోరాటం అనిపించుకుంటుంది. ఆ మాటకోస్తే భూమ్మీద చీమ నుండి మనిషి దాకా జరిపేది పోరాటమే. అది మనుగడకోసం పోరాటం అనికూడా పిలిపించుకుంటుంది. దోపిడీనుండి, పీడననుండి విముక్తికోసం చేసే పోరాటం స్వతంత్రం కోసం పోరాటం అనిపించుకుంటుంది. వారి నాయకుడు స్వతంత్ర సమరయోధుడు అవుతాడు, విముక్త ప్రదాత అవుతాడు. అంటే స్పార్టకస్, లెనిన్, కాస్ట్రో వంటివారు. వీరినే యోధులని కూడా పిలవొచ్చు. నిజానికి ఇంగ్లిష్ పదజాలంలో ఈ పదాలపట్ల స్పష్టత వుంటుందని గుర్తించాలి. (వివరాలకోసం హాబ్స్ బామ్ లాంటి వారిని చదవొచ్చు. అతడురాసిన “ది ఏజ్ ఆఫ్ రెవల్యూషన్” అనే పుస్తకం త్వరలో పరిచయం చేస్తాను)

రేపు టిప్పుసుల్తాన్ నుండి, సమరసింహారెడ్డి మీదుగా 1857 తిరుగుబాటు వరకూ మాట్లాడుకుందాం! ఏది పితూరీ, ఏది తిరుగుబాటు, ఏది యుద్దం, ఏది పోరాటం? ఏది స్వార్థం? ఏది స్వతంత్రం? అసలు ఎవరెందుకు తెగించారు? ఎందాక నిలబడ్డారు? ఏ భవిషత్తుని స్వప్నించారు?.. అనేది సంక్షిప్తంగా చదువుకుని నిర్ణయించుకుందాం! – – Siddharthi Subhas Chandra bose

Share.

Leave A Reply