అక్కడ ఆవులున్నాయి కానీ, పాలు తీయరు, ఎందుకు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

అరణ్య స్పర్శ-3:

( AranyaKrishna ) చుట్టురా ఆకుపచ్చని కొండల మధ్య ఓ ఇరవై ఎనిమిదిళ్ళతో గువ్వలా ఒదిగున్న గిరిజన గ్రామం పెదకొండ. ప్రతి ఇంటికీ వెదురు కర్రలతో ఒక దడి వుంది. ఆ దడి అలా ఒక ఇంటి నుండి మరో ఇంటికీ కొనసాగి అదో గేటెడ్ కమ్యూనిటీలా వుంది. ఒక్కో వైపు ఒక్కో ఓపెనింగ్ వుంది. ఆ గ్రామంలోకి అడుగు పెడుతుండగానే మొదట్లోనే ఒక మేకల దొడ్డి. గ్రామంలోకి ప్రవేశించాక మా మీద గ్రామస్థులు ఏదో ఒక చూపు అలా విసిరి వెళ్ళిపోవటం, తమ పనులు తాము చేసుకుపోవటమో తప్ప మమ్మల్ని ఎగాదిగా చూడటం కానీ, ఏవో ప్రశ్నలు వేయటం కానీ చేయలేదు. నాగరీక సమాజం నుండి భౌతికంగా అంతెత్తు కొండల మధ్య జీవిస్తున్న వారి ప్రవర్తన స్థాయికి ముచ్చటేసింది. కొన్ని ఇళ్ళ ఆవరణల్లోకి వెళ్ళినా వాళ్ళేమి పట్టించుకోలేదు. మేం నవ్వితే చిర్నవ్వారు. ఏదైనా అడిగితే తమ పనులు చేసుకుంటూనే జవాబులు చెప్పారు. ఎక్కడో ఒకటో రెండో తప్ప ఇళ్ళన్నీ పక్కా ఇళ్ళే. కానీ దాదాపు ప్రతి ఇంటికి తాటాకుల సదుపాయాన్ని వాడుకున్నారు.

Aranya Krishna

భూమిలో నిలువుగా పాతిన కర్రలే వాళ్ళకి గిన్నెల స్టాండు. సహజ సిద్ధమైన పెద్ద పెద్ద బండలతో, రుబ్బురోళ్ళు, పచ్చడి నూరుకునే రాయి…ఇలా వాళ్ళ ఇంటి పెరళ్ళు చాలా విశాలంగా బాగున్నాయి. (వీడియో పెట్టాను. చూడండి.) స్త్రీలు నైటీలు వేసుకున్నారు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ రాదు. కానీ డిటీహెచ్ యాంటెన్నాలు మాత్రం ఇళ్ళ పైన కనిపించాయి. కొండ కిందకి కచ్చా రోడ్డు కూడా వుంది. దాని మీదుగా మోటార్ సైకిళ్ళు కూడా ఈ గ్రామంలోకి వస్తున్నాయి. ఈ గిరిపుత్రులు నాగరీక సమాజానికి దూరంగా వున్నారే కానీ నాగరికతకు కాదు. ఈ చిన్న గ్రామంలో కూడా రక్షిత మంచినీటి స్టోరేజి టాంకుంది. నేను గతంలో విశాఖ జిల్లాలోని అరకు, చింతపల్లి, పాడేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, పెదబయలు వంటి మండలాల్లో విస్తృతంగా తిరిగాను. మూలమూలకు వెళ్ళాను. అక్కడి ఆదివాసీలకి వీరికి మధ్య చాలా వ్యత్యాసముంది. వారిలో ఎక్కువగా పి.టి.జి. (ఆదిమ గిరిజన జాతులు)లు వున్నారు. వారితో పోలిస్తే వీరు చాలా అభివృద్ధి చెందారు. అక్కడి వారు మనం కనబడితే కొద్దిగా భయపడతారు. వీళ్ళకి అసలు మనమంటే పట్టింపే లేదు. అక్కడ చదువు తక్కువ. ఇక్కడ వీళ్ళు పిల్లల్ని రంపచోడవరంలోని బంధువుల ఇంట్లో వుంచి చదివిస్తున్నారు. వీళ్ళ యాస కూడా మైదాన యాసకి దగ్గరగా వుంది. అటవీ ఉత్పత్తుల మీద, వ్యవసాయం మీద ఆధారపడతారు వీళ్ళు. పశుపోషణ కూడా చేస్తారు. ఆవులున్నాయి. కానీ పాలు తీయరు. ఎందుకు తీయరంటే పాలు దూడ కోసం వదిలేస్తారు. మరి ఆవులెందుకు పెంచటమంటే వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు జత కోసం. అలాగని వాళ్ళేం ఆవుల పట్ల భక్తి భావంతో ఉంటారని అనుకోవద్దు. బీఫ్ వారి ప్రధాన మాంసాహారం. కేవలం దూడల పొట్ట కొట్టడం తప్పనే ఒక్క మానవీయ భావన వల్లనే వారు పాలు తీయరంతే. వేటకి వెళుతుంటారు. చిన్న చిన్న జంతువులని కొట్టుకొస్తుంటారు. జీలుగు కల్లు బాగా తాగుతారు.

సరే మేం ఆ రాత్రికి ఎక్కడుండాలి అనేది సమస్య. సాయంత్రం 5 గంటలకే వెలుతురు తగ్గిపోతున్నది. అంత చిన్న గ్రామంలో పంచాయతి ఆఫీసు లేదా కమ్యూనిటి హాలు వంటివి లేవు. బాపిరాజు కాసేపు అటూ ఇటూ తిరిగొచ్చి మకాం ఏర్పాటు చేసానన్నాడు. ఒక కుటుంబమేదో ఊరికెళ్ళిందట. వారి వసారాలో మనం మేను వాల్చొచ్చన్నాడా అబ్బాయి. పిల్లలు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. నాకో ముగ్గురు పసివాళ్ళు దొరికారు. మంచి కాలక్షేపమైంది. ఆరు గంటలకే చిమ్మ చీకటి. బాపిరాజు, లోహితాక్షన్, జయతిలు కార్యరంగంలోకి దిగి టీ పెట్టడం, బ్రహ్మాండమైన పొంగలి తయారు చేసారు. సుమారు ఎనిమిది గంటల సమయంలో జీలుగు కల్లు వచ్చి అందర్నీ పులకితుల్ని చేసింది. రుచి చూసాను. పుల్లగా బాగుందనిపించింది. మద్యపానంలో ఇప్పటి వరకు నాకు బీరులో ప్రవేశముంది. జీలుగు కల్లు అంతకంటే బాగుంది. ఇంకేముంది ఓ నాలుగైదు గ్లాసులు కడుపులోకి చల్లగా పోసి, ఆ శీతాకాలపు కొండ మీది చల్లటి వాతావరణంలో చాలాకాలం తర్వాత ఓ రెండు దమ్ముల సిగరెట్టు కొడితే బ్రహ్మాండంగా అనిపించింది. లోహితాక్షన్, జయతిలు మంచి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసారు. ఆ వసారాలోని అరుగు మీదనే టెంట్లు వేసుకొని పడుకున్నాం. అందరూ తెల్లవారు జాము నాలుగున్నరకే లేచి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. నేను మాత్రం యథావిధిగా ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకే :] నిద్ర లేచి టెంటులోంచి బైటికొచ్చాను.

Share.

Leave A Reply