యండమూరి దొంగ, నిండు కుండ, తొణకడు…

Google+ Pinterest LinkedIn Tumblr +

నాకంత ఖర్మ పట్టలేదు: యండమూరి

The Game called plagiarism – part 4
———————————————————

అది 1994-95వ సంవత్సరం. సికింద్రాబాద్, ఆంధ్రభూమి దినపత్రికలో పని చేస్తున్నా. సి.కనకాంబర రాజు (సికరాజు) సంపాదకుడు. వీక్లీకీ ఆయనే. మద్యనిషేధం సమస్య మీద పది పన్నెండు లైన్ల వ్యాఖ్య రాశాను. విషయాన్ని హైలైట్ చేయడం కోసం వార్తకు ముందు పెద్దక్షరాలతో కామెంటు పెడతాం. దీన్ని lead అంటాం. అలా సొంత కవిత్వం వెలగబెట్టినపుడు, పైగా మొదటి పేజీలో ప్రామినెంట్ గా flash చేస్తున్నపుడు దానికి ఎడిటర్ అనుమతి ఉండాలి. పై ఫ్లోరులో వుండే సికరాజుగారికి రాసిన కాయితాన్ని ఓ కుర్రాడితో పంపాను. కొద్దిసేపటికే ఆ కాయితం పట్టుకుని సికరాజు కిందికి వచ్చారు.

‘‘మీరే రాశారుగా’’ అన్నారు. ‘‘మామూలుగా లేదిది. అద్భుతంగా రాశారు. రండి… మనం బయటకు వెళ్దాం’’ అన్నారు. సాయంత్రం ఆరున్నర దాటింది. అది దిన పత్రికల ఆఫీసుల్లో సీరియస్ వర్క్ జరిగే సమయం. ‘‘చాలా పనుంది’’ అన్నాను. ఎవరికైనా అప్పచెప్పండన్నారు. సికరాజు కారులో ఇంటికి తీసుకెళ్లారు. దారిలోనే యండమూరి గారికి ఫోన్ చేసి రమ్మన్నారు. సికరాజు యింట్లో ఒక కాలక్షేపం పార్టీ.

‘‘తెలుసా, ఈయన ప్రకాష్. మీ అంత బాగా రాయగలడు. మీకంటే బాగా రాస్తాడు కూడా’’ అని వీరేంద్రనాధ్ కి పరిచయం చేశారు. చాలా ఎంబ్రాసింగ్ గా ఫీలయ్యాను. అప్పటికే ప్రసిద్ధ రచయితగా ఒక వెలుగు వెలుగుతున్న యండమూరి హ్యాపీగా నవ్వి నాకు షేక్ హ్యాండ్ యిచ్చారు. చక్కని కబుర్లు చెప్పారు. నేనూ మాట్లాడాను. ‘‘మీరు కమ్యునిస్టా’’ అని అడిగారు. ‘‘కొంచెం ఆ టైపే’’ అని చెప్పాను. జోకులతో, మంచి బిర్యానీతో పార్టీ ముగిసింది.

నేనేం రాసినా సికరాజు ఇష్టపడేవాడు.

‘‘ఇంతకాలం ఏమైపోయారండి’’ అనేవాడు.

సికరాజుకి వీక్లీ అంటే చచ్చేంత ప్రేమ.

ఆయనికి డైలీ జర్నలిజం పెద్దగా తెలియదు.

*** *** ***

యద్ధనపూడి సులోచనా రాణి నవలల తమిళ అనువాదాలపై మాట్లాడటానికి రెండు వేల సంవత్సరం మార్చిలో యండమూరి ఇంటికి వెళ్లాను. ఆయనెంతో ఈజీగా హాయిగా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే యండమూరి కుమారునికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. 20-22 ఏళ్ల కుర్రాడికి అది ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం. అప్పట్లో విజయ విహారంలో గెలుపు కెరటాలు అనే శీర్షిక ఉండేది. సంపాదకుడు రమణ మూర్తి గారికి ఆ ఫీచర్ అంటే ఎంతో యిష్టం. యంగ్ ఎచీవర్స్ అని రాయడం కోసం యండమూరి కొడుకుని ఇంటర్వ్యూ చేశాను. పబ్లిష్ అయింది. ఆ అబ్బాయి పేరు మర్చిపోయాను.

చౌర్యం గొడవ మీద యండమూరి ఇంటర్వ్యూ
2000 ఏప్రిల్ సంచికలో వచ్చింది.

విజయ విహారంలో నేను రాసింది… ఇక్కడ ఇస్తున్నాను, ఒక్క అక్షరం కూడా మార్చకుండా. చదవండి.

*** *** ***

యండమూరి వీరేంద్రనాథ్
అది పేరుకాదు.
పేలుడు పదార్థం.

ఒక్క పేలుడు చాలు పుస్తకం లక్షల ప్రతులు అమ్ముడుపోడానికి,ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజలకి కథల కనికట్టు, నవలల మాయాజాలం, నాటికల చేతబడి చేసినవాడు. డైలాగులు, స్క్రీన్ ప్లేలతో సినిమాల్ని హిట్లు కొట్టించినవాడు. 20 సంవత్సరాలపాటు, ‘అతను ఏంరాస్తే అది చదువుతారు’ అనే స్థాయికి ఎదిగి, లక్షలాది పాఠకుల ఆరాధ్యదైవంగా
నిలిచిన వాడు వీరేంద్రనాథ్.

సంప్రదాయక మధ్యతరగతి ప్రేమల, నునుసిగ్గుల, పట్టు పరికిణీల, వెర్రి ఆరాధనల, కరుణరసాల కన్నీటి ఎదురుతెన్నుల కథలు పాతబడిపోతున్న వేళ..
…మారుతున్న కాలపు కెమిస్ట్రీని ఖచ్చితంగా ఒడిసి పట్టుకున్న టెక్నిక్, అక్షరాల్లో సూపర్ సానిక్‌ స్పీడు, గుండెలు కొట్టుకులాడే, నరాలు బిగిసి తెగిపోయే మలుపుల, సస్పెన్సుల, భయాల బ్లడ్ ప్రెషర్ పెరిగి పెరిగి కట్టలు తెగి కెరటాలై ఎగిరి రాళ్ళకి గుద్దుకుని విరిగి పడేంత ఉక్కిరి బిక్కిరి… – అది వెన్నెల్లో ఆడపిల్ల, తులసి, తులసీదళం, ఛాలెంజ్, కాష్మోరా, నల్లంచు తెల్లచీర, ఆనందో బ్రహ్మ – ప్రేమో, క్షుద్రవిద్యో పందెమో, అల్లరో ఆకతాయితనమో… ఏ రాగమైనా ఆ మహత్తర తెలుగువాక్యవిన్యాసం పాఠకజన హృదయాన్ని గమ్మత్తుగా చుట్టుకునేది! వెర్రెత్తించే శైలి. తెరిస్తే ముగిసే దాకా పుస్తకం కింద పెట్టనివ్వని బిగువు, కథనాశ్వంపై అక్షరమాంత్రికుని
అద్భుతస్వారీ…. ఇక్కడ యండమూరి అజేయుడు.

పారితోషిక ప్రాణి అయిన నీరసపు మధ్యతరగతి రచయితకీ గ్లామర్ అద్ది, అతన్నీ హీరోని చేసి, తొలి తెలుగు మెగా రైటర్‌గా స్టార్ డం సాధించిన వాడు యండమూరి వీరేంద్రనాథ్. .
తమిళంలోకి తెలుగు నవలల అనువాద చౌర్యం గురించి “విజయవిహారం’ ప్రతినిధి తాడి ప్ర‌కాశ్‌తో హాయిగా నవ్వుతూ ఓపిగ్గా, వివరంగా మాట్లాడారు. యండమూరితో ఇంటర్యూ యిలా సాగింది.

ప్ర‌కాశ్‌: తమిళ అనువాదాలకు మీ అనుమతి వుందా? మీ పుస్తకాలకూ, ఇతరుల రచనలకూ?

యండమూరి : 1986లో సుశీల కనకదుర్గ అనే ఆమె నాదగ్గర కొచ్చింది. నాపుస్తకాలు తమిళంలోకి అనువాదం చేస్తానంది. చేసుకోవచ్చని ఒక జనరల్ పర్మిషన్ కాగితం యిచ్చాను. అంటే ఏదైనా నవల ఆమె అనువదించి ప్రచురించే ముందు, పారితోషికం ఎంత అనే దానిపై మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, ఆ తర్వాత మళ్ళీ ఆరేళ్ళదాకా ఆమె నాకు కనిపించలేదు.

1991 నాటికి నావి 30 నవలలు తమిళంలో వచ్చాయని తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రత్యేకించి యండమూరి సీరియల్ ప్రారంభించబోయే ముందు అక్కడి పత్రికల వారు వాల్ పోస్టర్లు వేస్తారని తెలిసి ఆశ్చర్యం కలిగింది. కనకదుర్గని కలిసి యిదేమిటని నిలదీస్తే తనది తప్పని అంగీకరించింది. 1996 లో నేను మద్రాసు వెళ్ళాను. ‘కుంకుమం’ వారపత్రిక ఎడిటర్, ఇంటర్ వ్యూ కోసం ఫోన్ చేశారు. ఆ వీక్లీ సర్క్యులేషన్ రెండు లక్షల పైనే… ఆనంద పడ్డాను.

‘మీ సీరియల్ గురించి ఏమనుకుంటున్నారు?’ అని సంపాదకుడు అడిగాడు. నాకు ఆశ్చర్యం.

మీ పత్రికలో నా సీరియల్ ఏమిటీ? అనడిగాను.

మాకు ‘జనరల్ పర్మిషన్’ వుందన్నారు. నేను వెంటనే ఆపమని చెప్పాను. అప్పటికే నావి 50 పుస్తకాలు తర్జుమా అయ్యాయని తెలిసింది. పబ్లిషర్లకు నోటీసు పంపాను, మేం మీనవలల ప్రచురణ మానేస్తున్నాం. క్షమాపణ వేడుకుంటున్నాం’ అని చెప్పారు.

1999 లో ‘హిందూ’ దినపత్రికలో ఒక 800 పేజీల పుస్తకం సమీక్ష వచ్చింది. ఇంత బోరుగా ఆ పుస్తకాన్ని యండమూరి ఎందుకు రాసినట్టో అని కామెంట్ వుంది. అది ’92లో వచ్చిన పుస్తకం, సులోచ‌నా రాణి రాసిన `జీవ‌న‌త‌రంగాలు` కావ‌చ్చు. అదీ సుశీలా క‌న‌క‌దుర్గ అనువ‌దించిందే! వెంట‌నే యద్ద‌న‌పూడి గారికి ఫోన్ చేసి చెప్పాను. క‌న‌క‌దుర్గ అడ్ర‌స్ ఇచ్చాను. సులోచ‌నారాణి గారు వెళ్లారు. అయితే క‌న‌క‌దుర్గ యిల్లు మారిపోయింద‌ని తెలిసి వూరుకున్నారు. యండ‌మూరి వీరేంద్రనాథ్ అనే brand nameతో త‌మిళంలో పుస్త‌కాలు అమ్ముకున్నారు.

ప్ర‌కాశ్: సుశీలా క‌న‌క‌దుర్గ ఎవ‌రు?

యండ‌మూరి: ఆమె అధికార భాషా విభాగంలో ట్రాన్స్‌లేట‌ర్ ఉద్యోగం చేసేది. ఆమెకి పుట్టుచెవుడు. హైద‌రాబాద్‌లోనే వుండేది.

ప్రకాశ్‌: య‌ద్ద‌న‌పూడికి మీ ద్వారా రెమ్యూన‌రేష‌న్ ఎప్పుడైనా అందిందా?

యండమూరి : 1994లో ‘జ్యోతి’ వీక్లీలో ప్రేమ’ అంశంమీద యద్దనపూడి, నేను, వెన్నెలకంటి వసంతసేన మూడు న‌వ‌ల‌లు రాశాం. క‌న్న‌డ‌లో బాగా పాపుల‌ర్ అయిన `త‌రంగ‌` వార‌ప‌త్రిక‌లో నేను, సులోచ‌నారాణి రాసిన రెండు న‌వ‌ల‌లూ వ‌చ్చాయి. అపుడు య‌ద్ద‌నపూడికి రూ.2000 పారితోషికం పంపించాము.

ప్ర‌కాశ్: ఇప్పుడు మీ పుస్తకాలేమన్నా అనువాదం అవుతున్నాయా?

యండమూరి : గౌరి అనే ఆమె ట్రాన్స్ లేట్ చేస్తోంది. నవలకి వెయ్యో, పదిహేనొందలో యిస్తారు. అంతే. తమిళ అనువాదాలవల్ల నాకు మూడు లక్షల రూపాయలు ముట్టినట్టు ఒక పేపర్లో పొరపాటుగా రాశారు. నిజానికి అది కన్నడ నవలల మీద వచ్చిన డబ్బు.

ప్ర‌కాశ్‌: పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు?

యండమూరి : కొమ్మనాపల్లి, సూర్యదేవరల నవలలు అనువాదం చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా అయితే షిడ్నీ షెల్డన్ నవలనే తమిళంలోకి చేసే వాణ్ణి. అట్టమీద ఒరిజినల్ : మిడ్నీ షెల్డన్, అనువాదం : యండమూరి అని వేసుకుంటే ఇంకా మంచి మార్కెట్ వుంటుంది. నేను ట్రాన్స్‌లేట్ చేస్తానంటే అనేక మంది రచయితలు నాకు నవలలు యిస్తారు. అయిదొందలో వెయ్యో యిస్తే మహదానందంగా అనువదించుకో మంటారు. యండమూరి బాగా పాపులర్ గనక వాళ్ళే నా నవలల్ని తర్జుమా చేయించుకుని నా పేరు వాడుకున్నారని నేనూ ఆరోపణ చెయ్యొచ్చు.

నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలాతేలిక.

ప్ర‌కాశ్‌ : మీ పాయింట్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు?

యండమూరి : పొరపాటు జరిగిందంటూ తమిళ పబ్లిషర్లు రాసిన ఉత్తరాలున్నాయి. 1996లోనే ‘ఈనాడు’ లో నాపత్రికా ప్రకటన వచ్చింది. ‘యండమూరి పేరుమీద విస్తృతంగా నవలలు’ అనేది ఆ వార్తా శీర్షిక. అనుమతి లేకుండా నా నవలలు తమిళంలోకి తర్జుమా అవుతున్నాయనీ, తమిళ పబ్లిషర్లు ఆ అక్రమ వ్యవహారాలు మానుకోవాలనీ అందులో స్పష్టం చేశాను. ’96 లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సుశీలా కనకదుర్గ పై మిస్ రిప్రజెంటేషన్, చీటింగ్ అని కేసు పెట్టాను. పబ్లిషర్లకు రిజిష్టరు నోటీసులు పంపించాను.
ఉదాహరణకి, నాకారు ఎవరో దొంగిలిస్తారు. వాళ్ళు యాక్సిడెంట్ చేయడంవల్ల ఒకవ్యక్తి చనిపోతాడు. దానికి నన్ను బాధ్యుణ్ణి చేస్తే ఎలాగ?

ప్ర‌కాశ్‌ : సమస్యకి పరిష్కారం ఏమిటి?

యండమూరి : ఇదంతా పెద్ద సమస్యకాదు. ఏడెనిమిది మంది తమిళ పబ్లిషర్లు నవలలు ప్రచురించారు. వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారో, డబ్బెవరికిచ్చారో కనుక్కుంటే తెలిసిపోతుందిగా!

టీవీ సీరియల్ వచ్చిందంటున్నారు. ఆ ఛానల్ మీద పరువు నష్టం దావా వెయ్యమనండి. వాళ్ళు డబ్బు ఎవరికిచ్చారో కనుక్కోమనండి.

ప్ర‌కాశ్‌ : ఆ మొత్తం వ్యవహారం వల్ల మీకు కలిగే యిబ్బంది!

యండమూరి : నాకొచ్చే bad ఏమీలేదు! అంత పెద్ద వ్యవహారం కాదిది. ఒక సాయంత్రంపూట కాక్ టెయిల్ పార్టీలో డిస్కషన్ గా మాత్రమే పనికి వస్తుందనుకుంటాను. మరి మాకెందుకు ఇంటర్ వ్యూ యిచ్చి యింత వివరంగా మాట్లాడుతున్నారు? అని మీరు అనొచ్చు. నేనిపుడు దృష్టంతా వ్యక్తిత్వ వికాసంపైనే పెడుతున్నాను. ‘విజయవిహారం’ వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం యిస్తున్నందువల్ల నేను మీకిదంతా వివరంగా చెబుతున్నాను.

ప్ర‌కాశ్‌ : Out of the court settlement సాధ్యపడుతుందా?

యండమూరి : చాలా ఈజీగా. సెటిల్ మెంట్ వీలవుతుంది. కనకదుర్గ కనబడితే. అయితే వాళ్ళు (యద్దనపూడి, కొమ్మనావల్లి సూర్యదేవర) డబ్బు అడుగుతున్నారా? ఎంత కావాలంటున్నారు? అనేది స్పష్టంకావాలిగా ముందు!

ప్ర‌కాశ్‌ : య‌ద్దనపూడి Hurt అయినట్టున్నారు…..

యండమూరి : ఆమె ‘సెక్రటరీ’ నవల చదివినప్పుడు నేనామె ఫాన్ని. నాకు తెలియ కుండా 30కి పైగా నా నవలలు తమిళంలో పబ్లిష్ అయిపోయాయని తెలిసి Burn ఆయిపోయాను. ఎవరికన్నా ఆ బాధ వుంటుంది, మన వస్తువు ఇంకొకరు వాడేసుకుంటే బాధేకదా! నన్ను ‘గురువు’ అన్నవాళ్ళు నాకో ఫోన్ చేసి వుంటే చెప్పేవాణ్ణి. ఆ గొడవ, ప్రెస్ మీట్లు వ్యవహారం చూస్తుంటే ఆ మేటర్ సమసిపోవడం వాళ్ళకి యిష్టం లేదని పిస్తోంది.

ప్ర‌కాశ్‌ : మీ పొరపాటేమీ లేదంటారా?

యండమూరి : నూటికి నూరుశాతం నా పొరపాటేమీలేదు.
నేను కొమ్మనాపల్లిని చూసి తొమ్మిదేళ్ళ యింది. సూర్యదేవర రామ్మోహన రావుని చూసి ఎనిమిదేళ్ళయింది. మధ్యలో ఒక ఫంక్షన్లో అయిదు నిముషాలు కలిశాం. అంతే! వాళ్లనవలల పారితోషికం సొమ్ము నేను తీసుకున్నానని వాళ్ళే నిరూపించాలి.

ప్ర‌కాశ్‌ : రెమ్యూనరేషన్స్ ఎలా వుంటాయి?

యండమూరి : తమిళంలో బాగా తక్కువ. ఒక నవలని మహా అయితే మూడువేల కాపీలు వేస్తారు. మూడువేల రూపాయల పారితోషికం యిస్తారు. నాలుగైదు వందల పేజీల నవల అనువదించి యిస్తే మూడువేల పారితోషికం ఏపాటి? అసలు, సుశీలా కనకదుర్గ గనక నన్ను కలిసి అడిగితే ‘ ఆనందంగా ఆ చిన్నపాటి రెమ్యునరేషన్ వదులుకునే వాణ్ణి.

ప్ర‌కాశ్‌ : సుశీలా కనకదుర్గ యితరుల నవలలు అనువదించి పబ్లిషర్ల కు యివ్వడంలో మీ పాత్రేమీ లేదంటారు!

యండమూరి : నేను కర్నాటకలో కూడా చాలా పాపులర్ రచయితని. తమిళంలో ఆపని చేసివున్న వాణ్ణయితే, కన్నడంలోనూ వాళ్ళ నవలలు అనువదించే ఏర్పాటుచేసే వాళ్లేగా! అయినా, ఏ మాత్రం తెలివివున్న వాడైనా యింత బయటపడే నేరం చేస్తాడా?

ప్ర‌కాశ్‌ : మరి మీపై ఆరోపణలు చేస్తున్న వాళ్లది ‘ఐడెంటిటీ క్రైసిస్’ అంటారా?

యండమూరి : ఏమో, వాళ్ళకే తెలియాలి!
Burden of proof lies with them only

*** *** ***

టెయిల్ ట్విస్ట్: ఎన్నో మలుపులు తిరిగిన తమిళ కథ అట్నుంచటు కంచికే చేరింది. తమిళనాట ప్రసిద్ధ రచయితగా పేరొందిన యండమూరి లోలోపల చిన్నగా నవ్వుకున్నాడు.

కథా నాయకి సుశీలా కనకదుర్గ ఎవరికీ కనిపించలేదు.

అదిగో బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక మెరుస్తోంది… లోగుట్టు ఆ తల్లికే తెలుసు.

యండమూరి దొంగ… నిండు కుండ…
తొణకడు.

*** *** ***

చివరి మాట: నా డిఫెన్స్ లాయర్ మహాకవి శ్రీశ్రీ ఒకసారి ఇలా అన్నారు.

వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు
వారి వారి సొంతం
పబ్లీకున నిలబడితే
ఏమైనా అంటాం
టాం… టాం… టాం…

– తాడి ప్రకాష్, 97045 41559

Share.

Leave A Reply