కేరళ మోడల్ ఆఫ్ కన్టెయిన్మెంట్!

Google+ Pinterest LinkedIn Tumblr +

( ‘ నిన్న ఆంధ్రా, కేరళలో కరోనాపై పోరాటం ప్రత్యక్షంగా చూసాను. ఈ కేరళ మోడల్ అని చెప్పే ఈ కరోనా కట్టడి మిగిలిన రాష్ట్రాలకు ఓ ఫాంటసీగా మాత్రమే మిగిలిపోతుంది. నేను లోతుగా చూసింది ఆంధ్రప్రదేశ్, కేరళలల్లో మాత్రమే కాబట్టి వేరే రాష్ట్రాల గురించి చెప్పను. నాకు నా రాష్ట్రం గురించి తక్కువగా రాయడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఈ పోస్టు పెట్టకూడదనుకున్నా కానీ ఇవాళ జరిగిన ఘటనతో పోస్టు పెట్టకుండా ఆగలేకపోతున్నా!…’ అని కేరళ లో తన అనుభవాలు వివరిస్తున్నారు. FaceBook వాల్ పై సుదర్శన్ గారు. చదవండి.)

రెండు రాష్ట్రాల్లో నా అనుభవాన్ని డొంకతిరుగుడు లేకుండా సూటిగా రాస్తాను.

22వ తారీఖు మధ్యాహ్నం 1-4 మధ్యలో కేరళ చెక్పోస్ట్ దగ్గర రిపోర్ట్ చెయ్యడానికి కేరళ ప్రభుత్వం నుండి అనుమతి వచ్చింది. 18వ తారీఖు మా జిల్లా SP ఆఫీసుకు ట్రావెల్ పాస్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా. వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ నెంబరుకి, వాళ్ళ మెయిల్ ఐడి కి పూర్తి వివరాలతో, డాక్యుమెంట్లు ఫోటోలతో అర్జీ పెట్టుకున్నా. ఇవాళ 23, ఇంత వరకు వాట్సాప్ మెసేజ్ వాళ్ళు చూళ్ళేదు. మెయిల్ కు జవాబు లేదు. అనుమతి ఇవ్వక్కర్లేదు, రిజెక్ట్ చేసుండొచ్చు, కానీ అదికూడా లేదు అంటే స్పందన లేదు. 20వ తారీఖు నేరుగా వెళ్లి వాకబు చేస్తే, డైరెక్టుగా రాకూడదు మెయిల్, వాట్సాప్ ద్వారా మాత్రమే అప్లై చెయ్యాలి అన్నారు. శుభం!

కేరళ, తమిళనాడుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడాను, ఆంధ్ర పోలీసుల నుండి రెస్పాన్స్ లేదు మరెలా అని. కేరళ పాస్ లో మీరు బయలుదేరే అడ్రస్, కేరళలో చేరే అడ్రస్, పైన ఇంటర్ స్టేట్ పర్మిట్ అని రాసిఉంది కాబట్టి మీరు మారాష్ట్రంలో ప్రవేశించడానికి, మాకు ఆంధ్రా పోలీసుల డాక్యుమెంట్లు అవసరం లేదు అన్నారు. తమిళనాడులో కూడా ఇదే అన్నారు. మీరు ఆంధ్రా నుండి బయలుదేరి కేరళ వెళుతున్నారు మాకు మారాష్ట్రం(తమిళనాడు) మీకు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా మేము ఆపము అన్నారు. కానీ మమ్మల్ని వదిలేసి వెనక్కు వెళ్ళేటప్పుడు ఆంధ్ర బోర్డర్లో దాదాపు 3 గంటల సేపు బండి లోనికి వెళ్ళనివ్వలేదు బయలుదేరేముందు ఆంధ్రా పెర్మిషన్ తీసుకోలేదని! ఆంధ్రా నుండి బయటకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ లేనిదే ఎలావెళతారు అని ఆపలేదు. తిరిగివచ్చేటప్పుడు మాత్రమే ఆపారు. ఎందుకో మన అందరికీ తెలుసు!

ఇప్పుడు నా ప్రయాణం అనుభవాలు. తమిళనాడు బోర్డర్లో డాక్యుమెంట్లు చెక్ చేశారు. తర్వాత నేను పాస్ అయిన 7 జిల్లాల్లోనూ చెక్ చేశారు. కేరళ పాస్ చూపించగానే ఒక్క ప్రశ్నకూడా వేయకుండా కేవలం వివరాలు రాసుకుంటూ పంపేశారు.

కేరళ బోర్డర్లో ఎంటర్ అవగానే 18 కౌంటర్లతో ఓ పెద్ద చెక్ పోస్టు లోనికి మా కార్ పంపారు. ద్విచక్రవాహనాల్లో వచ్చేవాళ్లకు అనుమతి లేదు. కౌంటర్ల వద్ద పగడ్బంధీగా 3 అడుగుల దూరం పాటిస్తూ నిలబడ్డాం. ఒక్కొక్కరినీ పిలిచి అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధుల వివరాలు ప్రత్యేకంగా నోట్ చేశారు. పర్మిట్ నెంబరు ద్వారా పర్మిట్లో ఉన్నవాళ్ల పేర్లు వివరాలు చెక్ చేసి, ఆరోగ్యంగా ఉన్నవాళ్లను మళ్లీ ఓసారి పోలీస్ చెకప్ చేసి కారుకు పోలీస్ స్తికర్ వేసి అనుమతించారు. 30 సెకన్లలో మా అందరి నెంబర్లకు మాకు టెస్టులు నిర్వహించినట్టు దృవీకరిస్తూ sms వచ్చింది. పాలక్కాడ్ జిల్లా దాటి త్రిచూర్ జిల్లా సరిహద్దుల్లో మళ్లీ కార్ ఆపి అన్ని వివరాలు నమోదు చేసుకొని, మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకో 4 గంటల్లో డ్రైవర్ తిరిగి వెళ్లిపోవాలని సూచిస్తూ ఓ స్లిప్ ఇచ్చారు. డ్రైవర్ తిరిగి వెళ్ళేటప్పుడు కేరళ బోర్డర్లో అన్ని వివరాలు సేకరించి 3 గంటల తర్వాత డ్రైవర్ లొకేషన్ కనుక్కుని చెప్పమని మాకు ఫోన్ వచ్చింది. డ్రైవర్ కేరళ నుండి 100కీమీ దూరం ఈరోడ్ దగ్గర వెళుతున్నాడని చెప్పాక స్థిమితపడ్డారు.

నేను మా అపార్ట్మెంట్ దగ్గర దిగిన 5 నిముషాలకే మా ఏరియా పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. తర్వాత రాష్ట్ర IG ఆఫీస్ నుండి ఓ ఫోన్, తర్వాత జిల్లా వైద్య అధికారి నుండి ఓ ఫోన్, ఇంకో ఫోన్ ఆశా వర్కర్ నుండి, ఇంకో ఫోన్ వార్డు కౌన్సిలర్ నుండి, ఇంకో ఫోన్ అంబులెన్సు డిపార్ట్మెంట్ నుండి. ఇలా కనీసం 10 వేర్వేరు అధికారులు ఫోన్ చేసి, తమ పేర్లు చెప్పి, ఏ అవసరమున్నా తమకు ఫోన్ చెయ్యాలని అభర్థించారు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే దాదాపు అందరూ ఓ ఉన్మాదంలో నుండి మాట్లాడారు. సార్ మనం అన్ని పరిస్థితుల్లో ఈ కరోనాపై విజయం సాధించాలి సార్. ఓడిపోవడానికి వీల్లేదు సార్. ఈ ప్రక్రియలో మేము రేయింబవళ్లు శ్రమిస్తున్నాము సార్, మీ సహకారం కావాలి సార్. ఇందులో భాగంగా మీకు మావల్ల కొన్ని కష్టాలు ఎదురవ్వొచ్చు సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని సహకరించండి సార్, మనం గెలవాలి సార్ అన్నారు. ఓ ఇద్దరికి మలయాళం తప్ప వేరే భాష రాదు, వాళ్ళు వెళ్లి వాళ్ళ అధికారిచే నాతో ఇంగ్లీషులో చెప్పించారు. చివరిగా రాత్రి 9కి పోలీస్ ఆఫీసర్ ఇంటికొచ్చి అసలు సిసలు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. 14 రోజులు మీరు కనీసం గడప దాటడానికి కూడా వీల్లేదు, మీ మొబైల్ నెంబరు సర్వైలెన్స్ లో పెట్టాము. రోజూ మేము వచ్చి చూసెళతాము అనేది సారాంశం. బయటకు వస్తే 3 సంవత్సరాల కారాగార శిక్ష తప్పదని హెచ్చరించారు. అపార్ట్మెంట్లో అందరికీ 6 జూన్ వరకు నేను క్వరంటాయిన్ లో ఉన్నానని నేను గడపదాటితే పోలీసులకు తెలియపరచాలని ఆజ్ఞ ఇచ్చి వెళ్లారు. మా అపార్ట్మెంట్ వాసులు సార్ మీకు ఏమి కావాలన్నా మేము తెచ్చిపెడతాము జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి చాలు, దయచేసి మీరు బయటకు రాకండి అని విన్నపంతో కూడిన హెచ్చరిక చేశారు!

నాకు చెన్నకేశవ గారి మాటలు గుర్తొచ్చాయి మన రాష్ట్రంలో క్యూలో కాస్త దూరంగా నిలబడండి అంటేనే గోడవకోస్తారు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులూ, పోలీసులు నిజంగానే కరోనాపై పోరాడుతున్న యుద్ధ సైనికుల్లా పనిచేస్తున్నారు. వీళ్ళు ఐక్యమై పోరాడుతున్నారు. ఇది అసలైన కేరళ మోడల్ ఆఫ్ కన్టెయిన్మెంట్! – సుదర్శన్ టి

Share.

Leave A Reply