జనవద్గీత | పచ్చని అడివికీ, కొండకోనలకీ పుట్టిన కవి

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు తెరలు విడిపోతూ, తెలతెలవారుతున్న తూరుపు కొండవాలుల్లో, పిట్టలూ, పిచికల ప్రభాతసంగీతం – కోయలూ, సవరలూ లయబద్ధంగా అడుగులు వేస్తున్న ఆదిమ నృత్యంలో హొయలు పోతున్న ఒక తూగు, ఒక లయ… భుజాన తుపాకులతో, నినాదాలతో శ్రీకాకుళం కొండదారుల్లో నడిచి వెళుతున్న త్యాగధనుల హృదయరాగం…ఉద్విగ్నంగా వినిపించే ఆ నేలకీ, పచ్చని అడివికీ, రమ్మని పిలిచే కొండకోనలకీ పుట్టిన కవి గార శ్రీరామ్మూర్తి.

తలవొంచడమూ, తూపాకీ దించడమూ తెలియని తిరుగుబాటు తత్వవేత్త. అక్షరాలని బుల్లెట్లుగా, పదాలని బానెట్లుగా, వాక్యాలని ఆర్డీఎక్స్‌గా మార్చే రహస్యవిద్యని యవ్వనకాలంలోనే నేర్చిన కవితోద్యమ కథానాయకుడు.

sreerama murthy

శ్రీ అంటే శ్రీకాకుళం. శ్రీ అంటే శ్రీరామ్మూర్తి. పోరాటం అతన్ని ఉత్తేజితుణ్ణి చేస్తుంది. నిస్వార్థజీవుల ప్రాణత్యాగం కలచివేస్తుంది. అది నరాల్లో అగ్నికెరటాల కవిత్వమై ధ్వనిస్తుంది. నాగవళినదీ తరంగాల మీద జీవనసంగీతమై ప్రవహిస్తుంది. శ్రీరామ్మూర్తి కవిత్వం కొండవాలుల్లో జాలువారిందీ అక్కడే. అది వెంపటాపు సత్యం జనంతో కలిసి నడిచిన దారి. అది సుబ్బారావుపాణిగ్రాహి పాటతో పులకించిన పూలబాట. పేలవమైన అక్షరాల్ని పదునైన కవిత్వంగా మార్చి వీరులపాదాల కింద విప్లవదారులుగా పరిచి, మురిసిపోయిన కవి శ్రీరామ్మూర్తి. దుర్గమారణ్యాల్లో నెత్తురోడిన త్యాగమూ, మంకెనపూల కన్నీటి రాగమూ కలిసి పలికే కవిత్వాన్ని మనకి అందించినవాడు శ్రీరామ్మూర్తి. అందాన్నీ, సౌందర్యాన్నీ, జీవనబీభత్సాన్నీ కవితాక్షరాలుగా మార్చగల మాంత్రికుడీ కవి! అదిగో చూడండి, ప్రజాశ్రేయస్సుని పతాకంగా ధరించి, ఉగ్రుడై వస్తున్నాడీ ఉద్యమకవి!.
కవిత్వం జ్ఞానదాయిని కాదు, కేవలం చైతన్యప్రదాయిని, అనుభూతి, ఆహ్లాదం, ఆనందం లాంటి భావాలు చైతన్యాన్ని విరబూస్తాయి. పూలు రువ్వుతున్న దెవరో, భావాంకురాలను పరిమళకరాలతో కవితలుగా మలుస్తున్న దెవరో, ఉప చేతనలోని ఉద్యానవనమా? అంటున్నాడు కవి. సుకుమారమైన పరిమళభరితమైన భావాల ఉద్యానవనాల్లో మనల్ని విహరింప చేయడం ఈ కవికి తెలుసు. మనసు దోచుకునే పద్యాలెన్నింటినో ఆ ఉద్యానవనమే మనకి ఉదారంగా యిస్తోంది. ఆ వెన్నెల పూల ఉద్యానవనం అసలు పేరు గార శ్రీరామమూర్తి. ఆయన ఉప చేతన సౌందర్యం వూటబావి. అందులోనే సుడులు తిరిగే సృజనాత్మక, కళాత్మక కవితా ప్రవాహానికి కేంద్ర బిందువు ఆ బావి. అది భావితరాలను మేల్కొలిపే పాట పాడుతోంది. చూపు దోచుకునే
ఉద్యానవనమై కనుచూపు మేరా పరుచుకుంటోంది.
రాత్రి కురిసిన మేఘాలను ఆరేసుకున్నది ఆకాశం
తెల్ల చీరలు పరిచిన నీలి క్షేత్రం

నీటిలో నీలాకాశాన్ని చూసి
దిగి వచ్చిన నక్షత్రాల్లా
తెల్ల కలువలు

నెలంతా తనను ఉండ నివ్వాలని
రాత్రికి వెన్నెల లేఖ
రాజ్యాంగం ఒప్పుకోదని చీకటి వాదన

భూమికి ఆకాశం పంపే పల్లకీ వెన్నెల అంటాడు.

మబ్బుల్ని దాటి, వెన్నెల మెట్లన్నీ ఎక్కి, సౌందర్యదృష్టి
చందమామని చేరుకోగలిగినపుడే యిలాంటి
కవితావిష్కరణ జరుగుతుంది. శ్రీరామ్మూర్తి రసభరితమైన పద చిత్రాలని అలవోకగా పరిచి పాఠకుణ్ణి పరవశుణ్ణి చేస్తారు. అలా అని వొట్టి సౌందర్య వ్యామోహంతో సరిపెట్టుకునే రకం కాదు. మేఘం మేనులో మెరుపు ఖడ్గం, చీకటి కడుపులో కాంతి కరవాలం, అణచివేత క్షేత్రంలో తిరుగుబాటు అంకురం- యుద్ధం ఇక తప్పదని హెచ్చరిస్తాడు. వొట్టి సౌందర్యమూ, అందమైన పదచిత్రంతో ఆగిపోడు, నాలుగు పంక్తుల్లోనే ఒక రిథంనీ, వినసొంపైన శబ్దాన్నీ మేళవించి మనసుదోచుకుంటాడు.
ద రిథం ఇన్‌ పొయిట్రీ ఈజ్‌ ఎ లాండ్‌ మార్క్‌ ఫర్‌ పీపుల్స్‌ మెమరీ” అన్నారు జార్జి థామ్సన్‌. ‘A PERFORMANCE OF WORDS’ అన్నారు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ .
మెరుపులూ చమత్కారాలూ ఆకట్టుకుంటాయి. ఆశ్చర్యపరిచే పదచిత్రాలూ, అనితరసాధ్యమైన ఉత్ప్రేక్షలను శబ్దాలంకారంతో పండించడానికి భాషాజ్ఞానం అవసరం. అది పుష్కలంగా వున్నవాడు శ్రీరామ్మూర్తి. శబ్ద ప్రాధాన్యతని గుర్తెరిగినవాడు. కవితామయమూ, కళాత్మకమూ అవడంతో పాటు ప్రయోజనాత్మకమూ కావాలని తపించే కవి. అందు శ్రీరామ్మూర్తి తన మేధస్సునీ, హృదయాన్నీ, కవిత్వచరణాలనీ జనశ్రేణులకు అంకితం చేస్తున్నారు.

Prakash


గత 45, 50 సంవత్సరాలుగా ఆయన కవిత్వం రాస్తున్నారు. అది రాజీలేని కవనం. 45 సుదీర్ఘ సంవత్సరాలు జర్నలిస్టు జీవితం. సంపాదకునిగా ప్రత్యేకమైన గౌరవం పొందినవాడు. శ్రీరామ్మూర్తి రాసిన కొన్ని వందల సంపాదకీయాలు నేను చదివాను. వచనమా? కాదది. హంసలాగ వంశధార ఎగసిపడే పరవళ్లు… ఒక భావధార! రాజీలేని పదాలు. తిరగబడే వాక్యాలు! రాజ్యం దుర్మార్గాన్ని ఎదిరించి నిలబడే ధిక్కారం. నిప్పు కణికల్లాంటి నిజాయితీ. జెండాల్లా ఎగిరే అసాధారణమైన పదాల పొందిక. ఆయన అక్షరాలు ఒక మానసిక ఉద్వేగానికి సజీవసాక్ష్యాలు. నిరాడంబరంగా, మధ్య తరగతి మొహమాటంగా, unassuming గానే వుంటాడు. వాస్తవానికి అతను ప్రజాశ్రేణుల పక్షాన నిలువెత్తు కవిత్వమై నిలిచి వుంటాడు. అసలు పేరు ‘నిజం’, మారుపేరు గార శ్రీరామ్మూర్తి. సంధ్యారుణకాంతుల్లో వెలిగే శ్రీకాకుళం కొండల్లో కఠోర తపస్సు చేసి, ఎట్టకేలకు కవితామృతాన్ని సాధించగలిగిన వరపుత్రుడు శ్రీరామ్మూర్తి. 75’85 దశకం కవుల్లో ఆధునికుడు. తర్వాత వెల్లువలా వచ్చిన ఆధునిక కవుల్లో అత్యాధునికుడు! Truly A Superlative poet of our time. కొందరు గుర్తించకపోవచ్చు. చాల మంది పని గట్టుకుని పట్టించుకోకపోనూవచ్చు. నిజమైన కవిత్వానికి భుజకీర్తులెందుకులే అనుకుంటూ లక్‌డీకాపూల్‌ చౌరస్తాలో తలవొంచుకు నడిచి వెళ్లిపోయే Humility పేరు నిజం శ్రీరామ్మూర్తి. ప్రజాపక్షం వహించే అన్ని రకాల వామపక్షాలూ విఫలం అయ్యాయని, ఆవేదనతో… గాలికి ఎగిరే నేల గట్టి చినుకుతో అణగారుతుంది, ఆస్తి బరువుతో విప్లవ దీక్ష నీరుగారుతుంది అంటారు. ఊబిలో కూరుకు పోయాం, చేజేతులా కళ్లు పొడుచుకున్నాం, దొంగకి తాళాలిచ్చి దోపిడీ జరిగిందని వాపోతున్నాం అంటూ విప్లవోద్యమ వైఫల్యం అనే మహా విషాదాన్ని నాలుగు పంక్తుల్లోనే నిర్వచించి కన్నీటి పర్యంతమౌతున్న కవి శ్రీరామ్మూర్తి.
శ్రీరామ్మూర్తిగారు స్నేహితుడు కాకపోయినా, గత 35 సంవత్సరాలుగా తెలిసిన సీనియర్‌ సంపాదకుడనీ, నాకు పరిచయస్తుడనీ చెప్పుకోడం నాకెంతో ఇష్టం. త్రికరణశుద్ధిగా జీవిత సర్వస్వాన్నీ కవిత్వానికి అంకితం చేసిన ఈ ఉత్తమకవి తెలుగులో అగ్రతాంబూలం అందుకోడానికి అర్హుడని నేను అనుకుంటున్నాను. నాతో మీరు విభేదించవచ్చు. ముందు శ్రీరామ్మూర్తి కవిత్వం చదివి, తర్వాత ఆ పని చేయమని నా మనవి.
– ప్రకాశ్‌ – 9704541559

అరుదైన గ్రామీణ విజయ గాథలు,  పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia  తెలుగు ఛానల్ ని  జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber  మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply