కృషి ఉంటే మనుషులు సుభద్రలవుతారు

Google+ Pinterest LinkedIn Tumblr +

కృషి ఉంటే మనుషులు సుభద్రలవుతారు 
వరంగల్‌ జిల్లా ,గోవిందరావుపేట్‌ మండలం అటవీ ప్రాంతంలో ఉన్న పల్లె పస్రా నాగారం. అక్కడ పేదలకు భూమి వుంది. కానీ నల్లరేగడి,ఇసుకతో కూడిన దుబ్బనేలలవి.
గతం … 
పస్రానాగారం గ్రామంలోని 40 కుటుంబాల్లో 36 కుటుంబాలకు భూమి వుంది. 2006లో అటవీ హక్కుల చట్టం ద్వారా భూములు పొందినప్పటికీ అవి సాగుకు యోగ్యంగా లేక వ్యవసాయం చేసేవారు కాదు. ఇతరుల పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.వీరి తలసరి ఆదాయం రూ. 9 వేల రూపాయలు మాత్రమే. ఈ గ్రామంలో ఇసుక, రేగడి రకం భూములు వున్నాయి.
కార్యాచరణ.. 
వాన చుక్కల మీద ఆధారపడి వరి, పత్తి, మొక్కజొన్న పండించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, నష్ట పోతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరికి ఉద్యాన పంటలతో సుస్ధిర జీవనోపాధులు కల్పించాలని నాబార్డు అధికారి బి.ఉదయ భాస్కర్‌, వనసమాఖ్య (అటవీసంరక్షకుల కూటమి) సంస్ద ద్వారా 26 ఎకరాల్లో గిరిజనులలకు ‘మాతోట’ పథకాన్ని ప్రారంభించారు.
ఇక్కడ 186 మంది మహిళలు కలిసి 15 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సాగునీటికి ప్రధాన వనరు రాళ్లమాటు వాగు. దీని పక్కనే కాకతీయుల నాటి చిన్న చెక్‌డ్యాం కూడా ఉంది. ప్రస్తుతం వాగు ఎండి పోయి చిన్న కుంటలో మాత్రమే నీళ్లు మిగిలాయి. వీటిని మోటారు ద్వారా తోడి పక్కనే ఉన్న వారి మామిడి తోటలు ఎండి పోకుండా కాపాడుకుంటున్నారు. అయితే వీరికి విద్యుత్‌ సౌకర్యం లేదు. దాని గురించి గిరిజన మహిళలు ఏమంటారంటే….
” మా పొలాల వరకు ప్రభుత్వం కరెంట్‌ పోల్స్‌ వేయలేదు. కరెంట్‌ కోసం వాగు దాటి పోయి అవతల ఉన్న పోల్స్‌కి తాత్కాలికంగా వైర్‌ కనెక్షన్‌ ఇచ్చుకోవాల్సి వస్తోంది.”
ఈ గ్రామంలో మాతోట కార్యక్రమం అమల్లోకి వచ్చాక, రైతులతో విలేజీడెవలప్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేసి లబ్దిదారుకు ఒక బోరు, ఒక కరెంట్‌ ఇంజన్‌, రెండు డీజిల్‌ ఇంజన్లు అందచేశారు.
కానీ,భూమిలో జలాలు అడుగంటాయి.అలాంటి కరవు పరిస్థితిని మహిళ సుభద్ర ఎలా ఎదుర్కొన్నారంటే…
భూగర్భ జలాలను పెంచిన సుభద్ర 
యానాక సుభద్ర మరో 12 మంది రైతులతో కలిసి
ఉమ్మడిగా 12 ఎకరాల్లో ఉద్యానపంటలు పెంచుతున్నారు. తమ తోటలను అభివృద్ధి చేయడానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. నీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐతే సుభద్ర తన పొలంలోనే ఉన్న పాడుబడిన బావిని బాగుచేయడం కోసం సొంత డబ్బు ఖర్చుచేసి పూడిక తీసి పునరుద్దరించింది.
ఆమె తండ్రి,భర్త,కుమారుడు కూడా సాగులో ఆమెకు సాయంగా ఉంటారు. వారంతా కలిసి బావి నీటితో 12 ఎకరాలు సాగుచేస్తున్నారు. అక్కడితో ఆగలేదు సుభద్ర. బావికి సమీపంలోనే ఎగువ నుండి పారుతున్న వాననీటిని
భూమిలోకి ఇంక డానికి చిన్ననీటి కుంటను తవ్వించారు. ”వర్షాకాలంలో ఈ నీటి కుంట నిండి బావిలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో చుట్టూ ఉన్న తోటలకు నీటి సమస్య ఉండదు. నీటి కుంటను పూడిక తీయడానికి ఉపాధి హామీ పనులను వాడుకున్నాం” అంటారు సుభద్ర.
ఇవీ ఫలితాలు 
1, సాగు నీటి కరవును ఎదుర్కోవడానికి సుభద్ర చేసిన చిరు ప్రయత్నం ఇపుడు అక్కడి రైతులకు ఆదర్శంగా మారింది.
2, జలసంరక్షణే కాకుండా,వ్యవసాయ నిపుణుల సలహాలతో అంతరపంటలు పండిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
3, భూములకు నీటి వసతి కూడా కల్పించుకోవడం వల్ల ఈ ఏడాది మామిడి పండ్ల దిగుబడి పై రూ.75వేలకు పైగా ఆదాయం పొంది, స్వయం సమృద్ది సాధించారు.

Share.

Leave A Reply