గ్రామీణ ఇంజనీర్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓడి చెరువు మండలం లో మా డొక్కు కారు దూసుకు పోతుంది. దారి పొడవునా అక్కడక్కడా నీరు లేక చుట్టూ ముళ్లపొదలు మొలిచిన బావులు, జీవం లేక ఎండిన పొలాలు , గడ్డిపోచలు లేని బీళ్లలో తిరుగుతున్న బక్కచిక్కిన పశువు లు మా వైపు ధీనంగా చూస్తున్నాయి.
‘‘ ఇక్కడ టీ తాగుదాం బాగుంటది..’’ అని ఒక చోట పక్కకు ఆపాడు డ్రైవర్.
‘‘ ఇక్కడికి సోమావతి నది ఎంత దూరముండాది..?’’ అన్నాడు టీస్టాల్ అతన్ని మాతో ఉన్న మిత్రుడు.
‘‘ దగ్గరే, సున్నంపల్లి పక్కనే అప్పా…’’ ఇత్తడి కెటిల్ నుండి పొగలు కక్కుతున్న టీ గాజు గ్లాసుల్లోకి వంపుతూ అన్నాడు.
తేనీరు గొంతులో పడ్డాక కాస్త ఉత్సాహం వచ్చింది. మళ్లీ కారు కదిలింది..
‘‘ ఇక్కడి నుండి మా కరవు జిల్లా కొత్తగా ఉంటాది…’’ అన్నాడు మిత్రుడు.
అతను చెప్పినట్టే రోడ్డుకు ఇరువైపులా మామిడి, బత్తాయి తోటలు, పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు, అపుడే కోసిన కాయగూరలను ట్రాలీ పైకి ఎక్కిస్తున్న పనివాళ్లుతో సందడిగా, ఆకుపచ్చని అనంతపురంగా కనిపించింది.
అరగంట తరువాత మా వాహనం ఒక చోట ఆగింది.
‘‘ ఈ పల్లె ఇంత పచ్చగా ఉండటానికి కారణం ఈ సోమావతి నదే…’’ అన్నాడు మిత్రుడు
అందరం ఆశ్యర్యంగా చూశాం.. అక్కడ ఒక్క చుక్క నీరు కూడా లేదు ఇక నది ఎక్కడా.. అని మేం దిక్కులు చూస్తుంటే …
‘‘ బాగా వానలు పడినపుడే ఇక్కడ నదీ ప్రవాహం ఉంటాది. ఇపుడు ఎండి పోయింది. పెన్నా నదికి చిన్న పాయ ఇది… ’’అన్నాడు ఆయన, అక్కడి ఇసుక మేటలను చూపిస్తూ…
‘‘ సరే.. నది ఎండిపోయింది కదా, పంటలు ఎలా పండిస్తున్నారు?’’ అని అడిగాను.
‘‘ నీటి ప్రాజెక్టులు నది మీద కడతారనే సంగతి అందరికీ తెలిసిందే!! కానీ, కోట్ల రూపాయల ఖర్చు లేకుండా, పదేళ్ల క్రితం ప్రజలే ఇంజనీర్లుగా మారి, నది అడుగున నిర్మించిన అరుదైన సాంకేతిక అద్భుతం ఇది.
ఆ గట్టు నుండి ఈ గట్టు వరకు భూమిలోపల చెక్ వాల్స్ నిర్మించి, జల ప్రవాహాన్ని ఆపారు. దాని వల్ల ఈ ప్రాంతపు నేల కు తేమ చేరింది. ఏడాదంతా సాగు చేస్తున్నారు.’’ అని క్లుప్తంగా వివరించాడు.
‘‘ మీరు ‘శప్తభూమి’ నవల చదివారా? ’’ అని అడిగాను.
ఫిక్షన్ చదివే అలవాటు లేదన్నాడు.
‘‘ ఈ ప్రాంతపు రచయితే రాశాడు. అందులో ఒక చోట ‘ఈ సంవత్సరం వానలు పడితే, చెరువు నిండితే మీ బకాయి తీర్చుకుంటాం. అంతా వానదేవుని దయ!’ అని సిద్ధరామప్ప ప్రతినిధి అంటాడు.
కానీ ఈ రైతులు వాన దేవుడి కోసం ఎదురు చూడకుండా తమ రెక్క ల కష్టంతో నేల కింద నీటిని దాచుకున్నారు.’’ అన్నాను.
కొన్ని అద్భుతాలు ఇలాగే సైలెంట్ గా జరిగిపోతుంటాయి… వెతికితే దొరుకును !!

Share.

Leave A Reply