ఇంగ్లిష్ మాట్లాడడం, ఈజీ …

Google+ Pinterest LinkedIn Tumblr +

భాష మాట్లాడడానికీ, రాసుకోవడానికీ అనే రెండు అవసరాలకోసం అనుకుంటే రాసుకోవడం కన్నా మాట్లాడడం సులభం అనుకుంటే ఈ దేశంలో మారుమూలపల్లెలోని చదువురానివ్యక్తి కూడా ఎటువంటి కష్టం లేకుండా తెలుగుభాష మాట్లాడినట్లే అమెరికాలోని పనిమనిషీ ఇంగ్లిష్ మాట్లాడుతుంది అనే సింపుల్ సత్యం అర్థం చేసుకుందాం ముందు.

రా, పో, ఇవ్వు, పెన్ను, పుస్తకం, ఇడ్లీ, హోటల్, పెట్రోల్ పదాలు తెలుసుగానీ వాటిని వాక్యాలుగా మలిచే గ్రామర్ కష్టంగా వుంది అనేది పలువురి ఆరోపణ. అవును దీన్ని ఆరోపణ అంటాన్నేను. ఏం పల్లెటూరిలో చదువురానివ్యక్తి అటుంచి పీజీ చదివిన వ్యక్తుల్లో ఎంతమందికి తెలుగు గ్రామర్ వచ్చు? కర్త, కర్మ, క్రియ, నామ వాచకాలు, సర్వనామాలూ, అవ్యయాలు, చేదకాలు, సంధులు, పదబంధాలూ, కర్మణివాక్యలూ, సంయుక్త, సంక్లిష్టవాక్యాలూ మనకి తెలుసా? మరెట్లా మాట్లాడుతున్నాం? ఇదిగో ఇక్కడేవుంది అసలు కిటుకు.

నిజానికి భాషమీద రీసెర్చ్ చేసేవాళ్లకి గ్రామరు తెలియాలి. మాట్లాడడానికి, వినడానికి, చదువుకి గ్రామర్ తెలియాల్సిన అవసరంలేదనే ఒక ప్రాధమిక వాస్తవానికి మనం ముందుగా కట్టుబడాలి. ఈ వాస్తవమ్మీద నిలబడి మనం ఇంగ్లిష్ నేర్చుకోవాలి. బాగా గమనించండి ఇంగ్లిష్ మాట్లాడే, రాసే చాలామందిని ఇది గ్రామర్ పరంగా తప్పు అన్నామనుకో, వారు చప్పున ఆగిపోయివడం మీరు చెక్ చేసుకోవచ్చు.

ఇంగ్లిష్ అనేది గొప్ప అనుకూలమైన భాష. దానికి అవసరమే తప్ప పాండిత్యాలూ, ప్రగల్బాలు అవసరంలేదు.

నిజానికి ఇంగ్లిష్ మనలాంటిది. ఒక్కపదంలో మనం నాలుగైదు భాషల పదాలు కలిపి ఎలా మాట్లాడతామో అదికూడా గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మనీ, హిందీ వంటి అనేక భాషనుండి ఏరుకున్న పదాల సమాహారం. “ఆసుపత్రి ఆవరణలో పేషెంట్ల హైరానా” అన్న వాక్యంలో ఒక్క పదం తెలుగులేదని గుర్తించండీ. రబీంద్రనాథ్ అని బెంగాలీ అంటే మనం రవీంద్రనాథ్ అంటాం, కనగరాజ్ అని తమిళియన్ అంటె మనం కనకరాజ్ అన్నట్లు అయాభాషలనుండి అయా పదాలు ఇంగ్లిష్లోకి వచ్చినప్పుడు మూలపదాలు పలికేరీతిలో పలకాల్సివస్తుంది కాబట్టి మనకు అయా పదాల్సి పలకడంలో తికమక కనిపిస్తుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, అలా మఈ దారుణమైన అర్థంలో పలికే పదాలు వేళ్లమీద లెక్కపెట్టుకునేవి వుంటాయి సగటు మామూలు ఇంగ్లిష్ మాట్లాడేవారికి. కాబట్టి భయపడాల్సిన పన్లేదు. నిజానికి రెస్టారెంట్, హోటల్ అనే ప్రాధమిక పదాలు పెద్దపెద్ద ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లు కూడా తప్పుగానే పలుకుతారనే విషయం అర్థంచేసుకుంటే మనం భయపడాల్సిన పనిలేదు (వాటిని నిజానికి రెస్ట్రాంట్, హొటేల్ అనాలి).

పసిపిల్లలు పదాలు నేర్చుకునేది పరిశీలనతోనేననే సత్యం గుర్తుంచుకోండి. ఇంగ్లిష్ మాట్లాడే వ్యక్తిని దయచేసి శ్రద్దగా వినండి. మనమేమీ రోజురోజుకూ మారిపోయే ఉద్యోగాలో, వ్యవహారాలో డీల్ చేయడంలేదని గుర్తించండి. మరలా మరలా పునరుక్తమయ్యే పదాలు, వాక్యాలే ఆఫీసులో, పనిలో, వ్యవహారంలో మాట్లాడతాం, కాబట్టి ఇంగ్లిష్ వచ్చిన మీ బాస్, లేదా సహోద్యోగి ఎలా ఆవిషయాన్ని మాట్లాడుతున్నాడో గమనించండి శ్రద్దగా. మెల్లగా మీరు వాటినే వాడకంలో పెట్టుకోండి.

ఆరంభంలో చిన్న చిన్న పదాలు. అవును, రండి, చెప్పు, కాదు, వుంది.. వంటి పదాలతో మొదలు పెట్టండి. మీకన్నా తక్కువ ఇంగ్లిష్ వచ్చిన వారితో ఇంగ్లిష్‌లో ఎడాపెడా వాగేయండి, బాగావచ్చినవారికి నా ఇంగ్లిష్ సరిచేయండి అని ధైర్యంగా చెప్పి సరిచేయించుకోండి, ఎదుటివ్యక్తి సహజంగానే సంతోషంగా గురువు స్థానం తీసుకుంటాడు, అప్పుడు మీ కిరీటం ఏమీ కిందపడిపోదని గుర్తించాలి.

వినడం ఎంత ముఖ్యమో మాట్లాడడమూ అంతే ముఖ్యంగా గుర్తించండి. తెలుగు వారితో నిరంతరం మాట్లాడేవాళ్ళు ఎంత ఇంగ్లిష్ వచ్చినా దాన్ని చప్పున ఎదుటివ్యక్తి ఇంగ్లిష్లో మాట్లాడితే ఫ్లో రాకపోవడం మేం నిత్యం గమనిస్తూంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ వాతావరణాన్ని మీ చుట్టూ నిర్మించుకోవాలి అంటే ఇంగ్లిష్ తినడం, ఇంగ్లిష్ లో తాగడం, ఇంగ్లిష్.. ఇంగ్లిష్.. ఇంగ్లిష్. దట్స్ ఇట్.

చదువురాని పల్లెటూరి వ్యక్తైనా, అమెరికాలోని పనిమనిషైనా వారి భాషలు చక్కగా మాట్లాడడానికి కారణం, వారిచూట్టూ అదే భాష మాట్లాడేవాళ్లు నిరంతంగా వుండడం. తమిళనాడులో వుంటే తమిళం వచ్చినట్లు మీకు ఇంగ్లిష్ రావాలంటే ఇంగ్లండ్‌కి వెళ్లమననుగానీ, మీకు ముస్లిం స్నేహితుడుంటే ఉర్దూ ఎలా వస్తుందో, అలాగే ఇంగ్లిష్ రావడానికి మీ పక్కన ఇంగ్లిష్ మాట్లాడే మనిషి వుండాలని గుర్తించండి. మరి ఆ మనిషిని మేమెక్కడ పట్టుకు రావాలనే ప్రశ్నవేసే అమాయకత్వం ప్రదర్శించకండి. ఇంగ్లిష్ వార్తలు వినండి, ఇంగ్లిష్ సినిమాలు చూడండి, మొబైల్ ఫోన్లు వాడండి.. మేం చదువుకునే రోజుల్లో మా చుట్టుపక్కల తెలుగు స్నేహితులు లేకుండా చూసుకునేవాళ్లం!

ఇంగ్లిష్ భాషలో గొప్ప సౌలభ్యం ఏమంటే ఏది మాట్లాడినా అది చెల్లుబాటయ్యే సుగుణం. నిజానికి గ్రామర్ ప్రకారం ఇంగ్లిష్ మాట్లాడితే అతడికి ఇంగ్లిష్ రానట్లు లెక్క ప్రస్తుత కాలంలో. ఇంగ్లిష్ భాషలో పదాలు వేగంగా వాటి అర్థం, ఉపయోగం కోల్పోవడం వుంటుంది. ఆరునెలలకోసారి కూడా మారిపోతాయి. వాక్యనిర్మాణం అయితే బూతులే ఇక.

ఇంగ్లిష్ లో మౌళికంగా బ్రిటిష్ ఇంగ్లిష్, అమెరికన్ ఇంగ్లిష్ వుంటే అమెరికన్ ఇంగ్లిష్ మనలాంటివారికి పెద్ద సహాయకారి. మరీ దారుణంగా కేవలం భాష అవసరాలకోసం అనే సూత్రానికి బాగా కట్టుబడుతుంది అమెరికన్ ఇంగ్ల్సిహ్. ముఖ్యంగా అది వూనికలతో కూడిన శబ్దాలతోనే పని చేసుకోవాలనుకుంటుంది. గ్రామర్ అస్సలు ఫాలో అవదు.

చాలామంది పాతకాలం ఇంగ్ల్సిహ్ చదవడం, రాయడం వచ్చిన ఉద్యోగులు ఇంగ్లిష్ సినిమాలమీద, ప్రత్యేకించి కొత్త సినిమాల పట్ల తీవ్ర ఆక్షేపణ కలిగివుందడం గమనించండి. “ఏమిటాభాష? షషష అంటూ ఒక్కమాటకూడా అర్థంకాకుండా మాట్లాడితే అదెట్లా చూడాలంటారు?” పదలకొచ్చిన తిప్పలు అవైతే ఇక వాక్యాల నిర్మాణంలో దారుణంగా వుంటాయి. కాబట్టి మీరు కొంచెం స్టైల్ జోడిస్తే మీరు మాట్లాడేదేదైనా అది సందర్భానికి సరిపోతే ఇక మీకు తిరుగులేదు.

ప్రస్తుతం స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించడానికి మన చూట్టూ ప్రతి పట్టణంలో లెర్నింగ్ సెంటర్స్ వున్నాయి. లేదు నేను మా పొలంలో వుండి నేర్చుకుంటానంటే కూడా మీ మొబైల్ ఫోన్లో యాప్స్ వున్నాయి. నిన్నటి సాక్షి దినపత్రిక చూడండి (https://epaper.sakshi.com/2652150/Hyderabad-Main/29-04-2020…)కావాలంటే.

మొత్తానికి చెప్పేదేమంటే మనిషికి కావల్సింది స్పష్టత తన అవసరం పట్ల. మనమేమీ మోసం చెయడంలేదు, అబద్దాలడడంలేదు, అన్యాయంగా ప్రవర్తించడంలేదు. ఇంగ్లిష్ మనకు రాకపోవడం నేరం కాదు. మన ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఎవరికి పుట్టాం, ఎప్పుడు పుట్టాం అనే కారణాలమీద అధారపడి మనకు ఇంగ్లిష్ రాకపోయివుంటుంది. మనకు ఇన్నాళ్లు ఇంగ్లిష్ రాకపోవడానికి కారణం వుంది, దాన్ని మనం సమర్థించుకునేహక్కు వుంది, కానీ ఇకపై కూడా అంటే కుదరదు. కుదురుతుంది అంటే మనల్ని మనం మోసంచేసుకోవడమే.

ఇతవరకు ఇంగ్లిష్ మాట్లాడడం గురించి మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఇంగ్లిష్ గ్రామర్ కీ మాట్లాడే భాషకీ సంబంధంలేదని తెలుసుకున్నం. ఇక మరోసారి రాసుకోవడం గురించి మాట్లాడుకుందా, అందులో పదాలు నేర్చుకోవడం, వాక్యాలూ, కొన్ని గ్రామర్ టిప్స్, కొంత ఫొనెటిక్స్ నేర్చుకుందాం. ఈ సందర్భంలో ఒక్కటే చెప్పగలను, మనకు ఇంగ్లిష్ రాకపోవడం ద్రోహంకాదు, భాష ఒక వాహనం లాంటిది, కానీ మీవద్ద సరుకు వుండడం ముఖ్యం. సరుకులేమీ లేకుండా నిర్దేశిత సమయంకన్నా ముందు స్టేషన్ చేరిన గూడ్స్ ట్రైన్ కన్నా, నిండు సరుకులతో స్టేషన్ చేరిన గూడ్స్ ట్రైన్ విలువైనదని గుర్తించండి.

Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply