నిరాశతో కొందరు బతుకు బస్టాండ్ అయిందంటారు!!
కానీ ఈమె జీవితం రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం మీద మొదలైంది.
అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.
జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదని నిరూపించింది,
రాణు మండల్…
పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్ రైల్వే స్టేషన్లో,రణ గొణుల మధ్య, బూడిద రంగు జుత్తుతో, ధీనంగా ఉన్న మట్టిరంగు మహిళను పట్టించుకోకుండా వెళ్తున్న ప్రయాణీకులు ఒక్క సారి అగారు…
‘ఏక్ ప్యార్ కా నఘ్మా హై,
మౌజోన్ కి రావానీ హై’ …. అంటూ, ఆమె ఎండిన పెదవుల నుండి చిగురించిన స్వరం… వారిని గుండెల్ని టచ్ చేసింది.
అందమైన ఆ పాటను 70 వ దశకంలో ‘షోర్’లో లతా మంగేష్కర్ పాడారు. బాలీవుడ్లో అత్యంత మధురమైన పాటలలో ఒకటి.
అదే పాటను ఇటీవల రైల్వేస్టేషన్లో తనదైన పదునైన స్వరంలో పాడి ప్రయాణీకుల మనసులు దోచిన, ఆ పేద మహిళ పేరు ‘ రాణు మరియా మండల్ ‘.
జూలై 21 న అదే స్టేషన్లో ఉన్న అతీంధ్ర చక్రవర్తి అనే యువకుడు ఆమె స్వరాన్ని స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఆగస్టు మొదటి వారం నాటికి ఈ వీడియో వైరల్‌గా మారి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హృదయాలలో ప్రతిధ్వనిస్తోంది.

Atindra chakraborty with Ranumondal
నీడ లేదు కానీ, ఆమె గుండె కింద తడి ఉంది. ఏపూటకు ఆపూట వెతుక్కునే స్ధితిలో ఉన్న అమె జీవితాన్ని ఆ రెండు నిమిషాల వీడియో మార్చివేసింది.
ఈ పాటతో ఆమె వైరల్ అయినప్పటి నుండీ, ఎఫ్ఎం రేడియో, టీవీ ఛానెల్స్, లోకల్ క్లబ్‌లు,రియాలిటీ షోలు, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.
రాణు మండల్ వీడియో నెట్లో అప్లోడ్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొంతకాలం క్రితం ఆమె పొరుగింటిలో ఉండే, తపన్ దాస్ ఆమె పాటను అప్లోడ్ చేసారు, కానీ అది పెద్దగా హిట్ కాలేదు. ఇపుడు రైల్వే ప్లాట్‌ఫాం హడావడి , గోల మధ్య ఆమె నింపాదిగా, హృద్యంగా, పాడిన పాట ప్రపంచానికి కనెక్ట్ అయింది!!
ఆమె పాటల వీడియోను ఇప్పటికే 16లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 35వేల మంది షేర్ చేసుకున్నారు. ఆమె పాట సూపర్ హిట్ కావడంతో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.
తన మధుర స్వరంతో రాత్రికి రాత్రే పాపులరైన ఆమెను బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ” రాణు మండల్ జీ, నా సినిమాలో ఒక్క పాట పాడతావా ప్లీజ్ …” అంటూ, ఓ రియాల్టీ షోలో రిక్వెస్ట్ చేశాడంటే, ఆమె స్వరంలో ఎంత అద్భుతం ఉందో ఊహించండి. ఆమె పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
ఆమెకు ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డు లేనందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆఫర్లను అందుకోలేక పోతున్నది. ప్రస్తుతం బెంగాల్‌లోని రియాల్టీ షోలకు పరిమితం అయింది.
రాను మరియా వ్యక్తిగత విషయాలు ఇంకా బయటకు రాలేదు కానీ, రైల్వే స్టేషన్లో పనిచేసుకుంటూ.. పొట్టపోసుకుంటున్న ఆమె ప్రస్తుతం ఒంటిరిగా జీవిస్తున్నారని తెలిసింది. గత 10 సంవత్సరాల నుండి ఆమె కుమార్తెకు దూరంగా ఉంటున్నారని మీడియా కథనాలు వల్ల తెలుస్తోంది.
ఆమె పాటల కోసం క్లిక్ చేయండి…https://youtu.be/PJbS727BaH4
‘ నీదీ నాదీ ఒకటే కథ…’
‘తేరీ మేరీ..కహానీ…’ అంటూ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ బెంగాళీ సింగర్ కథ లాంటిదే ఆంధ్రా సింగర్ కథ.
ఇదంతా చదువుతుంటే, బేబీ కథ గుర్తుకు వస్తుంది కదూ,
తూర్పుగోదావరి జిల్లా , వడిశలేరులో వ్యవసాయ కూలీగా పొట్టపోసుకునే బేబీ అనే మహిళ, ‘ఓ చెలియా నా ప్రియసఖియా..’ అంటూ పాడినపుడు, పక్కింటి అమ్మాయి, రికార్డు చేసింది. ఆ తరువాత ఆ పాట వైరల్ అయి… బేబీని స్టార్‌ని చేసింది..ఆ కథనం లింక్ https://ruralmedia.in/singer-baby-got-sp-balasubrahmanyam-praise/