యండమూరి,యద్ధనపూడి… ఒక తమిళ కథ!

Google+ Pinterest LinkedIn Tumblr +

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author, Tadi Prakash . The facts and opinions appearing in the article do not reflect the views of  Ruralmedia and Ruralmedia  does not assume any responsibility or liability for the same

Starwar on ‘Novel’ Plagiarism – Part 1

ఈ సినిమా పేరు:
యద్ధనపూడి, యండమూరి, ఒక తమిళ అనువాదం.
20 సంవత్సరాల క్రితం జరిగిన వివాదమిది. ‘జనహర్ష’ రమణమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన ‘విజయ విహారం’ మాస పత్రికలో 20 నెలలు పని చేశాను. 2000 సంవత్సరం విజయ విహారం ఏప్రిల్ సంచికలో యండమూరి, యద్ధనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవర రామ్ మోహనరావులతో నేను చేసిన ఇంటర్వ్యూలు, వివాదం వివరాలు పబ్లిష్ అయ్యాయి.
అప్పుడు ప్రచురించిన వాటిని యథాతథంగా
ఇక్కడ ఇస్తున్నా.

ముందస్తు సంజాయిషీ: ఇది ఆసక్తికరమైన సమాచారం. కేవలం కరోనా కాలక్షేపం. గతజలసేతు బంధనమే తప్ప, యండమూరిగారి మీద కోపమో, వ్యతిరేకతో నాకు ఉండాల్సిన అవసరమే లేదు.

ఇదీ విజయ విహారం రిపోర్టు:

త‌మిళంలో యండ‌మూరి పేరుతో
యద్ద‌న‌పూడి న‌వ‌ల‌లు

త‌ప్పునాది కాదంటున్న యండ‌మూరి,
కోర్టుకెక్క‌నున్న సులోచ‌నారాణి

ఒక చిత్ర‌మైన వివాదం తెలుగు ర‌చయిత‌లు, పాఠ‌కుల్లో క్ర‌మంగా చ‌ర్చ‌గా మారుతోంది. పేరున్న ర‌చ‌యిత‌లు, గొడ‌వ గ్రంథ చౌర్యంపై కావడంతో ఈ చినుకులూ చిరుగాలీ తుఫానుగా మారే ప్ర‌మాద సూచ‌న క‌న‌డుతోంది. ఈ వివాదం ప్ర‌ధానంగా యండ‌మూరి వ‌ర్సెస్ య‌ద్ద‌న‌పూడి సులోచ‌నా రాణి, కొమ్మ‌నాప‌ల్లి గ‌ణ‌ప‌తిరావు, సూర్య‌దేవ‌ర రామ్మోహ‌న్ రావు. వారి న‌వ‌ల‌లు త‌మిళంలోకి అనువదించి వీరేంద్ర‌నాథ్ డ‌బ్బు మూట‌గ‌ట్టుకున్నార‌ని ఆరోప‌ణ‌. య‌ద్ద‌న‌పూడి, కొమ్మ‌నాప‌ల్లి, సూర్య‌దేవ‌ర‌లు క‌లిసిక‌ట్టుగా కోర్టుకెక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాయుగుండం ఏర్ప‌డిన‌ట్టే. అయితే ఇంత‌మంది స్టార్ రైట‌ర్స్‌ని త‌ల‌ద‌న్నే తెర‌వెనుక స్టార్ పేరు సుశీలా క‌న‌క‌దుర్గ‌. త‌మిళంలోకి అనువాదం చేసుకున్న‌దీ, డ‌బ్బు తిన్న‌దీ ఆమేన‌ని యండ‌మూరి అంటున్నారు. ఆమె లేనే లేదు. క‌న‌క‌దుర్గ అనే మ‌హిళ యండ‌మూరి క‌ల్ప‌నా చాతుర్య‌మ‌నీ, ఆయ‌నే అస‌లుసిస‌లు దొంగ అనీ కొమ్మ‌నాప‌ల్లి ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక తుఫాను త‌ప్పేట్టు లేదు. అస‌లిది వివాద‌మే కాద‌నీ, త‌న త‌ప్పేమీ లేద‌నీ, వుంటే నిరూపించుకోండ‌నీ యండ‌మూరి ధీమాగా స‌వాల్ చేస్తున్నారు. అత‌నికి శిక్ష‌ప‌డాలి. నా క‌ష్టార్జితం నాకు రావాలి అని సులోచ‌నారాణి ప‌ట్టుబ‌డుతున్నారు. అంద‌రూ ర‌చ‌యిత‌లే. తెలివి ప్ర‌ధానాస్త్రంగా బ‌రిలోకి దిగుతున్నారు. గేమ్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఆడ‌టానికి ఊహాశ‌క్తిని జోడిస్తున్నారు. వీరేంద్ర‌నాథ్ ఈ ముప్పేట దాడిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రా? ఇందులో మ‌నం ఎవ‌రి ప‌క్షం వ‌హించాల్సిన ప‌నీలేదు. నిర్మ‌మ‌కారంగా అంద‌రి అభిప్రాయాలూ యిక్క‌డ ఇస్తున్నాం. ఈ త‌మిళ అనువాద సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అంతా ఆ క‌న‌క‌దుర్గ ద‌య.
Dont jump into conclusions,
after all, you have nothing to loose.

‘వి’ ఫర్ విజయమూ, వివాదమూ!

Yaddanapudi vs Yendamuri
Yaddanapudi vs Yendamuri

యండమూరికిపుడు 51 ఏళ్ళు. 1968 లో తొలి కథ ‘ముసురు పట్టిన రాత్రి’ ఆంధ్రప్రభలో వచ్చింది. 1972-79 మధ్య కుక్క, రుద్రవీణ నాటికలు ఆంధ్రదేశాన్ని వూగించాయి. ‘రఘపతి రాఘవ రాజారాం’ నాటకానికి 1984 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తొలినవల ‘రుషి’ 1977లో స్వాతిలో వచ్చింది.
1980లో తొలి అణుబాంబు పేలుడు – తులసీదళం – తెలుగు పాఠక జన హృదయాల్ని
భస్మీపటలం చేసింది.
మృణాల్ సేన్ ఒక వూరి కథ, చిరంజీవి ‘మంచుపల్లకి’ సినిమాలకి సంభాషణలు రాశారు. మెగాహిట్ జగదేకవీరుడు అతిలోకసుందరికి స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడు చిరంజీవి ‘మృగరాజు’ కి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 1996 పడమటి కోయిల పల్లవి’ గేయ సంకలనం ప్రచురించారు. దూరదర్శన్లో వచ్చిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ సీరియల్కి తానే దర్శకత్వం వహించి, 1997 లో ఉత్తమ దర్శకునిగా ‘నంది’ అవార్డు పొందారు. ‘విజయానికి అయిదుమెట్లు’ తో వ్యక్తిత్వ వికాసం వైపు మొగ్గారు. నవల్సూ, సీరియళ్ళూ పక్కన పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రధానాంశంగా ‘MINDPOWER’ – నంబర్ వన్ అవ్వడం ఎలా? అనే పుస్తకాల పరంపర రాయడానికి సిద్ధమౌతున్నారు. వీటిని వెంటనే కన్నడంలోకి అనువదించి, విడుదల చేయడానికి నవసాహితి బుక్ హౌస్ ఏర్పాట్లు చేసింది.
ఘోస్టు రచయితల్ని పెంచి పోషించారన్నది పాత ఆరోపణ. ‘జ్యోతి’ వ్యవహారంతో సహా యండమూరికి వివాదాలేమీ కొత్తకాదు. గ్రంథ చౌర్యం అన్నది మాత్రం ఆషామాషీ విషయం కాదు.
కాకినాడకు చెందిన యండమూరి ఆంధ్ర, కర్నాటకల్లో పెద్దరచయిత. తమిళంలో తెలిసో తెలియకో తెలీదుగానీ-స్టార్‌ రైటర్. మళయాళంలో
వీరేంద్రనాథ్ వి నాలుగు నవలలు వచ్చాయి.
కథ, నవల, సీరియల్, కవిత్వం, నాటిక, నాటకం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంభాషణలు -యిన్ని రంగాల్లో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన తెలుగు రచయితలు అరుదు.
విజయశిఖరం మీద నిలిచిన వివాదాస్పద ప్రతిభామూర్తి వీరేంద్రనాథ్

అత‌నికి శిక్ష ప‌డాలి
నా డ‌బ్బు నాకు రావాలి

యద్దనపూడి సులోచనారాణి

ప్రతి తెలుగు ఇంటా తెలిసిన పేరు. పుస్తకాలు చదివే అలవాటుని విపరీతంగా పెంచిన రచయిత్రి. తెలుగు యువతీ యువకుల్ని పాతికేళ్ళపాటు తన కథలు, నవలలతో ప్రభావితం చేసి, కొండొకచో పిచ్చివాళ్ళనూ చేసి రాణించిన ఘటికురాలు. తన ఇంటి గదిలో తనమానాన తాను కూర్చుని త‌లొంచుకుని బుద్ధిగా రాసిన నవలలతో రాష్ట్రంలో ప్రేమతుఫానులు, కలల భూకంపాలు సృష్టించి ప్రతి తెలుగింటి ముంగిటా నందివర్ధనమై పరిమళించిన మహారచయిత్రి, పత్రికలూ, పబ్లిషర్లూ, సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కనకమాలక్ష్మీదేవి. ప్రేమ బెంగ పెట్టుకున్న మధ్యతరగతి ఆడపిల్లకి కలలో కైనా రాజశేఖరాన్నీ, పడవకారు పల్లకిని పంపిన స్వాప్నికురాలు సులోచనారాణి. అద్దె పుస్తకాల షాపులకీ, లెండింగ్ లైబ్రరీలకీ దైవమిచ్చిన రచయిత్రి.
అనేకమంది ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్ని పాడుచేసింది యద్దనపూడే.
సులోచనారాణి ఇప్పటికి 60 నవలలూ. 30 కథలు రాశారు. ఆగమనం, ఋతురాగాలూ
టీవీ సీరియల్స్ ప్రజాదరణ పొందాయి.

ఏ న‌వల Magnum opus? అనడిగితే, “అన్నీ యిష్టంలో రాస్తాను. నాకన్నీ ఒక్కలాగే వుంటాయి” అని విన‌యంగా చెప్పారు. మార్చి 24 హైదరాబాద్ సోమాజిగూడలోని తన యింట్లో విజయవిహారం’ ప్రతినిధి తాడి ప్ర‌కాశ్‌కి సులోచనారాణి ఇంటర్వ్యూ యిస్తూ “రేపు అమెరికా వెళ్తున్నాను. అక్కడ మా అమ్మాయి వుంది. అయిదునెలలు
అక్కడే ఉంటాను” అని చెప్పారు.

తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఈ రచయిత్రి పుస్తకాలు 26 కి పైగా తమిళంలోకి అనువాదం అయ్యాయని, పైగా వాటిని సుశీల కనకదుర్గ, యండమూరి వీరేంద్రనాథ్‌ రాసినట్టుగా వాళ్ళ పేర్లతో వెలువడ్డాయని తెలిసి సులోచనారాణి అవాక్కయ్యారు. విషయం తెలిసిన సంవత్సరం తర్వాత ఈ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం కావాలని కోరుతూ ఆమె కోర్టుకి ఎక్కబోతున్నారు.
ఆ సందర్భంగా యుద్దనపూడి మాట్లాడుతూ, “తలొంచుకుని నా పనేదో నేచేసుకుపోయేదాన్ని వూరుకుంటే చాతగాని తనం అవుతుంది.
సాహిత్యానికి చీడపట్టినట్టు అనిపించింది. ఈ అంశంపై పోరాడటం నా బాధ్యత ఆనుకున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ తానే వచ్చి చెపుతాడేమోనని Expect చేశాను. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. కొంచెం కూడా
నన్ను care చేయలేదు.

ప్ర‌కాశ్: ఏ ఉద్దేశంతో మీరీపని చేస్తున్నారు?
(కేసు పెట్టడం గురించి)
య‌ద్ద‌న‌పూడి: తప్పంతా బయట పడాలి.
చేసిన వాళ్ళకు శిక్షపడాలి.

ప్ర‌కాశ్: మీ లక్ష్యం ?

య‌ద్ద‌న‌పూడి:న్యాయం జరగాలి. ఆ పుస్తకాలు నావి. అలా చేసినందుకు శిక్షపడాలి.

ప్ర‌కాశ్: పారితోషికంగా రావాల్సిన డబ్బుమీకు అవసరం లేదా?

య‌ద్ద‌న‌పూడి: నా డబ్బు నాకు రావాలి. తప్పుచేసిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి.

ప్ర‌కాశ్: అలా క్షమాపణ చెపితే మీడబ్బు మీరు వదులుకోడానికి సిద్ధంగా వున్నారా?

య‌ద్ద‌న‌పూడి: నో, అది నా కష్టార్జితం.

ప్ర‌కాశ్: మీ అనుమతితో మీ పుస్తకాలేమైనా తమిళంలో వస్తున్నాయా?

య‌ద్ద‌న‌పూడి:’జీవన తరంగాలు’ నవలను గౌరీ కృష్ణానంద అనువదించారు. నాకు రెమ్యునరేషన్ కూడా పంపించారు.

ప్ర‌కాశ్:మీ నవలల్ని తమిళంలోకి యండమూరే అనువ‌దింపజేశార‌న‌డానికి మీ దగ్గర రుజువులున్నాయా?

య‌ద్ద‌న‌పూడి: నా పుస్తకాలు, యండమూరి పేరుతో తమిళంలో అచ్చయ్యాయి.
ఆయన్నే prove చేసుకోమనండి.

ప్ర‌కాశ్: మీ నవలల్ని తన పేరుతో వేసుకోవాల్సిన అవసరం యండమూరికి వుందంటారా?

య‌ద్ద‌న‌పూడి: అతని అవసరం ఏంటో మాకు తెలీదు. అతను ఇన్నోసెంట్ అయితే ఆ విషయం పబ్లిక్ గా ఎందుకు చెప్ప‌డు? తెలుగు సాహిత్యంలో ఎన్నడూ యిలా జరగలేదు. యిదే మొదటిసారి, పిచ్చి స్టేట్ మెంట్లు యిచ్చి అతనే యిదంతా కొని తెచ్చుకున్నాడు. అతనే గనక తప్పు ఒప్పుకుంటే, రచయితలంతా కలిసి ఎలా డిసైడ్ చేసేవారో మరి?

*** *** ***

ఈ సీరియల్ మొత్తం నాలుగు పార్టులు.

రేపు: కొమ్మనాపల్లి కంప్లయింట్.

ఎల్లుండి: 1. కనకదుర్గ ఎవరు?
2. సూర్యదేవర ఫిర్యాదు.

తర్వాత రోజు: యండమూరి ఎదురుదాడి, ఇంటర్వ్యూ

– తాడి ప్రకాష్, 97045 41559

Yaddanapudi vs Yendamuri

Share.

Leave A Reply