వలస కార్మికులకు శ్రీసిటీ చేయూత

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీ నుంచి జార్ఖండ్ పయనమైన వలస కార్మికులు – 380 మంది ప్రత్యేక బస్సుల్లో తరలింపు 

శ్రీసిటీలోని జార్ఖండ్ కు చెందిన 380 మంది వలస కార్మికులు గురువారం తమ స్వస్థలాలకు తరలివెళ్లారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శ్రీసిటీ యాజమాన్యం వీరికి వైద్య పరీక్షలు, ఇతర ఏర్పాట్లు చేసి, ప్రత్యేక బస్సులలో శ్రీసిటీ నుంచి చిత్తూరుకు తరలించింది. అక్కడనుంచి వారు  జార్ఖండుకు ప్రత్యేక రైలులో వెళ్లనున్నారు. వివిధ పరిశ్రమల నిర్మాణ పనుల నిమిత్తం పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది కార్మికులు శ్రీసిటీలో వుంటూ వచ్చారు. కరోనా లాక్-డౌన్ నేపథ్యంలో నిర్మాణ పనులు ఆగిపోయినప్పటికీ, శ్రీసిటీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధతో వారందరికీ బస, భోజన ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుతం లాక్-డౌన్ సడలింపులతో నిర్మాణ పనులకు అనుమతులున్నా, కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు మొగ్గుచూపడంతో వారిని సాగనంపేందుకు శ్రీసిటీ చొరవ తీసుకుంది. కార్మికులు పనిచేస్తున్న ఆయా కాంట్రాక్టు సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బదులుకు తలెత్తకుండా కార్మికులకు పాసులు ఏర్పాటు చేసి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒరిస్సా, బీహార్, మరికొన్ని రాష్ట్రాలకు చెందిన కార్మికులను తరలించగా, గురువారం జార్ఖండ్ వాసులను సాగనంపారు. వారికి మార్గమధ్యంలో అవసరమైన భోజనం, త్రాగు నీరు బ్యాటళ్లు ఇతర సామగ్రి కూడా అందచేశారు. ఇక శ్రీసిటీ ప్రాంతంలో మిగిలివున్న సుమారు 200 మంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కార్మికులను కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు శ్రీసిటీ సెక్యూరిటీ ఇంచార్జి రమేష్ తెలిపారు.  


వలస కార్మికులు సురక్షితంగా తమ స్వస్థలాలకు తరలివెళ్లడం పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వారిని తరలించేందుకు సహకరించిన ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా రెవిన్యూ, పోలీసు అధికారులకు, ఇందుకోసం శ్రమించిన శ్రీసిటీ సెక్యూరిటీ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  (D. Ravi )

Share.

Leave A Reply