తెలుగు మీడియాలో ఒక విచిత్ర సంప్రదాయం ఉంది. ఒక పత్రిక చేసిన అరుదైన అద్భుతాన్ని మరో పత్రిక రాయదు. సమాజానికి పనికొచ్చే ఎంత గొప్ప మానవీయ కథనం అయినా సరే పట్టించుకోరు. దీనికి భిన్నంగా రూరల్ మీడియా ఈ కథనం అందిస్తోంది.
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ దిన పత్రికలో అతనో ఫొటోగ్రాఫర్. ప్రతీ రోజు డెస్క్ ఇన్ ఛార్జి ఎసైన్ చేసిన ప్రెస్ మీట్లకు వెళ్లి ఫొటోలు తీయడం ఆయన రొటీన్ వర్క్. దీనితో పాటు సమాజాన్ని పరిశీలించడం కూడా జర్నలిజంలో భాగం అని ఆయన భావిస్తాడు.
ఉద్యోగ విధుల్లో భాగంగా తిరగుతున్నపుడు గుడిమల్కాపూర్ ,నవోదయ కాలనీ లోని ఒక ప్రభుత్వ బడి దగ్గర దృశ్యం అతన్ని ఆకట్టుకుంది. వెంటనే కెమేరా తో క్లిక్ మనిపించి ఆఫీసుకెళ్లి ఎడిటోరియల్ ముందుంచాడు.


ఆకలి తీరే దారి లేక, పూటకు పట్టెడన్నం కోసం ఆ చిట్టితల్లి మధ్యాహ్న భోజనం కోసం క్లాసు రూమ్ దగ్గర ఆశగా చూస్తున్న ఆ దృశ్యంలోని మానవీయ కోణం పట్టుకున్న ఒక సబ్ ఎడిటర్ సందర్భాన్ని క్యాష్షన్ గా రాసి ‘ఆకలి చూపు’ శీర్షిక పెట్టి మర్నాటి పత్రిక(7.11.2019 )లో పబ్లిష్ చేశారు.
ఆ ఫొటో సమాజాన్ని కదలించింది. సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ గా మారింది.
ఎమ్వీ ఫౌండేషన్‌కి చెందిన ఆర్. వెంకట్ రెడ్డి , విద్యాశాఖ అధికారుల సాయంతో, ఆపాప(మోతి దివ్య )ను అదే రోజు అదే గుడిమల్కాపూర్ స్కూల్లో జాయిన్ చేశారు. వెంకట్ రెడ్డి ఎమ్వీ ఫౌండేషన్ ద్వారా బాలకార్మిక నిర్మూలన,బాల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ విద్య సంస్కరణల కోసం వేసిన కమిటీలో ఆయన సభ్యులు.
” దివ్య బడి ముందు భోజనం కోసం నిలబడిన ఫోటో సంచలనం చేసిన విషయం తెలిసిందే. దివ్య తన రెండవ రోజు బడి ముగించుకొని హాయిగా తోటి పిల్లలతో ఆడుకుంటుంది. బడికి పోయిన అని సంతోషంగా చెప్పింది. మధ్యాన్నం భోజనం గుడ్డు, అన్నం ,పప్పు తిన్న అని సంతోషంగా చెప్పింది. ఎప్పుడో అమ్మ తెచ్చిన బ్యాగు వేసుకొని ఆనంద పడుతుంది. దివ్య అమ్మ మమ్ములను ఆప్యాయత తో పలకరించింది ఇంటి బయట.అది ఇల్లు కాదు చిన్న ఒక రూమ్ టార్పాలిన్ షెడ్. లోపలకి రమ్మని ధైర్యం చేయలేదు. నాకు ధైర్యం చాలలేదు. తిన్నారో లేదో, వంట చేసుకున్నారొ లేదో, తెలుస్తోందని లోపలికి వెళ్ళడానికి నాకు ధైర్యం చాలా లేదు . దివ్య అమ్మ గారు మిలటరీ ఏరియాలో ఊడుస్తుంది. ఆమెకు 5000 నెలకు ఇస్తారు. పొద్దున్నే 6 గంటలకు పనికి పోతుంది. ఈమెకు కానీ, ఈమె భర్తకు కానీ బ్యాంకు అక్కౌంట్ లేదు. ఈమె పొదుపు సంఘం లో లేదు. పేదలకు, అతి.పేదలకు పొదుపు సంఘం కానీ వీళ్ళ ఆదాయం అంత అంత మాత్రమే కావున సంఘం లో స్థానం లేదని చెప్పారు ఇతర సభ్యులు. దివ్య నాన్న GHMC బండి తో దగ్గరలో ఉన్న కాలనీ లో చెత్త సేకరిస్తాడు. మిల మిల మెరిసే హైదరాబాదు నడిబొడ్డున హై టెక్ సిటీ కి కూత వేటులో ఇలాంటి కుటుంబాలు నివాసిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇంటి ఇంటి చెత్తను సేకరించి ప్రజల ను ఆరోగ్య కరంగా ఉంచుతూ, శుభ్రంగా ఉంచుతూ..వాళ్లంతా అశుభ్రమైన వాతావరణం లో ఉంటున్నందుకు, 70 ఏళ్ళ రాజ్యాంగ రచన పండుగ చేసుకుంటున్న దేశం లో తోటి పౌరులు ఇంత దయనీయ స్థితి లో చూసి తల దించు కొని బస్తి నుండి బయటకు వచ్చాను….”
అన్నారు వెంకట్ రెడ్డి .

ఆ ఫోటో గ్రాఫర్ ఎవరు?
సభ్య సమాజాన్ని కదిలించిన ఆ దృశ్యాన్ని క్లిక్ చేసిన ఫొటో గ్రాఫర్ ఆవుల శ్రీనివాస్ అని మా పరిశీలనలో తెలిసింది. ఆయన్ని ‘రూరల్ మీడియా’ ఫోన్లో పలకరించి అభినందించినపుడు,” ఇది నా వృత్తిలో భాగమే సార్. ఆ క్షణంలో ఆ దృశ్యం నా కంట పడి క్లిక్ చేశాను. ఆ తరువాత ఆ చిన్నారి గురించి తెలుసుకున్నపుడు హృదయం చలించింది. ఆ ఫొటో ఆ బిడ్డ జీవితంలో మార్పు తెచ్చిందని తెలిసినపుడు ఫొటో జర్నలిస్టుగా ఎంతో సంతృప్తిగా ఉంది.” అన్నారు వినయంగా.
” ఈ ఫోటో వెనుక వున్న భౌతిక పరిస్థితులు తెలియవు కానీ, ఆ పాప సంచార కుటుంబాలకు చెంది ఉంటుందని అనిపించింది. ఆ ఫొటోలో చేతిలో కంచం ఆకలికి ప్రతిబింబం అయితే. భోజనం సమయం కన్నా ముందో తొంగి చూస్తుండటం విద్య పట్ల ఆసక్తి . తన వయసు పిల్లలు లోపల ఏమి చేస్తున్నారో అన్న సహజ ఆసక్తి పిల్లలో కనిపించింది..” అని , సామాజిక విశ్లేషకుడు శివ రాచర్ల తన ఫేస్బుక్ వాల్ పై స్పందించారు.
నేడు మోతి దివ్య కళ్లలో ఆనందం వెల్లి విరుస్తోంది. నేనూ బడికి పోతున్నా అని తోటి పిల్లల దగ్గర గర్వంగా తలెత్తుకు తిరుగుతోంది. మధ్యాహ్నం 12 కాగానే సత్తుప్లేట్ పట్టుకొని పాఠశాల దగ్గర పడిగాపులు పడాల్సిన వెతలు తప్పాయి. రోజూ యూనీఫాం వేసుకొని, తల్లికి ముద్దు పెట్టి టాటా చెబుతూ తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ బడికి వెళ్తూంది.
ఫొటో జర్నలిజం మీద గౌరవం కలిగే సందర్భం ఇది. ఒక చిన్నారి జీవితంలోని చీకటిని తొలగించి వెలుగు కిరణాలు పూయించిన ‘ఈనాడు’ పత్రిక జర్నలిస్టులను అభినందిస్తున్నాం.