పులుల నుండి పల్లెకు కాపాడిన యువత

Google+ Pinterest LinkedIn Tumblr +

దట్టమైన కవ్వాల్‌ అడవుల మధ్య ఉన్న పల్లె మన్నెగూడ. తెల్లారగానే అడవిలోకి పోయి, వెదురు,తునికాకులు,ఇప్పపూలు సేకరించి, కట్టెలు ఏరుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం అక్కడి గిరిజనుల జీవన శైలి. వెదురుతో బుట్టలు అల్లి అమ్ముకుంటారు. ప్రతీ ఇంట్లో కోళ్లు, గొర్రెలు తప్పకుండా పెంచుతారు. ఎందుకని వారిని అడిగితే, అడివిలోంచి రాత్రుళ్లు తమ ఊరిపై పడే,జంతువుల కడుపునింపడం కోసం అంటారు. వాటి ఆకలి తీర్చక పోతే, తామే జంతువులకు ఆహారం అవ్వాల్సి వస్తుందని భయంగా, అమాయకంగా చెబుతారు. దీనికంతటికీ కారణం ఆ పల్లెకు విద్యుత్‌ లేక పోవడమే…. అని గుర్తించిన ‘అభిధ్యు’ బందం ఆ పల్లెకు అండగా నిలవాలనుకున్నారు. 

Team Abhidhyu, at Manne guda


ఆదిలాబాద్‌ జిల్లా, లక్షెట్టిపేట మండలం, అటవీ ప్రాంతంలో అసలు విద్యుత్‌ ఎలా ఉంటుందో కూడా తెలియని గ్రామం మన్నెగూడ. ముప్ఫయి 
కుటుంబాలున్నాయి. చుట్టూ చిక్కని అడవి, మధ్యలో చిన్నచిన్న పూరిళ్లు,పెంకులు లేచిన. మొండి గోడల మధ్య , ఆకాశంలోని చుక్కలు తప్ప మరో వెలుతురు తెలీకుండా బతుకుతున్నారు. విద్యుత్‌ లేక. కిరోసిన్‌ గుడ్డి దీపాలతో రాత్రులు గడుపుతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా, రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలన్నా 12 కిలో మీటర్ల దూరంలోని లక్షెట్టిపేటకు నడుచుకుంటూ పోయి,చీకటి పడకుండా ఊరికి చేరుకోవాలి. 
పులుల మధ్య బతుకుతున్నం… 
” కరెంట్‌ బల్బ్‌ ఎట్లుంటదో మాకు తెల్వదు. బిడ్డలు చదువుకోనికి లైట్లు లేవు. కనీసం బడికి పంపుదామంటే, పది కిలోమీర్లు దూరం నడిచి పోవాలె, ఈ అడవుల్లో పులులు తిరుగుతుంటాయి, చాలా సార్లు మా పశువుల పై దాడి చేసినయి. వీటి నుండి కాపాడుకోడానికి రాత్రుల్లు మంటలు వేసుకొని కాపలా కాస్తూ కూసోవాల్సి వస్తుంది. కరెంట్‌ లైట్లు ఉంటే ఈ బాధలు తప్పేవి. హైదరా బాద్‌ నుంచి, అమ్మాయిలు వచ్చి మాకు లైట్లు పెట్టిండ్రు. ఇపుడు జర కొద్దిగ వెలుగు వచ్చింది…” అని గ్రామస్తులు గంగోత్రి, పాశుబాయి, చెఫ్పారు. 


అభిధ్యు’ అంటే..? 
హైదరాబాద్‌లో కొందరు కాలేజీ విద్యార్దులు సమాజ హితం కోసం ‘అభిధ్యు’ బందం గా ఏర్పాడ్డారు. పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికకాభివద్ధి కోసం,ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఈ బందం ‘అఫెర్డబుల్‌ క్లీన్‌ ఎనర్జీ’పై అధ్యయనం చేసి, విద్యుత్‌ లేని కుగ్రామాలను గుర్తించి, సోలార్‌ దీపాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ బందం మన్నెగూడకు ముందే, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ సమీప గ్రామాల్లో సోలార్‌ దీపాలు అందించారు. 600 మంది విద్యార్ధులకు సోలార్‌ ఎనర్జీ వినియోగంపై అవగాహన కల్పించారు. మన్నెగూడలో రాత్రి వేళల్లో అడవి జంతువుల నుండి ప్రజలను కాపాడడానికి, సోలార్‌ లైట్లు ఎంతో ఉపమోగపడతాయని, అక్కడి ఇండ్లకు వాటిని అమర్చి, వాటి వినియోగాన్ని గ్రామస్తులకు వివరించారు. 

Ms. Sanjana Shukla


వెలుగుతోనే అభివృద్ధి… 
” చదువుతో పాటు సమాజ సేవ చేయాలనే తపనతో హైదరాబాద్‌ యూత్‌ అసెంబ్లీ ఏర్పాటయింది. దానిలో భాగమైన అభిధ్యు సంస్ధ ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నాం. మారు మూలపల్లెలో కనీస మౌలిక మవతులు మెరుగైనపుడే అబివృద్ధి జరుగుతుంది. అడవి మధ్య బతుకుతున్న అమాయక గిరిజనుల ఇళ్లకు కరెంట్‌ లేదని తెలిసి , వారికి సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశాం. వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పించాం. మన్నెగూడలోని 25 గిరిజన కుటుంబాలకు ప్రతి ఇంటికీ 4 సోలార్‌ లైట్లతో పాటు సోలార్‌ ప్యానెళ్లను అమర్చాం. ప్రతి బల్బు 6 వాట్స్‌ సామర్థ్యంతో సుమారుగా 12 గంటల పాటు వెలుతురు ఇస్తుంది.” అని అభిధ్యు బందం వైస్‌ చైర్మన్‌ సంజన శుక్లా అన్నారు. 
ఆమెతో పాటు ఈ టీంలో సుమన్‌, రెన్నీ ఛార్లెస్‌, రాజేశ్వరీ,శాశంక్‌,తేజస్వీని, ఐశ్వర్య,ప్రణవ్‌,శ్రేయ,లిఖిత, ఆదర్శ్‌, అభినవ్‌, పధ్వీ సేవలు అందిస్తున్నారు. వీరంతా వివిధ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. 
” విద్యుత్‌ లేక పోవడం వల్ల ఈ గ్రామం అభివద్ధిచెందడం లేదు.పిల్లల చదువుకు దూరమవుతున్నారు. దోమల వల్ల వ్యాధులకు లోనవుతున్నారు. సమీపంలో కరెంట్‌ ఉన్నప్పటికీ ఈ కుగ్రామానికి కరెంట్‌ లైన్‌ ఇవ్వడం లేదు. అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల అటవీశాఖ అనుమతి కావాలని విద్యుత్‌ శాఖ అంటోంది. తరతరాలుగా వీరు చీకట్లోనే మగ్గుతున్నారు. ‘అభిధ్యు’ వారు ఇంటికి లైట్లు ఇచ్చారు. కనీసం రెండు వీధి లైట్లు ఉంటే కొంత రక్షణ ఉంటుంది” అన్నారు, ఇక్కడ పమీపంలో తళ్లమల్లకు గ్రామానికి చెందిన రామ్‌కిషన్‌ . 
కిరోసిన్‌ దీపాల కంటే ఎక్కువ కాంతి 
” సౌర దీపాల నిర్వహణకు పైసా ఖర్చుండదు. ఛార్జింగ్‌ పూర్తిగా ఉంటే రోజుకు ఏడెనిమిది గంటలపాటు నిర్విరామంగా వెలుగునిస్తాయి. కిరోసిన్‌ దీపాల కంటే ఎక్కువ కాంతిని ఇస్తాయి. వీటికి చిన్న రిపేర్లు వస్తే బాగు చేసుకోవడానికి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. గిరిజన పల్లెలకు సోలారు వెలుతురు రావడంతో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.ఇక్కడే కాదు, విశాఖ మన్యం ప్రాంతంలో 150 పల్లెలకు సోలార్‌ లైట్లు ఇచ్చాం. వారు అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నారు.” అన్నారు ఈ సోలారు లైట్లను తయారు చేసిన ధ్రైవ్‌ సోలార్‌ ఎనర్జీ సంస్ధ అధినేత రంగనాయకులు . 

చీకటి అనేది ఊహకు అందనంత పెద్ద సామాజిక సమస్య… గుడ్డిదీపాల్లో చమురు కోసం… కాయకష్టంతో సంపాదించిన దాన్లో కొంత కిరోసిన్‌ కోసమే ఖర్చయితే ఇక బతికేదెలా? కిరోసిన్‌ కొనడానికి 12 కిలోమీటర్లు నడిచివెళ్లి నెత్తిమీద మోసుకుంటూ తెచ్చుకునేవారు… ఇలాంటి మన్నెగూడ గిరిజనులకు సోలార్‌ లైట్లు కొంత ధైర్యాన్నిచ్చాయి. గేదెపాలు తీసుకోవడానికి, అడవి వైపు పోయిరావడానికి, వంట పనిచేసుకోవడానికి, పిల్లల చదువుకు, గ్రామ సభలు జరుపుకోవడానికి సౌరదీపాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి… ఇలా కొన్ని గంటలు వెలిగే సౌరదీపాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతున్నాయి. 
………………………………………… 
… శ్యాంమోహన్‌(9440595858) 

Share.

Leave A Reply