ఆ కార్టూనిస్ట్ పై ఎన్టీఆర్ భార్య ఎందుకు ఫైర్ అయ్యారు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయవాడ, బందర్ రోడ్లో ఆకాశమంత గొడుగులా విస్తరించిన రావి చెట్టు ఎదురుగా విశాల మైన భవనంలో రెండోఫ్లోర్లో ఏసీ రూమ్ లో కూర్చొని సుఖంగా ఎడిటోరియల్ రాసుకోవాల్సిన నండూరి రామ్మోహనరావు గారు…. జిల్లా కోర్టులో హడావడిగా తిరుగుతున్న నల్ల కోటుల మధ్య ముక్కుకు తెల్ల ఖర్చీప్ పెట్టుకొని అసహనంగా తచ్చాడుతున్నాడు. రెండు గంటల వెయిటింగ్ తరువాత కోర్ట్ బండ్రోతు పిలిస్తే, వెళ్లి జడ్జి ముందు తలొంచుకొని నిలబడ్డాడు. ఎప్పటి లాగే కేసు వాయిదా పడింది.ఇలా నెలకు రెండు సార్లు ఏడాదిగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు

……………………………….

ఒక మధ్యాహ్నం, ఆంధ్రజ్యోతి క్యాంటీన్లో నాకిష్టమైన మైసూర్ బజ్జిని రుచి చూస్తుంటే.. అటెండర్ రాజు వచ్చి, ‘‘ ఎడిటర్ గారు పిలుస్తున్నారు.’’ అని కొంటె గా చూసాడు.

…………………………….

ఎడిటర్ రూమ్ కి ఎపుడు వెళ్లినా ఆహ్లాదంగా ఉంటుంది. ఒక పద్దతిగా రాక్ లో పుస్తకాలు సర్ది ఉంటాయి. ఆయన చదువుతున్న, ‘‘ లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఆఫ్ జర్నలిజం’’ అనే బుక్ పక్కన పెట్టి … ‘‘ కార్టూన్ లు వేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏడాది క్రితం మీరు మతం.. మత్తు అంటూ వేసిన కార్టూన్ మీద ఆరెస్స్ స్ వాళ్లు కేసు పెట్టారు. మీరు పనిలో డిస్ట్రబ్ అవుతారని ఇప్పటి వరకు చెప్ప లేదు. ఎడిటర్ గా బాధ్యత నాది కాబట్టి, కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. జడ్జిగారు సెక్యులరిస్ట్ అనుకుంటా, మన మీద దయతో ఈ రోజు కేసు కొట్టేశాడు. లేక పోతే ఇద్దరం జైలు లో కూర్చునే వాళ్లం !! ’’ అని కూల్ గా అన్నాడు. నండూరి గారిలో ఎన్నడూ ఆగ్రహం చూడ లేదు. అప్పుడు కూడా!!

………………..

రాజస్ధాన్, మౌంట్ ఆబూ లో ఒక వెన్నెల రాత్రి. కాకర కాయ వేపుడుతో పూరీల డిన్నర్ అయ్యాక, పచ్చని గార్డెన్ లో నందమూరి లక్ష్మీ పార్వతితో కలిసి నలుగురు జర్నలిస్టులం నడుస్తున్నాం. ఆమె ఉల్లాసంగా కబుర్లు చెబుతున్నారు. మా అందరి వివరాలు అడుగుతూ, నా వైపు చూశారు. పేరు చెప్పాను…ఆమె ఒక్క సారి గా సీరియస్గా మారి పోయారు.‘‘ ఆ దుర్మార్గుడివి నువ్వేనా … ఎన్టీఆర్ నేను దీపావళి చేసుకుంటూ, బాబును తారాజువ్వకు కట్టి పైకి వదులుతున్న కార్టూన్ వేసింది నువ్వేకదా… కనీసం మహిళ అని చూడకుండా జ్యోతిలో నీచమైన కార్టూన్లు వేశారు కదా…!! ’’ అని గతాన్ని తలచి, బాధ పడింది . ‘‘ అదేం కాదు పార్వతమ్మా… నా బుర్రలో మా ఎడిటర్ దూరి కార్టూన్ ఎలా వేయాలో చెబుతాడు… నేను కూడా బతకాలి కదా…’’ అని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాను. …………………….

కావున… సమస్త మేధావులకు, కత్తులు దువ్వు తున్న కళా వీరులకు , వెర్రి పాఠకులకు తెలియ చేయునది ఏమనగా … కళ, కాకరకాయ, స్వేచ్చ.. లాంటి తొక్కలో కబుర్లు చెప్పకండి. వినకండి.వెన్నుముక లేని జీవుల్లో తెలుగు కార్టూనిస్టుల తెగ కూడా ఉంది. వాడు ఏ పత్రికలో పనిచేస్తే , అక్కడ పెంపుడు జంతువు లా బతకాలి . కాదని పిచ్చి వేషాలు వేస్తే , బతుకు బాబా సాహెబ్ అంబెడ్కర్ కారి కేచర్ అవుతుంది. !! -Shyammohan

Share.

Leave A Reply