‘సెర్ప్’ శిక్షణలో 92 లక్షల మహిళలు …

Google+ Pinterest LinkedIn Tumblr +

 92 లక్షల మంది స్వయం సహాయ సభ్యులకు

  సెర్ప్ శిక్షణ

రాష్ట్రంలోని స్వయం సహాయ బృందాలకు ‘సెర్ప్’ శుక్రవారం (8.12.17) నుంచి విస్తృత స్థాయిలో శిక్షణా తరగతులు  ప్రారంభిస్తున్నది. గ్రామ స్థాయిలో  వున్నగ్రూపు సభ్యులు నుంచి గ్రామ సంఘ సభ్యులు, మండల సమాఖ్య సభ్యులు, జిల్లా సమాఖ్య సభ్యులు ఇలా అన్ని స్థాయిల్లో ఈ శిక్షణా తరగతులు 2018 మార్చి చివరి వరకు నిర్వహించడానికి  ‘సెర్ప్’ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసింది. ప్రస్తుతం 9,10,937 స్వయం సహాయ బృందాల్లో 92.19 లక్షల మంది సభ్యులు వున్నారు. వీరిలో 72 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో వున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నెలకొన్న సందిగ్ద పరిస్థితులలో వీటి పనితీరుపై పర్యవేక్షణ కొరవడిన కారణంగా వీటి క్రియాశీలత కొంత మేర తగ్గింది, దానితో తిరిగి వీటి పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ  చర్యలు చేపట్టినట్లు సంస్థ సి.ఇ.ఒ. డా. పి. కృష్ణ మోహన్ తెలిపారు.

గ్రామీణ మహిళలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సభ్యులుగా నమోదు అయ్యే విధానంలో ఏర్పడే సంఘాలు కనుక, జి.ఓ. లు జారీ చేసే ప్రభుత్వ విధానంలో కాకుండా ఒక  ఎన్.జి.ఓ. తరహ విధానంతో ఆరంభం నుంచి ఈ బృందాలు పని చేస్తున్నాయి. కాగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక మారిన పరిస్థితుల్లో తిరిగి పాటవ నిర్మాణానికి (capacity building) మరో విడత శిక్షణ  ‘సెర్ప్’  చేపట్టింది. ఈ బృందాలకు ఇచ్చే శిక్షణలో మొదటి నుంచి సంస్థాగత నిర్మాణం (institution building) ప్రధానమైనది. దీని ప్రాతిపదికనే ఈ సంఘాలు పనిచేస్తాయి. అయితే ఇవి పనిచేయడం మొదలై ఇరవై ఏళ్ళు అవుతున్నదశలో సభ్యత్వ నమోదు, గ్రూపుగా ఏర్పడ్డం వంటి ప్రాధమిక స్థాయి అంశాలు ఇప్పుడు కొత్తగా సభ్యులుగా వస్తున్న యువ తరానికి తెలిసిన విషయమే. కాగా ఇటీవల కాలంలో అన్ని చోట్ల పనితీరుకు గ్రేడింగ్ విధానం అమలులోకి రావడంతో ఈ గ్రూపుల పనితీరుకు కూడా కొంతకాలంగా ‘సెర్ప్’ గ్రేడింగ్ విధానాన్ని అవలంబిస్తున్నది. దాంతో ఇప్పటి పరిస్థితులకు కావాల్సిన పాటవ నిర్మాణానికి అనువైన రీతిలో ఈ శిక్షణా తరగతులు రూపొందిస్తున్నారు.

 SERP training for 92lakhs women

SERP training for 92lakhs women

అంటే కాకుండా ఇటీవలి కాలంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలు చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ పధకాలు గురించిన ప్రాధమిక సమాచారం కూడా ఈ తరగతుల్లో వుంటుంది. 92 లక్షల మంది పైగా సభ్యత్వంతో విస్తృతమైన ‘నెట్ వర్క్’ తో గ్రామీణ ప్రజలతో నేరుగా సంబంధం వుండడతో, రాష్ట్ర స్థాయిలో ‘సెర్ప్’ జిల్లాల్లో ‘వెలుగు’ ప్రాజెక్టులకు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు, అసంఘటిత రంగ కార్మికుల ఇన్సూరెన్స్ క్లెయింలు చెల్లింపు అప్పగించింది. ఇందుకు జిల్లాల్లో ‘కాల్ సెంటర్లు’ పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా వీరు ‘బీమా మిత్ర’ , ‘బ్యాంకు మిత్ర’, ‘డిజిటల్ సాథీ’ వంటి పలు కొత్త విధులు గౌరవ వేతనం పై చేస్తున్నారు. ఇవి కాకుండా ‘స్త్రీ నిధి’ బ్యాంకు అప్పులు, చెల్లింపులు, పండ్ల మొక్కల పెంకం, మరుగు దొడ్ల నిర్మాణం, వంటి గ్రామీణ అభివృద్ధి శాఖ పధకాలు అమలు ఇప్పుడు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ల మీద పనిచేస్తున్నాయి. వీటి అమలు, జాప్యానికి కారణాలు, అందులో ఎదురవుతున్న సమస్యలు, ఇవన్ని ట్యాబ్ ద్వార రోజు వారీ డిజిటల్ అప్ లోడ్ పద్దతిలో నమోదు అవుతున్నాయి. దాంతో వీటి వాడకం గురించిన ప్రాధమిక పరిజ్ఞానం సభ్యలకు అవసరమవుతున్నది.

ఇవే కాకుండా రాష్ట్రంలో వర్షాధార సాగు, ఎస్సీ,ఎస్టీ జనాభా, స్త్రీ నిరక్ష్యరాస్యత అధికంగా వున్న 150 మండలాల్లో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ  సమ్మిళిత వృద్ది పధకం అమలు అవుతున్నది. వీటిలో సాగుబడితో పాటు, ‘రూరల్ రిటైల్ చెయిన్’, గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల కోసం ‘వన్ స్టాప్ షాప్’, వంటి కొత్త కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటి  అమలు పర్యవేక్షణ కొరకు బ్యాంకు ప్రతినిధి ఒకరు స్వయంగా ‘సెర్ప్’ కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలయిన ప్రయోగాలను (best practises) టాటా ట్రస్ట్ మరికొన్ని కన్సల్టేన్సీలు ఇక్కడ ప్రయోగాత్మంగా పరిచయం చేస్తూ ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం గ్రామీణ మహిళల పాటవ నిర్మాణానికి ప్రయోజనకరం కానుంది.

Share.

Leave A Reply