‘ప్రతి గొట్టంగాడూ చే ఫొటో పెట్టుకోవడమే’

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈస్తటిక్‌ రచయిత, కవి, ఏ రాజకీయానికి లొంగని ఈ తరం జర్నలిస్టు, సెన్షేషనల్‌ ‘టీవీ9’ కి ఊపిరి పోసి, గుత్తాధిపత్యపు మీడియాను పరుగులు పెట్టించిన పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌. 2016లో ఈ లోకానికి దూరమైనా, నిప్పుకణికలు వంటి అతడి రచనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. సమకాలీన రాజకీయాలపై, 2015లో అరుణ్‌ ఆవిష్కరించిన భవిష్యత్‌ చిత్రపటం లాంటి రచన ఇపుడు వాస్తవం కావడం తెలుగు పాత్రికేయంలో ఒక అరుదైన ముచ్చట. ఆనాడు అరుణ్‌ సాగర్‌ ‘ప్రతి గొట్టంగాడూ చే ఫొటో పెట్టుకోవడమే’ అంటూ,
తన ఫేస్‌బుక్‌ గోడ మీద రాసిన ఆ పోస్ట్‌ అప్పట్లో ఒక సంచలనం.
ఇపుడు తిరుగు లేని నిజం !!
ఒక సారి చదవండి, తాజాగా రాసినట్టుంటుంది. మరో సారి చదవుకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు…
అరుణ్‌ పోస్ట్‌ యధాతదంగా …

ఒకటో నెంబర్‌ హెచ్చరిక

” డియర్‌ చే. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికీ కొత్తగా పరిచయమవుతావనీ, నువ్వు కొన్ని కొత్త హ దయాలను వెలిగిస్తావని , నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం.
ఇప్పుడిక తాటతీస్తాం.
ఎన్ని మాటలు గురూ రెండున్నర గంటలపాటూ టేకులూ రీటేకులూ లేని నటనావైదుష్యం. యాడికెల్లొస్తారు గురూ. వీళ్లు మనల్ని ఏమనుకుంటారు. పాపం చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా, రౌండుగా ఒక చక్రంలో చిక్కుకున్న ఆ ప్రదేశముందే అదేవారి ఆకాశం. ఆ పదడుగుల నీరే ఆవాసం. పైగా చేగువేరా బొమ్మొకొటి.
ఎగిరితన్నేవాడు లేకపోతే సరి.
ఒక పార్టీ దానికో విధానం. దానికో పుస్తకం. పర్యావరణం కోసం పాటు పడతాం. రాష్ట్ర ఆవిర్భావం తప్ప వేరే పండగలు జరుపుకోం. అందరూ మంచిగా ఉండేలా సమాజాన్ని మారుస్తాం. వైద్యం అందరికీ సమానంగా అందిస్తాం. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూస్తాం. పర్యావరణ పరి రక్షణకు పాటుపడతాం. అయిందా? ఇంకేమైనా ఉందా. ఉండ దులే. చిన్న మెదడు తప్ప పెద్ద మెదడు ఉండే అవకాశమే లేని చోట ఇంతకంటే గొప్ప ఆశయాలు ఏముంటాయి. ఇవి తప్ప గొప్ప విధానాలు ఉంటాయనే ఆలోచన మాత్రం ఎలా వస్తుంది. చీకటి బుర్రలో ప్రమిద వెలగించాలన్నా కొంచెం ప్లేసుండాలి కదరా అన్నయా. పార్టీ విధానమంటే ఏం చేస్తామో చెప్పడం కాదురా బై … ఎలా చేస్తామో చెప్పడం. ప్రశ్నించడానికే పుట్టాం. కానీ, ప్రశ్నించాల్సినవేమీ ప్రశ్నించం. కన్వీనియంట్‌గా ఉండే ప్రశ్నల్నే వేస్తాం. బై దివే మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం.

కానీ, గురూ పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? చీపురు పట్టుకుని రోడ్లు ఊడవడమూ, హుసేన్‌సాగర్‌ డ్రెడ్జింగ్‌కు బడ్జెట్‌లకై పోరాడటమా. లేక ప్లాస్టిక్‌ నిషేధమా. కొందరు సినిమా డైరెక్టర్లను వేదిక ఎక్కించి ఎర్త్‌ అవర్‌ పాటించడమా. వర్ధమాన దేశాల నీటినీ, గాలినీ, నేలనీ, ఆవరణాన్ని ధ్వంసం చేస్తున్న దోపిడీ రూపాలేంటో కప్పలకు ఎలా తెలుస్తుంది? జెనీవాకు వియన్నాకు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్లి నిరసన ప్రదర్శనలతో దేశం కాని దేశంలో ఎందుకు అరెస్టయి జీవితాలు త్యాగం చేసుకుంటారో వీళ్లకు ఎలా అర్థమవుతుంది. చే గువేరా బొమ్మ పెట్టుకున్నంత మాత్రానే అర్థమైపోతుందా. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడట మంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటమని వీళ్లకు ఎవరు చెబుతారు.
పర్యావరణ రక్షణంట! పర్యావరణ రక్షణ!
మంచి సమాజం, అందరూ సమానం. ఎన్నెన్ని ఐడియల్స్‌ గురూ ఎంత వీజీ గురూ. పార్టీ విధానమంటే స్లోగన్‌ కాదురా నాయనా ఆచరణ అనీ దానికీ ఒక ప్రణాళిక,
కార్యక్రమం ఉంటాయనీ ఎలా చెప్పాలితనికి. పైగా తిలక్‌ కవిత్వం ఎవడో రాసిస్తే చదివేసి, గద్దర్‌ పాట అర్థం తెలియకుండా పాడేసి!
ముందిది చెప్పు – ఈ దేశంలో పేదరికానికీ అసమానతలకూ అన్యాయాలకు కారణాలేవనుకుంటున్నావో చెప్పు.
తెలంగాణ పోరాటం ఎందుకు జరిగిందనుకుంటున్నావో చెప్పు. అసలు నీకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమేమున్నాయో తెలుసా. ముల్కీ అనే మాట విన్నావా.
తొక్కలో డైలాగులు నాలుగు విసిరి ఎంటర్‌టైన్‌ చేసేస్తే నీ అజ్ఞానానికి మేకప్‌ వేసినట్టేనని భ్రమపడుతున్నావా!
అంబానీల అడ్డగోలు దోపిడీకి అన్ని గేట్లూ ఎత్తేయడానికి సిద్ధపడ్డ వాడిని నెత్తిన పెట్టుకుని అందరూ సమానమయ్యే సమాజం గురించి విధాన ప్రకటన చేస్తున్నవే
– మా చెవిలో ఏమైనా కమలం పూవులు కనిపిస్తున్నాయా.

సరే కానీ గురూ, ఇవన్నీ పక్కనపెట్టు నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రివాళ్లు చేసే పనే. కానీ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్‌ అన్సారీ ఎవరో తెలుసా? ఫేస్‌ ఆఫ్‌ గుజరాత్‌ రాయిట్స్‌ను నువ్వు గుర్తు పట్టగలవా. గర్భిణుల కడుపులు చీల్చి, కుటుంబాలకు కుటుంబాలను ఇళ్లల్లో తలుపులు వేసి బంధించి సజీవ దహనాలు చేసి, వీధిలో, బడిలో, బేకరీలో కత్తులు, గొడ్డళ్లు, త్రిశూలాలు చేతబట్టి వెంటాడి వేటాడి నెత్తురు పారించిన రక్తపు వాసన నీ ముక్కుకు తెలుసా… ?

బాసూ నువ్వింత నాటకం ఆడకుంటే బాగుండేది. సామాన్యుడు, సామాన్యుడు అంటూ దొంగ జపం చేస్తూ ఇన్ని కోట్ల ఖర్చుతో హైటెక్‌ పార్టీ లాంఛ్‌ చేయకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు వేస్ట్‌ చేశావు. సొమ్ము నీది కాదు కాబట్టి పెద్ద ఫరకేం పడదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు. నీ డైరెక్టర్‌ ఫాల్టది.
పిచ్చి జనులు కాదు గురూ పచ్చి నాటకాలను కూడా కచ్చితంగా పసిగట్టగల చైతన్యశీలురు. నీ వినోదాత్మక ప్రసంగంలోనే కనిపెట్టారు.
నీ ముందూ వెనుకా నిన్ను నడిపించే శక్తులెవరో, ఈ కార్పొరేట్‌ రాజకీయ క్రీడలో నీ స్పాన్సర్లెవరో జనం సులభంగా గ్రహించారు.

చరిత్రలో ఇది మామూలే. పెట్టుబడి వేసే ఎత్తుగడల్లో భాగంగా చాలామంది శిఖండులు రకరకాల స్థలకాలాల్లో ఇలా అవతారాలెత్తి ఆపై పనికాగానే అలా సర్దుకుంటారు. ఇప్పుడు పెట్టుబడికి మోడీ కావాలి. అతని కోసం రకరకాల రూపాల్లో, పాత్రల్లో తెరమీదకు తోలుబొమ్మలు రావాలి. కాగల కార్యం తీర్చాలి. అలాంటి కేరక్టరే ఇది. కాకపోతే ఇది తెరమీది పాత్ర కాదు అంతే తేడా. నటనొక్కటే కామన్‌.

Arunsagar

ఎంత మోసగాడివి గురూ. మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చే గువేరా బొమ్మలు పెట్టుకున్నావ్‌, శివసాగర్‌ కవిత్వం చదివావ్‌, తిలక్‌ని కోట్‌ చేశావ్‌, కొమురం పులి సినిమా టైటిల్‌ పెట్టుకున్నావ్‌. నీ గురించి ఊహించుకున్నదొకటి నువ్వు చేసిందొకటి. అంటే ఇంతవరకూ నువ్విచ్చింది ఓ బిల్డప్‌ అన్నట్టు. పెద్ద బిల్డప్‌. బకరా బనాలియా హం కో. బద్దలైపోయింది గురూ.
నిజరూపం బట్టబయలైపోయింది గురూ. ఇదొక స్కెచ్‌. ఆ స్కెచ్‌లో నువ్వొక గీత. రెండు సినిమాలు ఫ్లాపయితే చెరిగిపోయే గీత. నీకు కూడా తెలిసిరావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీలీడరు కూడా చూడడని తెలిసే – నీ రోజు నీకుంది అన్నయ్యా.
కానీ, గురూ పొరపాటు చేశాం. ప్రతి గొట్టంగాడూ చే ఫొటో పెట్టుకోవడాన్ని చూసి ఊరుకుని పొరపాటు చేశాం.
ఆనాడే నీకేం తెలుసని అడిగుంటే, నీ జ్ఞానమేంటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడిలా మోసపోయే వాళ్లం కాదు. ఆత్మల మీద నమ్మకం లేదుగానీ, చే గువేరా బాధతో కుమిలిపోతున్నాడు. నినదించే గొంతులలో వినిపించే రూపం. నిర్బంధకాండకు ఎదురొడ్డే గుండెలపై వికసించాల్సిన చిత్రం. ఇలా అమానవీయ, మతోన్మాద, జాత్యహంకార రక్కసికి మొక్కిన వాడి చేత చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోతున్నాడు.
బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌. ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక. ముందు నీ ఇంటి గోడ మీద చే బొమ్మ తీసేరు. నీ సినిమాల్లో సెట్‌ ప్రాపర్టీల్లో చే బొమ్మను ఎడిట్‌ చేసేశారు.
నువ్వు మోడీ తీర్థం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్‌ పాట పాడుకుంటావో నీ ఇష్టం.
బట్‌. చే కి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏ మాత్రమూ లేదు. నీకే చెబుతుంది వినిపిస్తుందా? ( అరుణ్‌సాగర్‌)
Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. The facts and opinions appearing in the article do not reflect the views of  Ruralmedia and Ruralmedia  does not assume any responsibility or liability for the same

Share.

Leave A Reply