మన అమెజాన్‌, నల్లమల !!

Google+ Pinterest LinkedIn Tumblr +

తూరుపు కనుమలలో కృష్ణా , పెన్నా నదులకు మధ్యన, ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. మేర చిక్కని దట్టమైన నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాలలో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో, కొంత మేర ఈ అడవులు అల్లుకొని ఉన్నాయి. ఈ ప్రాంతంలో 3728 కి.మీ. మేర దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. పులులు సమృద్ధి గా ఉన్నఈ ప్రాంతాన్ని రాజీవ్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించారు.
అరుదైన వృక్ష ,జంతు సంపద !!
నల్లమల అడవుల్లో మారేడు, నేరేడు, ఉసిరి, కరక్కాయ, కుంకుడుకాయ, అశ్వగంధ, పిల్లితీగలు, నేలవాము, నేల ఉసిరి, గన్నేరు గడ్డలు వంటి అరుదైన మొక్కలు, శ్రీగంధం, జిట్రేగి, తెల్లమద్ది, సండ్ర వంటి వ క్షాలు..టేకు, మామిడి, సుబాబుల్‌, మద్ది, వేప, ఎగిస, బండారు, చిరంజి, తపసి, నల్లమద్ది వంటి ..కలపజాతి వ క్షాలు, రావి, మర్రి, చింత, కానుగ, రేల, బూదగ, ముల్లెంజాతి వెదురు వంటి ఇతర రకాల వృక్షాలు విస్తారంగా ఉన్నాయి.
చీతా, బెంగాల్‌ టైగర్‌, అడవి పందులు,నీలగాయ్‌, సాంబార్‌ డీర్‌, చుక్కల జింక, మౌస్‌డీర్‌, దుప్పి, ఎలుగుబంటి, అడవి కుందేలు, నక్కలు, కొండ గొర్రె మొదలైన జింకలు, రాచ ఉడతలు, చారల హైనా, రాక్‌ పైథాన్‌ , అడవి పిల్లులు వంటి జంతువులు, 80 జాతులకు పైగా పక్షులు ఉన్నాయి. ఇవే కాకుండా, నల్లమల అడవుల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. క్వార్‌జైట్‌, సాండ్‌ స్టోన్‌, యురేనియం, వజ్రాలు వంటి ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రాచీన మానవులకు ఆవాసం…
ఈ అడవుల్లో జనజీవనం చాలా తక్కువ. సుమారు 120 చెంచుపెంటలో ్ల 12 వేలకు పైగా, చెంచులు మనుగడ సాగిస్తున్నారు. ఇక్కడ చెంచుల చరిత్ర నల్లమల అడవులంత పురాతనమైంది. వలస పాలకులను చెంచులు ఎలా ఎదిరించారో మనం కథలు కథలుగా వింటాం. నిజాం నవాబుల కాలంలో అమ్రాబాద్‌ తహసీల్దార్‌ చెంచుల సభ జరిపి చెంచుల అభివృద్ది కోసం నివేదిక తయారు చేసినట్టు చరిత్రకారులు అంటారు. మానవ శాస్త్రవేత హెమన్‌డార్ఫ్‌ చెంచులను ప్రాచీనమానవులుగా గుర్తించి నల్లమలలో విస్తారంగా తిరిగి వారి రక్షణకు ప్రతిపాదనలు చేశాడు. ఈ ఆదివాసుల కోసం జీవితకాలం పనిచేసిన ఐ.ఎ.ఎస్‌ అధికారి బి.డి.శర్మ దేశానికి స్వతంత్రం వచ్చినా, ఆదివాసులకు ఇంకా రాలేదు అని ఆవేదన చెందారు.
ఇంత విస్తారంగా సహజ వనరులకు, ఔషధ సంపదకు నెలవుగా విలసిల్లుతున్న నల్లమల అభయారణ్యం లో యురేనియం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని తవ్వి వెలికితీయాలని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నిక్షేపాల వల్ల కాలుష్యం లేని అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు దేశరక్షణకు సంబంధించి అణు అవసరాలకు పరోక్షంగా వాడవచ్చన్నది ఆ రిపోర్టు సారాంశం.
యురేనియం అంటే …?
ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకమే ”యురేనియం”. భూమి పొరల్లో లభిస్తుంది. శుద్ది చేసిన యురేనియం అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో, వాడే అతి ముఖ్యమైన ఇంధనం. అంతరిక్ష ప్రయోగాల్లో కూడా వాడుతున్నారు.
మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, బీహార్‌, జార్కండ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో యురేనియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లోని ఈ ప్రాంతాలన్నికూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇక్కడ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయిని పర్యావరణ నిపుణులు అంటారు.
యురేనియం తవ్వకాలతో నష్టాలు
భూమిలో ఉన్నంత వరకు యురేనియం వల్ల పర్యావరణానికి నష్టం లేదు. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. అలా బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు. దీనిని న్యూక్లియర్‌ రియాక్టర్లలో వాడినపుడు, అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. యూరేనియం (యు- 238) నుంచి జనించే ఫ్లుటోనియం అనే రూపం (యు-239) అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు. యురేనియం అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి క్రమంగా ఎముకల్లో స్థిరపడుతుంది. ఫలితంగా క్యాన్సర్‌ వ్యాధి సంక్రమిస్తుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే మిలితమై ఉంటాయి.
నీటి కాలుష్యం !
యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుందని యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ఎప్పుడో తేల్చేసింది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. ఈ నీటిని మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి ఇంకుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం అధికమవుతుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. వీటి ఆనవాళ్లు మట్టిలో కలవడం వల్ల మొక్కలు, చెట్ల వేర్లలో ఉండిపోతాయని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదంలో జీవ వైవిద్యం
యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు మరింత కిందికి పడిపోతాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత తీవ్రమవుతుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు క్రమేణా అంతరించిపోతాయి.
మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి రుతువుల్లో విపరీత పరిణామాలు వస్తాయి. దీంతో మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అమెజాన్‌ అడవుల నరికివేతతో కరిబీయన్‌ దీవుల్లో వర్షపాతం తగ్గినట్లు గుర్తించారు. ఇండొనేసియాలోని బోర్నియో దీవిలో అటవీ నిర్మూలన వల్ల ఆ దీవిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వర్షపాతం సైతం తగ్గిందని పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. పులులు, ఇతర వన్యప్రాణులు నశిస్తే నల్లమల అడవులు సహజత్వాన్ని కోల్పోతాయి. ఇప్పుడు జరుగుతున్న వినాశనం పూర్తిగా మానవ తప్పిదం. అడవుల ధ్వంసం వల్ల కలిగే నష్టాల పై ఐరాస నివేదికలు అనేక హెచ్చరికలు చేశాయి. వాతావరణ మార్పుల వల్ల దాదాపు పది లక్షల జీవులు అంతరించే దశకు చేరువవుతున్నాయి. కీటకాలు పదేళ్లలో 25 శాతం, 2050 నాటికి 50 శాతం నశిస్తాయని, శతాబ్దాంతానికి పూర్తిగా కనుమరుగవుతాయని పరిశోధనల సారాంశం . దీనివల్ల ప్రకృతి సమతూకం దెబ్బతిని మానవ మనుగడకు ముప్పు వాటిల్లిడం ఎంతో దూరంలో లేదు.
(ఆకాశవాణి హైద్రాబాద్‌ కేంద్రం నుండి 23.9.2019న ఉదయం 8.30కి ప్రసారమైన వార్త..వ్యాఖ్య. )

Share.

Leave A Reply