‘ రైతుబంధు’ లో ఆర్టీసీ సమస్యకు పరిష్కారం! రూరల్‌ మీడియా సర్వేలో వెల్లడి.

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ గ్రామీణ వర్గాల స్పందన ఆధారంగా, ఈ అధ్యయనం జరిగింది. విద్యార్దులు, మహిళలు, రైతులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు, పాత్రికేయుల అభిప్రాయాలతో, ఒక ర్యాండమ్‌ సర్వే రూపొందించాం. హైదరాబాద్‌ ,కరీంనగర్‌,మెదక్‌, రంగారెడ్డి జిల్లాలో 3 నుంచి 5 గ్రామాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరిపాం. వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా కొందరు తమ సూచనలు మాతో పంచుకున్నారు. పండుగ సమయాల్లో ఆర్టీసీ కార్మిక నాయకులు సమ్మె జరపడం సమంజసం కాదని 80 శాతం మంది అన్నారు. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా ఉద్యోగాలు తొలగిస్తాం అనడం పట్ల 65 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా చూడరాదు… తెలంగాణాలోని సామాన్యులందరి సమస్య అని విద్యార్దులు అంటున్నారు. నష్టాలకు కారణం కార్మికులే అంటూ ప్రభుత్వవర్గాలు ఆర్టీసీ కార్మికుల మీద నిందలు వేస్తుంటే, కార్మికులు మాత్రం మావల్ల నష్టాలు లేవు. ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అంటున్నారు.
ప్రభుత్వ అంచనా ప్రకారం, ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో, రూ. 5వేల కోట్ల రుణభారంతో, ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సమ్మె మరింత ఉధృతం అవ్వడం అన్ని వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. ఈ సందర్బంలో సామాజిక బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా రూరల్‌ మీడియా ద్వారా ప్రగతి రధచక్రాలు ఆగిపోకుండా, ఆర్టీసీ సమస్యకు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నాం. సమ్మె వల్ల ఆర్టీసీ రోజుకు సుమారు 10 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత ఇబ్బందుల్లో కూరుకు పోకుండా, కార్మికులు, ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం !!
మా సర్వేలో ప్రజల నుండి వచ్చిన సూచనలు క్లుప్తంగా ఇవి…
పరిష్కారం – 1
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 1 లీటర్‌ డీజిల్‌ ధర 54 రూపాయలు. 5 ఏండ్ల తరువాత 2019లో లీటర్‌ డీజిల్‌ ధర 77 రూపాయలు. అంటే 1 లీటర్‌ డీజిల్‌ కి 23 రూపాయలు రేటు పెరగడం వల్ల ఆర్టీసిపై సుమారు 6 వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఇతర రాష్ట్రాలలో డీజిల్‌ మీద పెరుగుతున్న భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలే భరించటం వల్ల అక్కడున్న ఆర్టీసిలు కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నాయి. ఆర్టీసి సజావుగా నడవాలంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగా, అన్ని రకాల పన్నులమీద మినహాయింపు ఇవ్వాలి.
పరిష్కారం – 2
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది జెఎసి ప్రధాన డిమాండ్‌. కాని ప్రభుత్వ వర్గాలు విలీనం సాధ్యం కాదు అంటున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది. విజయాబ్యాంక్‌, దేనా బ్యాంక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. అన్ని రంగాలలో విలీనం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆర్టీసిని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం ఎందుకు సాధ్యం కాదు ? పక్క రాష్ట్రంలోని ఎపిఎస్‌ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అక్కడి ముఖ్యమంత్రే ప్రకటించారు. అక్కడ సాధ్యమయింది. ఇక్కడ ఎందుకు కాదు? ఏపీ అప్పుల రాష్ట్రం అయినా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.. మరి..ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది, ఎందుకు విలీనం చెయ్యలేకపోతున్నారు అని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
పరిష్కారం – 3
కొందరు ప్రైవేటు వాహనదారులు కాంట్రాక్ట్‌ క్యారేజెస్‌గా పర్మిట్‌ ఉన్న తమ వాహనాలను స్టేజి క్యారేజీలుగా తిప్పుతూ ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని ప్రభుత్వం అరికట్టాలి. దీని వల్ల ఆర్టీసికి సాలీనా వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలుగుతోంది. అటు ట్రాన్స్‌ పోర్టు డిపార్ట్‌ మెంట్‌ కాని, ఇటు పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ ని వారిపై గట్టి చర్యలు తీసుకుంటే ఆర్టీసీకి ఆ వెయ్యి కోట్లు మిగులుతాయి.
పరిష్కారం – 4
ఆర్టీసికి ఉన్న 3 వేల కోట్ల రూపాయల నష్టాలలో ప్రభుత్వం ఇవ్వవలసిన 2 వేల కోట్ల రూపాయలు, ప్రైవేటు అక్రమ రవాణాను ఆపటం వల్ల వెయ్యికోట్ల రూపాయలు ఆర్టీసికి వస్తే సంస్థ నష్టాల నుండి బయటపడుతుంది.
అలాగే ప్రభుత్వం ఆర్టీసికి అన్ని రకాలు ట్యాక్సులు మినహాయిస్తే, సాలీనా వెయ్యి కోట్ల రూపాయల లాభాల్లో ఉంటుంది.
పరిష్కారం – 5
2014 నుండి 2019 వరకు 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్టీసికి ఇచ్చింది. అసలే నష్టాలతో ఉన్న ఆర్టీసి నుండి సుమారు 5 వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకు పోతుంది. దీని పై ప్రభుత్వం ఆలోచించాలి.
పరిష్కారం – 6
ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ లేకపోతే, తల్లితండ్రులు వారి పిల్లలకు నెలకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువులు భారం అవుతాయి. పేద పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటు బస్సులు ఏవీ కూడా విద్యార్థులతో పాటు ఇతరులను ఉచిత ప్రయాణానికి అనుమతించకపోగా ఎలాంటి రాయితీలు ఇవ్వవు. దీనిని ప్రభుత్వం గుర్తించాలి.
పరిష్కారం – 7
2014 నుండి 2019 వరకు, సుమారు 6 వేల మంది రిటైర్‌ అయినా ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా, కార్మికులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం అంటూ రెండు రోజులపాటు గంటల తరబడి భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. అన్ని గంటలపాటు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే బదులు కార్మిక సంఘాల నాయకులతో ఒక గంటపాటు సమావేశమై కష్టనష్టాలు మాట్లాడుకొని నాలుగు మంచి మాటలు చెప్పి ఉంటే సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యేది.
పరిష్కారం – 8
తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ ఇ డి వీధి లైట్లను నిర్వహిస్తున్నారు. ఇవి చాలా చోట్ల పగలు,రాత్రీ వెలుగుతూనే ఉంటాయి. జిల్లాల్లోనే కాక, హైదరాబాద్‌ నగరంలో కూడా పలు చోట్ల ఈ దృశ్యాలు చూడవచ్చు. వీటి విద్యుత్‌కు కోట్ల రూపాయలు వృధా అవుతోంది. వాటి పై ప్రభుత్వం విచారణ చేసి ఆ వృధాను అరికట్టి, ఆ నిధులను కూడా ఆర్టీసీకి ఖర్చు పెట్టాలని పలువురు కోరుతున్నారు.

పరిష్కారం – 9
‘ రైతుబంధు’ లో ఆర్టీసీకి పరిష్కారం … !!
ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రైతుకు లబ్ది చేకూర్చేలా రూపొందించిన రైతుబంధు పథకం గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రావడానికి ఎంతగానో తోడ్పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని, ప్రభుత్వ వర్గాల సమాచారం. కాని, తెలంగాణలో సుమారు 58.33 లక్షల మంది రైతులు ఉన్నారని ఒక అంచనా !!
తెలంగాణలో పట్టా భూమీ సుమారు 1.43 కోట్ల ఎకరాలు ఉంది.
పట్టా ఉన్న ప్రతీ భూమిలో పంటలు పండటం లేదు. అదంతా సాగుకు యోగ్యమైన భూమి కాదు. ఇందులో వ్యవసాయానికి అనువైన భూమి కోటి ఎకరాలు (సుమారు 1.03 కోట్లు) వర్షాలు, భూగర్భజలాల లభ్యతను బట్టి ఖరీఫ్‌లో ఆ కోటి ఎకరాల్లోనూ సాగు జరుగుతున్నదనే అనుకున్నప్పటికీ, సాగుకు నోచుకోకుండా పడావు పడ్డ మిగతా 43 లక్షల ఎకరాలా భూమికి ‘రైతుబంధు’ లో ఇస్తున్న రూ.2150 కోట్లు వ ధానే కదా?
ఇక రబీలో అయితే ఈ సాగు కేవలం 40 లక్షల ఎకరాలు మాత్రమే.. రబీ సీజన్లో కూడా రైతు సంక్షేమం పేరిట సుమారు కోటి ఎకరాలకి సాగు లేకుండానే ఎకరానికి 5 వేల చొప్పున రూ.5000 కోట్లు అధర్మంగా పంచి పెట్టినట్లే కదా? వ్యవసాయం చేసినా చేయకున్నా కూడా కేవలం పట్టాలు ఉన్న ఒకే కారణంతో ఖరీఫ్‌ సీజన్లో రూ.2150 కోట్లు, రబీలో రూ.5000 కోట్లు కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7150 కోట్లు పంచిపెట్టడం ఏ రకమైన సంక్షేమమో ప్రభుత్వం ఆలోచించాలి? 43 లక్షల ఎకరాల పడావు భూమికి ‘రైతుబంధు’ లో వృధా చేస్తున్న రూ.2150 కోట్లను ఆర్టీసీకి మళ్లించి సంస్ధను కాపాడవచ్చు అని కొందరు రైతులు ఈ సర్వేలో చెప్పారు.
అలాగే పది ఎకరాల లోపు చిన్న,సన్నకారు రైతులకు మాత్రమే ‘రైతుబంధు’ని అమలు చేస్తే, మరింత ప్రజా ధనం ఆదా అవుతుంది. ఆ నిధులను కూడా ఆర్టీసీకి ఖర్చు పెట్టి లాభాల బాటలో నడిపించ వచ్చు.
ఆర్టీసికి 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 3 వేల కోట్ల రూపాయల నష్టం ఆర్టీసికి పెద్ద కష్టమేం కాదు. ప్రభుత్వం పై సూచనలు అమలు చేస్తే, ఆర్టీసీ కి కష్టాలు తొలగుతాయి.
టీమ్‌, రూరల్‌ మీడియా (9440595858)

Share.

Leave A Reply