చెరువుతో కరవుకు చెక్‌

Google+ Pinterest LinkedIn Tumblr +


ఇదొక చెరువు కథ, రైతు గుండె చెరువయ్యేకథ… మనిషి బతకడానికి శరీరంలో గుండె ఎంత కీలకమో ప్రతీ ఊరికి చెరువు అంతే… 8ఏళ్ల క్రితం నిండుగ నీళ్లతో రైతులకు అండగా ఉన్న ఆ చెరువు ఎండి పోయింది. దానిని పునరుద్దరించడానికి గ్రామీణులు చేసిన కృషికి వచ్చిన ఫలితమే ఇది… 
తెలంగాణలో సాగునీటి లభ్యత అంతంత మాత్రమే.కాలువల ద్వారా కేవలం 13శాతం నీరు అందుతోంది. విపరీతమైన ఖర్చుతో భూగర్భ జలాలు తోడి పంటలను సాగు చేస్తున్నారు.రాష్ట్రంలో దాదాపు 69 శాతం భూములకు భూగర్భజలాలే దిక్కు. ఒకనాకొప్పడు తెలంగాణా రైతాంగానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న చెరువులు, కుంటలు నేడు 15 శాతం సాగుకు మాత్రమే నీరు అందించ గలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులను పునరుద్దరించాలనే తపనతో రంగా రెడ్డిజిల్లా, కందుకూరు మండలం,ముచ్చెర్ల గ్రామస్తులు ఐకమత్యంగా చేతులు కలిపి తమ భూములకు నీరందిస్తున్న నిజాం కాలం నాటి ‘పావోని చెరువు’ లో పూడిక తీయాలని నిర్ణయించుకున్నారు. 
”పూడికి తీస్తే చెరువుకు ఆరోగ్యం, ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతుకు సౌభాగ్యం.చేయి చేయి కలిపి రండి, వట్టిపోయిన చెరువులను పునరుద్దరించుదాం” అంటూ ప్రజలంతా ఉత్సాహంగా పూడిక తీత పనుల్లో పాల్గొన్నారు. 
గత చరిత్రకు సాక్షి 
రంగారెడ్డి జిల్లాలో అతి పురాతనమైనది పావోని చెరువు . దీని విస్తీర్ణం దాదాపు వంద ఎకరాలు. దీని ఆయకట్టుకింది 90 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. 40 మంది రైతులకు ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఈ చెరువు ఉపయోగ పడుతుంది. ముచ్చెర్ల ప్రజలకు ఈ చెరువు తరతరాలుగా జీవజలాన్నిచ్చిందని అక్కడి పెద్దలంటారు. వందేళ్ల క్రితం నిజామ్‌ సుల్తాన్‌లు ఈ చెరువు గట్టుమీద షికారుకి వచ్చేవారని చెబుతారు. 
ఈ చెరువు వల్ల వందలాది జాలరులు ఉపాధి పొందేవారు. ఐతే ఇటీవల వర్షపాతం సరిగ్గా లేక పోవడంతో ఈ చెరువులో అక్కడక్కడా నీటి జాడ మాత్రమే కనిపిస్తుంది. చెరువులో పూడిక తీయాలని ముచ్చెర్ల గ్రామ పంచాయితీలో తీర్మానం చేశారు. అయితే వంద ఎకరాల చెరువులో పూడిక తీయాలంటే చాలా ఖర్చువుతుంది… దీనికేమిటి మార్గమని గ్రామస్తులు ఆందోళన పడుతున్న సమయంలో ఆ ఊరికి ఉపాధి పనులు చేయించే అధికారులు వచ్చారు. మీరేం ఖంగారుపడొద్దు, ఉపాధి హామీలో చెరువులను బాగు చేసుకునే అవకాశం ఉందని వారికి భరోసా ఇచ్చారు. 
2013 లో 750 మంది గ్రామస్తులు చేయి చేయి కలిపి, 388 రోజులు పూడిక తీత పనులు చేపట్టారు. బీడు నేల సస్య శ్యామలమవుతుందనే ఉత్సాహంతో పని ఎక్కడా ఆపకుండా నిరంతరం కృషి చేశారు. వానలకు చెరువు నిండి, వారి బతుకు మారింది 
ఇవీ ఫలితాలు 
1, చెరువు నిండటంతో రైతులు సంతోషంగా కనిపిస్తున్నారు. దానికి కారణం వారి పంటల దిగుబడిలో వచ్చిన మార్పు. చెరువులో పూడిక తీసిన ఒండ్రు మట్టిని తమ పొలాల్లో వేశారు. దీని వల్ల ఎక్కువ ఎరువులు వాడనక్కర లేకుండానే పంటలు బాగా పండుతున్నాయి. 
2, కూరగాయల సాగు పెరగడం వల్ల ప్రజలకు పోషకాహారం అంది ఆరోగ్యంగాఉంటున్నారు. వారి తలసరి ఆదాయం కూడా పెరిగింది. ఎండా కాలంలో కూడా పశువులకు నీరు అందుతోంది. 
3, పూడిక తీయడం వల్ల పల్లపు ప్రాంతంలోని వందకు పైగా బోర్లు నిండాయి. ఒండ్రు మట్టి వల్ల మా భూమి సారవంతమైనది” అంటున్నారు ముచ్చర్ల పంచాయితీ సర్పంచ్‌ కాస నర్సింహ. 
4, ఈ సారి వానలు తగ్గి పావొని చెరువు ఎండినా, దాని చుట్టూ ఉన్న నేలలో తేమ తగ్గ లేదు. రైతుల సమిష్టి నిర్ణయం వల్ల తమ గ్రామాన్ని కరవు నుండి కాపాడుకున్నారు. 

Share.

Leave A Reply