జాతీయ ఎజెండా, ‘రైతు బంధు’

Google+ Pinterest LinkedIn Tumblr +

వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఇప్పటి వరకు విఫలమైనాయని చెప్పవచ్చు. రైతాంగం వడ్డీ వ్యాపారస్తులు, విత్తనాలు, పురుగుమందుల కంపెనీలు, దళారీల చేతికింద నలిగిపోతోంది. వ్యవసాయ సీజన్‌ మొదలైందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు మొదలవు తుంది.దున్నడం నుంచి కోతకోసి పంటచేతికొచ్చేదాకా పెట్టుబడి పెడుతూనే వుండాలి. ఆ పెట్టుబడి కోసం ఇంతకాలం రైతులు పడరానిపాట్లు పడుతూ వచ్చారు. అధిక వడ్డీలకు అప్పులు చేయడం, కొద్దొగొప్పో భార్యాపిల్లల మెడలో వున్న నగలను తాకట్టు పెట్టి అప్పులుతేవడం గ్రామాలలో సర్వసాధారణo. ఇంత చేసినా, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. కష్టించి పండించిన పంటకు గిట్టు బాటు ధరలులేక పంటను రోడ్లపై పారబోసే రైతుల దైన్యస్థితి నిరంతరం కొనసాగు తోంది. కానీ, ఈ ఏడాది నుంచి తెలంగాణ రైతన్నలకు ఈ కష్టాలు తీరుతున్నాయి.
రైతులకు పంట పెట్టుబడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడిని అందిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన రైతుబంధు పథకం ద్వారా రెండుపంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల వంతున అందిస్తున్నారు. దీనికోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతగా వర్షాకాలపు పంటకోసం ఎకరానికి 4,000 రూపాయలు , రెండో విడతగా యాసంగి పంట కోసం మరో 4,000 రూపాయలు అందించనున్నారు. పెట్టుబడి చెక్కులతోపాటు ఈసారి నూతనంగా రూపొందించిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నారు. 
ఈ నేపథ్యంలో వ్యవసాయరంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలనుండి రౖెెతాంగానికి ‘ రైతు బంధు’ఎలా తోడ్పడిందో, ఒక క్షేత్రస్థాయి కేస్‌ స్టడీ ఇది… 
అప్పుల నుండి బయట పడ్డాం 
” ఎవుసాయం చేయాలన్నపుడల్లా కూలీలకు, ఎరువులకు పైసలు ఎట్లా అనే ఆందోళన మొదలైతది. భార్య పుస్తెలో, పొలమో తాట్టు పెట్టి పొలం దున్నేటోళ్లం… ఆశించిన దిగుబడి వస్తే అవి విడుపించుకునేది, పంట నష్టం వస్తే, వాటి మీదనే మళ్లీ అప్పు తెచ్చి ఆగమయ్యేవాళ్లం. ఇపుడలాంటి బాధలు లేకుండా రైతు బంధు రూపంలో మా రెండు ఎకరాలకు రూ.16వేలు అందింది. దానిని పంటకు పెట్టుబడిగా పెట్టి, టెన్షన్‌ లేకుండా సాగు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.” అంటాడు కందాటి రంజిత్‌. ఈ యువరైతు జనగాం జిల్లా, పాలకుర్తి మండల్‌ ,కోతులాబాద్‌లో రెండు ఎకరాల్లో అరటి తోట వేశాడు. భూగర్బ జలాలను డ్రిప్‌తో పొదుపుగా వాడుతూ,ఎకరాకి రెండున్నర లక్షల ఆదాయం పొందుతున్నాడు. 
సాఫీగా సాగుబడి 
” పంటల సీజన్‌ ప్రారంభంలో మాకు ఎరువులు, విత్తనాలు ఇతరత్రా అవసరాలకు గతంలో వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి అప్పుల పాలయ్యేటోళ్లం. చేతికొచ్చిన పంట వడ్డీకే సరిపోయేది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరుతో చెక్కులు ఇవ్వడం వల్ల అప్పుల ఊబి నుండి బయట పడ్డాం.” అన్నారు నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం,కంపాలపల్లి రైతమ్మ వంగాల సుజాత.నల్గొండలో చిరు వ్యాపారాలు చేసుకొని బతికే ఈ కుటుంబం ఏడాది క్రితం కంపాలపల్లిలో మూడు ఎకరాలు కొనుగోలు చేసి కూరగాయలు పండిస్తున్నారు. 
ప్రభుత్వం ఇరవైనాలుగు గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తుందికదానీ విద్యుత్‌ని వృధా చేయకుండా వీరు డ్రిప్‌ ఇరిగేషన్‌ చేస్తూ, విద్యుత్‌ తో పాటు భూగర్భ జలాలను పొదుపుగా వాడుతూ కాకర,దోస,ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా పంటపెట్టుబడిని అందివ్వడంతో వ్యవసాయం మీద నమ్మకం కలిగింది అంటున్నారు. అన్ని ఖర్చులు పోనూ, ఎకరాకు లక్షన్నరకు పైగా ఆర్జిస్తున్నారు. 
కూలీల ఖర్చు తగ్గింది 
” విత్తనాలు, ఎరువులకంటే కూలీలకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మా ఇంటిల్లిపాదీ పనిచేసినా మరి కొందరు కూలీలను పెట్లాలి. రైతుబంధు చెక్కులు అందటంతో ఆ డబ్బు కూలీలకు ఖర్చు పెట్టాం. మా రెండున్నర ఎకరాల్లో బెండ,మిర్చి,టమాటా పండిస్తున్నాం. దిగుబడి తగ్గినప్పటికీ ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.80 వేల వరకు మిగిలింది” అన్నాడు వనపర్తి జిల్లా, మెట్‌పల్లి రైతు గోకం దానయ్య . ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అంతంత మాత్రమే,వర్షాధారం మీదనే సాగు చేయాలి.అలా అని ఈ రైతు దిగులు పడకుండా తెలంగాణ ఉద్యాన శాఖ నుండి సబ్సిడీ పై సూక్ష్మ సేద్యపరికరాలు పొంది, ప్రతీ నీటి బొట్టును మొక్క వేర్లకు అందిస్తూ, దిగుబడిని సాధిస్తున్నాడు. 
సాగు విస్తీర్ణం పెరిగింది 
” సాగుకు పెట్టుబడి కోసం ప్రతీసారీ,బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇపుడు రైతు బంధు పధకం వల్ల ఆ బాధలు తప్పాయి. గతంలో పెట్టుబడి పెట్టే స్తోమతు లేక మూడెకరాలే సాగు చేసేవాడిని ఇపుడు నాలుగు ఎకరాల్లో మేలు జాతి బొప్పాయి పండిస్తున్నాను. ఎకరాకు 37క్వింటాళ్లు దిగుబడి వస్తోంది.” అన్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంచిన పేట రైతు బానోతు చిన్నా. 
కేస్‌ స్టడీ ఫలితాలు    1, రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే రైతులు రైతు బంధు వల్ల సాగు మీద దృష్టి పెడుతున్నారు. 
2, జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతులు ఆత్మహత్యే శరణ్యం అనుకోవడం తగ్గింది. పంటకు కనీస పెట్టు బడి అందటంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగింది. 
3, రుణం అనేది సామాజికంగా రైతును కుంగదీస్తుంది. వారికి వచ్చే ఆదాయంతో ఇమడలేక, అప్పు తీర్చలేకపోతున్నాడు.అలాంటి సమస్యల నుండి రైతుబంధు పథకం కాపాడింది. 
4, రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే రైతులు రైతు బంధు వల్ల సాగు మీద దృష్టి పెడుతున్నారు. 
5, పంటకు పెట్టుబడి పెట్టే స్తోమతు లేక కొందరు రైతులు తనకున్న భూమిలో 50 శాతం మాత్రమే సాగు చేసేవారు. ఇపుడు రైతుబంధులో పెట్టుబడి అందటంతో మొత్తం భూమిని సాగు చేస్తున్నారు. ఆవిధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. 
6, పంట పెట్టుబడి కోసం, అధిక వడ్డీలకు అప్పులు పాలయ్యే పరిస్ధితి నుండి బయట పడుతున్నారు.  లాభసాటిగా సాగు చేసే కొందరు రైతులు రైతుబంధు చెక్కులను లుపు తీసే యంత్రాలు ఇతర వ్యవసాయపరికరాల కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు.  
ఇకపై ఎకరాకు రూ.10 వేలు 
రాష్ట్రంలోని రైతులు అప్పులపాలు కావొద్దని ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకం ప్రస్తుతం జాతీయ ఎజెండాగా మారింది. ప్రపంచబ్యాంక్‌, ఐక్యరాజ్యసమితి సైతం పథకాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు పథకం కింద రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్నారు. ఇకపై ఎకరాకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఇటీవల కేసీఆర్‌ వెల్లడించారు. ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. 
ప్రపంచబ్యాంకు కితాబు 
రైతుబంధు పథకం చేపట్టడమే వినూత్నం. ఆ పథకం అమలుతీరును తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కూడా ప్రశంసనీయంగా ఉన్నదని ప్రపంచబ్యాంకు అభినందించింది. లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందిందా లేదా అని తెలుసుకోవడంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని తన అధ్యయన పత్రంలో పేర్కొంది. జార్కండ్‌ కూడా ఇదే విధానాన్ని అనుసరించాలనుకుంటున్నదని, తెలిపింది. 
………….శ్యాంమోహన్‌  , PIC/Harikrishna/ruralmedia

Share.

Leave A Reply