‘ ఏ ఫ్రేములోనూ నా ఫోటో ఇమడలేదు, అందుకే నేను దిగంబర కవిని !!’

Google+ Pinterest LinkedIn Tumblr +

” కలియుగం రేడియోగ్రామ్‌లో
గిరగిర తిరుగుతున్న క్రీ.శ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద పిన్నునై
మానవత రెండు కళ్లు మూసుక పోయినప్పుడు
విప్పుకుంటున్న మూడోకన్నునై
కాలం వాయులీనం మీద కమానునై
చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై
నేను వస్తున్నాను దిగంబర కవిని
రాత్రి ఉదయిస్తున్న రవిని.”

( 2వభాగం )
దోపిడీ వ్యవస్థకి కారణమైన ఏ అవినీతి ప్రభుత్వాన్ని మీరు దుయ్యబడుతున్నారో, అదే అవినీతి ప్రభుత్వానికీ, దాని అశ్రిత సంస్థలకీ కొమ్ముకాస్తూ, నగరాల్లో విలాస జీవితాలు గడుపుతున్న మీకు, ఎండల్లో, వానల్లో, కొండల్లో, అడవుల్లో … తాము నమ్మిన దానికోసం ఆవేశంతో పోరాడుతున్న నక్సలైట్లను సమర్థించే అధికారమూ అర్హతా లేవు.
కృత్రిమమైన మీ నైతిక మద్దతు ఎవరికీ అక్కరలేదు.
నిజాయితీ వుంటే దేశీయ సమస్యలకు నక్సలైట్‌ విధానం పరిష్కార మార్గమనే గట్టి నమ్మకం మీకుంటే, కార్యరంగం మీదికి వెళ్లండి, వీరోచితంగా పోరాడండి.
ఎండిన తాటాకులకి మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వడం – సమయం వస్తే తెర చాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు కవులు చేయవలసింది.
సాయుధ పోరాటాన్ని నేను నొప్పుకున్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్‌ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో తుఫాను రాదు. తుఫాను వచ్చే ముందు సముద్రం ఎర్రబారుతుంది. హోరు మారుతుంది. సమాజం కూడా అంతే.
వ్యక్తిగతంగా నక్సలైట్ల పట్ల అపారమైన సానుభూతి నాకుంది. అయితే నక్సలైట్‌ ఉద్యమం అలజడినీ, భయోత్పాతాన్నీ కలిగించగలదే కాని, దేశ సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూత్రం చూపలేదు.
చివరకు నక్సరైట్‌ ఉద్యమం బాహ్యంతరాల్లో దుష్పరిణామాలకీ, దుష్పలితాలకీ దారితీస్తుంది. తీసింది కూడా.
రాజకీయాలకు, మత తత్వాలకు, అతీతంగా గిరుల్ని గీతల్ని, అవధుల్ని, దాటి సర్వోన్నత స్థాయిలో స్వచ్ఛందంగా పలక వలసిన కవిత, సంకుచిత వలయాల్లోకి, రాజకీయాల బురద గుంటల్లోకి ఎందుకు ప్రవేశించవలసిన వచ్చింది? సముద్రాన్ని నదిలోకి మళ్లించాలను కుంటున్న మీరు సముద్రాన్ని ఎప్పుడూ చూసిన పాపాన పోలేదు.
రాజకీయాలు కవిత్వంలోకి ప్రవహిస్తాయి. కాని కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు.
ఈదేశంలో అన్యాయం, అక్రమం పేరుకుపోయిందని మీరే గుర్తించారు. కారణాల్ని మీరే పసిగట్టారు. కుష్టు వ్యవస్థకి, దోపిడీ వ్యవస్థకీ ఎక్కడా పొత్తు లేదు. కుష్టు వ్యవస్థకి అసలు అర్థమేమిటో నగ్నమునికి తెలుసు.
ఎదగడం మానేసిన కవి శ్రీశ్రీ
శ్రీశ్రీ గొప్పవాడే. ఆయన గొప్పతనాన్ని భూతద్దంలో పెట్టి చూసి ప్రజలకు చూపించి ఆయన చుట్టూ చేరి, ఆయన్ని కీర్తించడం కూడా తమ కవిత్వంలో ఒక భాగమనుకున్న అభ్యుదయ కవులంతా చివరకు తమ తమ అస్తిత్వాల్ని, కవిత్వాల్నీ కోల్పోయి, శ్రీశ్రీ కడుపులో శిథిల కవిత్వాస్థికలుగా మిగిలిపోయారు. ఇవాళ ఆ శ్రీశ్రీ అనే వృద్ధ సింహం చుట్టూ చేరి చెక్కభజన చేస్తున్న మీకు, ఆ దుర్గతి పట్టకుండా చూసుకోండి. ప్రజల తృప్తికోసం ఎదగడం మానేసిన కవి శ్రీశ్రీ.
”దిగంబర’ ముసుగెందుకు?
గౌతమబుద్దుడు సత్యాన్ని హఠాత్తుగా దర్శించి ప్రవచించినట్లు మార్క్సిజం, లెనినిజం గురించి కొత్తగా వ్యాఖ్యానిస్తున్న మిమ్మల్ని చూపి జాలిపడవలసి వస్తుంది. ఇన్నాళ్లూ అభ్యుదయ కవులూ, కమ్యూనిస్టు పార్టీ చేసిందేమిటి? ఇన్నాళ్లూ ప్రచారం చేసి రంగాన్ని సంసిద్ధం చేసిన వాళ్లంతా పనికిమాలిన వాళ్లయిపోయి నూతనంగా పీడిత వంచిత ప్రజా సంరక్షణార్థం తాము అవతరించవలసి వచ్చిందా? దిగంబర కవితోద్యమ ప్రారంభ దశలో మీలో ఒకడైనా మార్క్స్‌, మావోల పేరెత్తలేదు! వారిని చదివాక ఇప్పుడే జ్ఞానోదయమైందా! మార్స్జిజం పుట్టిన ఒక శతాబ్దం తరువాత, ఆ సిద్దాంతాల్ని అత్యధునాతనమైనవిగా ప్రచారం చేయడానికి కవులుగా మీకు సిగ్గెందుకు లేకుండా పోయింది?
పోనీ మార్క్సిజాన్ని దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సిద్దాంతాన్ని ప్రచారం చేయడమే మీ ధ్యేయమైనప్పుడు, స్పష్టంగా ‘మేము మార్క్సిస్టు కవులమనో, మావోయిస్టు కవులమనో, సోషలిస్టు కవులమనో” చెప్పుకోడానికి సంకోచమెందుకు? ‘దిగంబర కవులు’ అనే ముసుగెందుకు?
నాలాంటి బుక్కాఫకీర్లు కొందరు పిచ్చి పిచ్చి అనుమానాలతో, అన్వేషణలతో ఏవేవో పలవ రిస్తుంటారు. వాటిని మీరు లెక్కపెట్టకూడదు. సుఖపడ దలచుకున్న మీరు హిందూ నేషన్‌ నీ, గోరానీ, కాఫి హౌస్‌ మిత్రుల్ని గట్టిగా నమ్మండి. (మార్క్స్‌ ఈ దేశంలో పుట్టి వుంటే చరిత్ర నిర్వచనం తీరు మరో విధంగా వుండేదేమో) మార్క్స్‌ సృష్టించిన భూతల స్వర్గం నుండి పారిపోయి వచ్చిన బుద్ధిజీవుల్ని నమ్మకండి.
గుడ్లగూబల్ని గురువులుగా భావించి ముందుకు సాగిపోవడమే మన ధ్యేయం శుద్ధ నాస్తికవాదులం అంటూనే పెళ్లాం సాకుతో తిరుపతి తీర్థయాత్రలు సేవించడం, శాస్త్ర సమ్మతంగా పెళ్లాడటం, ఆధునిక వివాహాలకు అత్యాధునిక పౌరోహిత్యాలు నెరవడం,
– ఇవన్నీ దిగంబర కవితా లక్షణాలని నేను ముందను కోలేదు. నా దృష్టిలో దిగంబర కవిత్వ నిర్వచనమేదో కొత్తగా ఇవాళ చెప్పవలసిందేమీ లేదు.
ఉద్యమాలు ఎంత బలవత్తరమైనవో అంత హానికరమైనవన్న నిర్ణయానికి నేను రావలసివస్తున్నది.
ఏ ఇజానికో తాకట్టు పడివుంటే నేను దిగంబర కవిని కానక్కరలేదు. ఏ చెప్పులూ నా కాళ్లకి పట్టలేదు. ఏ దుస్తులూ నా ఒంటికి అతకలేదు. ఏ ఫ్రేములోనూ నా ఫోటో ఇమడలేదు. అందుకే నేను దిగంబర కవినయ్యాను.
ఒక ఇజానికి, ఒక విశ్వాసానికి కట్టుబడిపోయి, దిగంబర కవులుగా మిమ్మల్ని మీరు నరుక్కున్నారు. మీరు నమ్మినదాన్నే ప్రపంచమంతా విశ్వసించాలని దౌర్జన్యంగా శాసిస్తూ మీ అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారు. కట్టుబడిపోయిన మీకూ, దేనికీ కట్టుబడని నాకూ సంధి కుదరదు. పరిణామాల్ని ఊహించి మొహం చాటు చేసుకోవలసిన గతి మీకు పడుతుంది. నాకు కాదు.
నేను ఇస్తున్నది మీ Charge sheet కు Explanation అనుకోండి. మీ సందేహాలకు సమాధానాలకు మాత్రమే.” (తనపై వచ్చిన విమర్శకు ‘ తెలుగు -వెలుగు వారపత్రిక 17-24 జూలై 1970’ సంచికల్లో ప్రచురితమైన మహాస్వప్న సమాధానం ఇది.) illustration/Akbar

ఈ రచన వెనుక నేపధ్యాన్ని కవి నిఖిలేశ్వర్‌ ఇలా వివరిస్తున్నారు
”1970 నాటికి దిగంబర కవుల నాలుగో సంపుటిని వెలువరించాలనే సందర్భంగా, మా ఆరుగురి కవుల మధ్య తాత్విక భావజాలరీత్యా, తీవ్రమైన చర్చలు జరిగాయి. చివరికి మహాస్వప్న, భైరవయ్యలు మార్క్సిస్టు చింతనతో ఏకీభవించలేమని విడిపోయారు. ఆ తర్వాత మహాస్వప్న ఆనాటి ‘ప్రజాతంత్ర’ పత్రికలో ఇంటర్వ్యూ ఇవ్వగా, కొన్ని అంశాలమూలంగా మిగతా నలుగురం ఆయనపై ‘చార్జిషీట్‌’ రూపంలో విమర్శ పెట్టగా, ఆయన కూడా ఆనాటి ‘తెలుగు వెలుగు’ పత్రికలో అంతే తీవ్రంగా స్పందించాడు.” – నిఖిలేశ్వర్‌

Share.

Leave A Reply