రాచకొండ గుట్టలకింద రాజలింగో….

Google+ Pinterest LinkedIn Tumblr +

రాచ కొండ గుట్టల్లో దాగిన చారిత్రక సంగతులను మేం తవ్వడం లేదు. అక్కడ ఆదిమానవుడి అడుగు జాడలను మీకు చూపించే సాహసం కూడా చేయబోవడం లేదు. కానీ ఇటీవల ఆ గుట్టల చుట్టూ తిరిగి అక్కడి ఆధునిక మానవులు ఏం చేస్తున్నారో కనిపెట్టాం. ఇక్కడ తెలంగాణ సర్కారు ‘చిత్రపురి’ని ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో జన జీవన చిత్రాన్ని రికార్డు చేశాం.
హైదరాబాద్‌కి అరవై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ గుట్టల కింద ఉన్న తిప్పయ్యగూడ,మంచాల గ్రామాల్లో ఆకుపచ్చని సంస్కృతిని కనిపిస్తుంది.వేలాది మంది రైతు కూలీల్లో సత్తయ్య ఒకడు. కూలీపని దొరక్క పోతే హైదరాబాద్‌ పోయి దొరికిన పని చేసుకునేవాడు. కొంత సాహసం చేసి 2006లో జెనిగ సత్తెయ్య తనకున్న ఎకరం నేలను చదును చేసి మామిడి నాటాడు. మొక్కలు ఎదగడానికి పాదులు తీసి వాటికి కుండలతో నీళ్లు మోసుకొచ్చి పోయసాగాడు… కానీ ఇలా ఎంత కాలం… ? తన లాంటి రైతుల కోసం సర్కారు నుండి ఏమైనా సాయం ఉందా అని ఆరా తీశాడు. ఉపాధి హామీ పథకం కనపడింది. వెంటనే జాబ్‌ కార్డు పొంది తన పొలంలోనే పనుల చేసి ఉపాధి పొందాడు. ఉద్యాన శాఖ నుండి సబ్సిడీ పై డ్రిప్‌ని కూడా సంపాదించాడు. పశుసంవర్ధక శాఖను కలిసి పశుక్రాంతి పథకాని ఉపయోగించుకొని లోన్‌తో నాలుగు పాడిపశువులను కొని పాల అమ్మకం చేపట్టాడు. 
” జెనిగ సత్తయ్య చాలా తెలివైన రైతు ” అంటాడు ఆ ప్రాంతానికి చెందిన రాజలింగం. ” ఎందుకంటే సర్కారు పథకాలన్నింటినీ అందుకొని అభివృద్ది చెందిన వాడు అతనొక్కడే…” 
నేడు సత్తయ్య సాగు బడి చూస్తే రాజలింగం చెప్పింది నిజమేననిపిస్తుంది ఎవరికైనా… 
ఇపుడు విశాలమైన మామిడి తోటకు యజమానయ్యాడు. గత మూడేళ్లుగా ఏడాదికి యాభై వేలకు పైగా మామిడిపండ్ల మీద ఆదాయం పొందుతున్నాడు. కొంత పొదుపు చేసి ఎకరం భూమి కొని వరిని పండిస్తున్నాడు. మామడి తోట మధ్య కూరగాయలు పండిస్తున్నాడు. రోజుకు ఇరవై లీటర్ల పాలను అమ్ముతూ మినీడెయిరీని నిర్వహిస్తున్నాడు. 
ఇంటర్‌ చదువుతున్న తన కొడుకు శేఖర్‌ని చదువు మాని పించి పొలం పనులు చూసుకో మన్నాడు. 
” ఈ రోజుల్లో చదువుకొంటే ఏమెస్తుంది సారు… వ్యవసాయంలోనే ఎంతో సంపాదించవచ్చు ఉన్న ఊర్లోనే గౌరవంగా బతకొచ్చు” అంటాడు పశువులకు నీళ్లు పెడుతూ శేఖర్‌. వీరి పంటలను చూసి ఇతర రైతులు కూడా ఉత్సాహంగా పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. ఫలితంగా చూట్టూ కొబ్బరి,అరటి,మామిడి తోటలలో పచ్చగా మారిందీ పల్లె. 
వీళ్ల పశువుల కొట్టం నుండి వరి పొలం గట్టు మీదుగా మామడి తోటలోకి అడుగు పెడుతుంటే దూరంగా రాచకొండలు జెనిగ సత్తయ్య కృషికి సలాం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 
ఇతడు సత్తెకాలపు సత్తెయ్య కాదు, జెనిగ సత్తయ్య

Share.

Comments are closed.