వ్యక్తిత్వ వికారానికి ఆఖరి మెట్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

Populism and Plagiarism – Part 3
—————————————————

నిజమైన సాహిత్యం వేరు. అలా రాసేవాళ్లని
భారతీయ సాహిత్య నిర్మాతలు అంటాం.

గురజాడనో, శరత్ చంద్ర ఛటర్జీనో, ప్రేమ్ చంద్ నో, తకళి శివశంకర్ పిళ్లైనో, భైరప్పనో, కిషన్ చందర్ నో, మంటోనో ఇష్టంగా తలచుకుంటాం.

వనవాసి చదివావా? ‘పర్వ’ ఓసారిస్తావా? అంటాం.

‘కలకత్తాకి దగ్గరిలో’ పుస్తకాన్ని మిత్రుడెవరో పట్టుకుపోయాడని దిగులుపడతాం. జయకాంతన్, వైకం బషీర్, చాసో కథలు మళ్లీ మళ్లీ చదువుకుంటాం. కళ్యాణ సుందరీ జగన్నాథ్ ‘అలరాస పుట్టిళ్లు’ మరొక్కసారి ప్రేమతో చదువుతాం. ‘గులాబీ అత్తరు’ క్లయిమాక్స్ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాం. పూసపాటి కృష్ణంరాజో, అల్లం శేషగిరిరావో రాసిన వేట కథలు అపూరూపమైన జ్ఞాపకాలుగా మనసు పొరల్లో మెదులుతాయి. ఈనాటికీ లాలస, దేశికాచారి, అమీనా నన్ను పలకరిస్తూనే ఉంటారు.

పూర్తిగా నాన్ సీరియస్, ఫక్తు కాలక్షేపం టైపు pulp fiction రాసే చేయి తిరిగిన వాళ్లు కొందరుంటారు.

ఇపుడు మనం వాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. యద్ధనపూడి సులోచన బఠానీలు, యండమూరి మసాలా పల్లీలు, కొమ్మనాపల్లి, సూర్యదేవరల మిర్చి బజ్జీలు, కొద్దిసేపటి సరదా తీరడం కోసమే. ఇలాంటి కమిటెడ్ కమర్షియల్ రచయితలు, సామాన్య జనం నీచాభిరుచుల్ని సంతృప్తిపరుస్తారు. ఊరించే నేరేటివ్ టెక్నిక్ తో పిచ్చె్క్కిస్తారు. రచయితలుగా పేరుమోసిన వీళ్లంతా కవ్వించే శైలి, కంగు తినిపించే మలుపులతో క్లయిమాక్స్ కి పాఠకుల్ని పరుగెత్తిస్తారు.

స్వాతి, జ్యోతి, ఆంధ్రభూమిలాంటి నేలబారు ‘వార’పత్రికలు వీళ్ల కోసం పేజీలు పరుస్తాయి.

పైట చెంగు జార్చే ఆడవాళ్ల బొమ్మలు వేసే కళా కూలీలు అక్కడ ఉద్యోగానికి కుదురుకుంటారు. ఇదంతా కళ్ల ముందు కదిలే కమర్షియల్ ట్రాజడీ.

ఇలాంటి రచయితలు రెమ్యునరేషన్ కి నిబద్ధులు. ఇపుడు వీళ్ల బాధంతా వాళ్ల రెమ్యునరేషన్ యండమూరి కొట్టేశాడనే!

ఒక సీరియల్ హిట్టయితే అదే నవలగా అమ్ముడుపోతుంది. దాన్నే సినిమా తీస్తే… డబ్బులొస్తాయి. ఈ నవలకి మీరే స్క్రీన్ ప్లే రాయాలి అంటే… డబ్బు. లేదా డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు. ఇలా ఒక్కసారి రాస్తే దాని మీదే నాలుగైదు సార్లు డబ్బు ముడుతుంది. ఇవి పాపిష్టి రచనలు
కావుగానీ, పాపులిస్టు నాటకాలు!

ఇంగ్లీషు పెద్దగా చదువుకోని వారపత్రికల సెమీ లిటరేట్ వెర్రి పాఠకులే వీళ్ల core strength. రానురాను ఆ వెర్రిమాలోకాలే ఎదిగి, యిపుడు భరించలేని టీవీ సీరియల్ ప్రేక్షకులుగా తయారయ్యారు. కనుక, తొండ ముదిరిన వీరేంద్రనాధ్ చౌర్యం చేశారని ఆరోపించిన వాళ్లంతా గొప్పవాళ్లనీ, పవిత్రులనీ కాదు. యిరవయ్యేళ్ల క్రితం ప్రెస్ మీట్లలో అరిచి గగ్గోలు పెట్టిన వాళ్లు తర్వాత ఏం చేసినట్టు? వాళ్లసలు ఏమైపోయినట్టు? ‘వీళ్ల సంగతి నాకు తెలియదా?’ అనుకుంటూ యండమూరి హ్యాపీగా నవ్వుకుని గ్లాసులో సోడా పోసుకుని వుంటారు.

ఒక కుర్ర జర్నలిస్టు నన్నోసారి అడిగాడు. బుచ్చిబాబు, బాలగంగాధర్ తిలక్ రాసేది లిటరేచర్ కదా… మరి, యండమూరి, యద్ధనపూడిలాంటి వాళ్లు రాసేదేమిటి? అని.
అది యిల్లిటరేచర్ అని చెప్పాను.

*** *** ***

నేనో, పోనీ నువ్వో ఒక అరటి పండు తొక్క మీద కాలేసి జారిపడతాం. అందులో విశేషం ఏమీ లేదుగా! ఎన్టీరామారావు గనక తొక్క మీద కాలేసి జారిపడితే అది న్యూస్ అవుతుంది. దినపత్రిక మొదటి పేజీలో కార్టూన్ అవుతుంది. దానిపై చర్చ జరుగుతుంది. ఏనాడో… విజయవాడ జైహింద్ టాకీస్ కు వచ్చిన హీరో అక్కినేనిని చూడటానికి తాపత్రయపడ్డ 13 ఏళ్ల సావిత్రి చిన్న బురద గుంటలో పడింది.
ఆ సంఘటనని ‘మహానటి’ సినిమాలో చూడొచ్చు.
That is the sheer power of a personality.

పి.సుశీల, ఎస్.జానకి వేలకొద్దీ పాటలు పాడినా, ఎన్నటికీ ఒక యమ్మెస్ సుబ్బులక్ష్మి కాలేరు.

కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ ఎన్ని బంపర్ హిట్లు తీసినా ఒక శ్యామ్ బెనగల్ కాలేరు!

అలాగే, యండమూరి, యద్ధనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవర లాంటి పరమ తుక్కు ఫిక్షన్ రచయితలు ఎందరు కలిసినా ఈ జన్మకి ఒక గుడిపాటి వెంకట చలం కాలేరు! ఒక జీవితాదర్శం రాయలేరు.

ఇంతకీ నా బాధ ఏమిటంటే…
నాకేమన్నా ఫిర్యాదు, తకరారు వుంటే
అది చలంతోనో, శ్రీశ్రీతోనో…
దాశరధి రంగాచార్యతోనో, గోరటి వెంకన్నతోనో!

మహాకవి కృష్ణశాస్త్రిలా చెప్పాలంటే, నేను
దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి!

జర్నలిస్టు ఉద్యోగం చేసిన పాపానికి ఆసక్తి రేకెత్తించేవీ, జనాన్ని ఆశ్చర్యపరిచేవీ లేదా రెచ్చగొట్టేవీ కొన్ని రాయక తప్పదు. part of my jobగా యిరవయ్యేళ్ల కిందట జరిగిన వివాదాన్ని
ఈ తరానికి గుర్తు చేస్తున్నాను.

prakash-taadi
prakash-taadi,journalist

యండమూరి స్టార్ రైటర్ గనుక, యద్ధనపూడి రచన యిర్రెసిస్టబుల్ గనక, వీళ్లిద్దరూ రెండు మూడు తరాల్ని మంచికో చెడుకో దారుణంగా ప్రభావితం చేశారు గనక… వాళ్ల గురించి సహజంగానే మాట్లాడుకుంటాం.

సమాజమూ చెవులు రిక్కించి మరీ వింటుంది. దురుద్దేశాలూ, వ్యూహాలూ ఏమీ లేవు.Quality కాలక్షేపం అనే సరదా అయితే వుంది. నిష్పూచీగా బతికేస్తున్న కొందర్ని చూస్తే కోపంగానూ వుంది.

– తాడి ప్రకాష్, 97045 41559

Share.

Leave A Reply