పాలమూరు బత్తాయిలోయ్‌…

Google+ Pinterest LinkedIn Tumblr +

పాలమూరు, రంగారెడ్డిజిల్లా సరిహద్దులోని, రంగారెడ్డిపల్లిలో ఆగి, వనపలి లచ్మి బత్తాయి తోట ఎక్కడా? అని అడిగితే, ”గా రోడ్డుపక్కనే ఉన్న మామిడి తోట లోపలికి పొండి.. ” అన్నారు గ్రామస్తులు. 
”మాకు బోరు ఉంది కానీ ఏనాడూ చుక్కనీరు రాలేదన్నా, వానలు పడినా అదెక్కడికో పోయేది.ఎగుసాయం చేయలేక ,మా ఆయనతో కలిసి బిల్డింగ్‌ పనులకు పోయేదాన్ని…” తన గతాన్ని మాకు గుర్తుచేసింది లచ్మి. 
రంగారెడ్డిపల్లిలో మూడెకరాలున్న దంపతులు వెంకటేష్‌, లచ్మి. 
సాగు నీటి వసతి లేక వర్షాధారంపై పల్లిపంట పండించే వారు. ఒక సారి పండేది,మరో సారి ఎండేది. స్ధిరత్వం లేని వ్యవసాయం. భూమిని అలాగే వదిలేయకుండా, నాలుగేళ్ల క్రితం పొలంచుట్టూ కందకాలు, మధ్యలో రాతి కట్టలు కట్టి, ఎక్కడ పడిన వానను అక్కడే ఇంకేలా చేశారు.దీంతో నేలలో తేమ చేరింది. మిషన్‌కాకతీయలో పూడిక తీసిన మట్టిని తెచ్చి చల్లుకొని కొంత భూసారం పెంచారు. 
నీరొచ్చింది…. 
జలసంరక్షణ పనుల వల్ల వీరి పొలంలో,జలమట్టం పెరిగింది. బోర్లు నిండాయి. ఈ రైతు దంపతులు రెండెకరాల్లో బత్తాయి, ఒక ఎకరంలో పశుగ్రాసం పెంచసాగాడు. ఒక ఆవు, ఒక గేదెను కూడా పెంచుతూ,కొన్ని పాలను ఇంట్లోకి వాడుకొని, మిగిలినవి అమ్ముతూ కొంత ఆదాయం పొందుతున్నారు. 
సామాజిక మార్పు : తల్లి బసమ్మ, భార్యతో కలిసి వెంకటేష్‌ తోట పనులు చూసుకుంటున్నాడు. సంకల్ప సంస్థ ఇచ్చిన 320 బత్తాయి మొక్కలు నేడు బరువైన పండ్లతో కళకళలాడుతున్నాయి. ఈ సారి 90 టన్నుల వరకు దిగుబడి రావచ్చని వీరు అంటున్నారు. పిల్లలను ఇంగ్లీషు మీడియం బడిలో చదివిస్తున్నాం, బయట పనులకు పోయే అవస్త తప్పింది.పాలమీద కొంత, పండ్లతోట మీద మరికొంత ఆదాయం పొందుతూ సంతోషంగా బతుకుతున్నాం..” అంటోంది లచ్మి, పండిన బత్తాయి పండ్లను అపురూపంగా నిమురుతూ…

Share.

Leave A Reply