తెలంగాణ‌లో లేని స‌ముద్రాన్ని సృష్టించ‌కండి…

Google+ Pinterest LinkedIn Tumblr +

జర్నలిజం తీర్పు ఇచ్చే జడ్జీ స్థానంలో కాదు.
హృదయాలను కదిలించి, వాదనలు వినిపించే బోనులో వుండాలి. అలాంటి పాత్రికేయుడే, జిఆర్‌ మహర్షి. ‘ కన్నీళ్లు ఉప్పగా ఉంటాయి. సముద్రం కూడా ఉప్పగా ఉంటుంది. తెలంగాణలో లేని సముద్రాన్ని సృష్టించ‌కండి.. ఎందుకంటే అది మీ స్వప్నం. పచ్చగా ఉండాలే గాని, ఉప్పగా కాదు. రోడ్డు మీద బస్సులను తిరగనివ్వండి. ఆకలితో ఉన్న కార్మికులని కాదు.’ అని తెలంగాణ పాలకులను హృదయంతో ప్రశ్నిస్తున్నాడీ జర్నలిస్ట్.

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు గారికి బ‌హిరంగ లేఖ‌

సార్‌,
మీ గురించి 90వ ద‌శ‌కంలో మొద‌టిసారి విన్నాను. అప్పుడు మీరు ఆర్టీసీ మంత్రి. ప‌ట్టుద‌ల వ్య‌క్తి, ప‌ట్టుబ‌డితే వ‌ద‌ల‌డు అని మీ స‌న్నిహితులు చెప్పారు. ఆ మాట‌లు నిజ‌మ‌ని మీరు నిరూపించారు. హింస‌కు తావు లేకుండా ఒక రాష్ర్టాన్ని సాధించ‌డం చ‌రిత్ర‌లో మొట్ట‌మొద‌టిసారిగా మీరే చేశారు. మీరు ఒక చ‌రిత్ర‌. కాని గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె న‌న్నే కాదు ల‌క్ష‌లాది మందిని బాధ‌పెడుతోంది. మీ చుట్టూ ఉన్న ఎంద‌రో మీకు చెప్ప‌లేక లోలోప‌ల బాధ‌ప‌డుతున్నారు. ప‌క్కింట్లో వాడు ప‌స్తులుంటే మ‌న‌కు అన్నం సహిస్తుందా సార్‌? హృద‌య‌మున్న వారెవ్వ‌రికీ స‌హించ‌దు!

ఆర్టీసీ కార్మికులంటే కొన్నివేల మంది కాదు. కుటుంబాలు క‌లిస్తే ల‌క్ష‌ల మంది. వాళ్ల‌కు చిన్న‌చిన్న పిల్ల‌లుంటారు. మందులు అవ‌స‌ర‌మైన అమ్మానాన్న‌లుంటారు. ద‌స‌రా రోజు ప‌ర‌మాన్నం తినాల్సిన వీళ్లంతా ప‌చ్చ‌డి మెతుకులు తిన్నారు. త‌ప్పొప్పుల సంగ‌తి ప‌క్క‌న పెడితే..ఇదంతా బాధ క‌దా! హైద‌రాబాద్ ట్రాఫిక్‌లో మ‌మ్మ‌ల్ని క్షేమంగా ఇళ్ల‌కు చేర్చే డ్రైవ‌ర‌న్న‌లు రోడ్డు మీద దీనంగా నిల‌బ‌డి ఉంటే చూడ్డం క‌ష్టంగా ఉంది సార్‌.

ముఖ్య‌మంత్రి అంటే రాష్ర్టానికి తండ్రిలాంటి వారు. అనేక క‌ష్ట‌న‌ష్టాల మ‌ధ్య ప్రాణాల‌కు తెగించి తెలంగాణ తెచ్చిన మీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు అదే గౌర‌వం ఉంది. పిల్ల‌లు త‌ప్పు చేస్తే ఒక మాట తిడ‌తారు, కొడ‌తారు. కాని గొంతు నులిమి చంప‌డానికి ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తారా? కోపం వస్తే వీపు మీద కొట్టండి, పొట్ట‌మీద కాదు.

బిడ్డ చావుబ‌తుకుల్లో ఉంటే తండ్రి కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు కాని పోతే పోయాడులే అని అన‌గ‌ల‌డా? ఆర్టీసీని జీవితాల కోణంలో చూస్తారు కానీ, లాభ‌న‌ష్టాల్లో చూస్తారా? ప్ర‌భుత్వం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు క‌దా!

హృద‌య‌మున్న వాళ్లే ఉద్య‌మ‌కారులు అవుతారు. మీరు నాలుగు త‌రాలు గుర్తు పెట్టుకునే ఉద్య‌మ‌కారులు. జ‌నం మిమ్మ‌ల్ని గుండెల్లో చెక్కుకున్నారు. మీరే శిల‌గా మారిపోతే గుండెలు బ‌రువెక్కుతాయి.

ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. వాళ్ల‌ని పిల‌వండి. రోడ్డుమీద అల‌సిపోయి ఉన్నారు. మంచి భోజ‌నం తినిపించండి. మీ శైలిలో నాలుగు తిట్లు కూడా పెట్టండి. సంతోషంగా తిట్లు తింటారు. ఏదో ఒక పాయింట్‌లో స‌మ్మెను ముగించండి. వాళ్లంతా మీ వాళ్లు. మిమ్మ‌ల్ని న‌మ్మి ఉద్యోగాల‌కు తెగించి ఉద్య‌మంలో మీతో నిల‌బ‌డిన వాళ్లు. మీ బ‌లం వాళ్లు, బ‌ల‌హీనులు కాదు.

ద‌స‌రా పోతే పోయింది. దీపావ‌ళి కాంతి కూడా లేకుండా చేయ‌కండి. తెలంగాణ ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడిచే కేసీఆర్ మాక్కావాలి కానీ, కంట త‌డి పెట్టించే కేసీఆర్ మాకొద్దు. అస‌లు మీ రూపం, స్వ‌రూపం ఇది కానే కాదు. మీది కాని పాత్ర మీరు పోషించ‌కండి. కార్మికుల కాళ్ల‌ల్లో ముళ్లు గుచ్చుకుంటే నోటితో తీస్తాన‌నే కేసీఆర్‌గానే ఉండండి.

ఒక మ‌నిషి క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌స్తే దాన్ని క‌న్నీటి బొట్టు అంటారు. ఒకేసారి వేల మందిలో వ‌స్తే దాన్ని అశుభం అంటారు.

క‌న్నీళ్లు ఉప్ప‌గా ఉంటాయి. స‌ముద్రం కూడా ఉప్ప‌గా ఉంటుంది. తెలంగాణ‌లో లేని స‌ముద్రాన్ని సృష్టించ‌కండి. ఎందుకంటే అది మీ స్వ‌ప్నం. ప‌చ్చ‌గా ఉండాలే గాని, ఉప్ప‌గా కాదు. రోడ్డు మీద బ‌స్సుల‌ను తిర‌గ‌నివ్వండి. ఆక‌లితో ఉన్న కార్మికుల‌ని కాదు. – జీఆర్ మ‌హ‌ర్షి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, ర‌చ‌యిత‌

Share.

Leave A Reply