పబ్లిక్ గార్డెన్ లో ఒక మట్టిమనిషి

Google+ Pinterest LinkedIn Tumblr +

NREGA పథకం ఉంచాలా? పీకేయాలా? అని కేంద్ర సర్కారు ఊగిసలాడుతున్న సమయంలో, హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లో రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఒక స్టడీ చేయమన్నారు.
ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు తిరిగి కొందరిని కలిశాం.
ఆ రాత్రి భద్రాచలం లో ఆగిపోవాల్సి వచ్చింది. చిక్కని అడవి మధ్య ఎదిగిన మర్రిమానులా ఉన్న ఐటీడిఏ గెస్ట్ హౌస్‌లో బస దొరికింది. హాలు లో డిన్నర్ చేస్తుంటే, అదే గెస్ట్ హౌస్‌లో లో ఉన్న పల్లవి గారు వచ్చి పరిచయం చేసుకున్నారు. వెదురును పెంచుతున్న గిరిజనుల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు చెప్పారు. నేనొచ్చిన పని తెలుసుకొని , ‘‘ రాజాపురంలో అడవిని దున్నుతున్న జమమ్మను మీరు కలిసి తీరాలి…’’అని లీడ్ ఇచ్చింది.
……………
మర్నాడు ఉదయం పదింటికి,ముల్కలపల్లి మండలం , రాజాపురం రహదారి పక్కనే, పొలంలో, కోసిన వరిని కుప్పలుగా వేస్తున్న జయమ్మ దగ్గరున్నాం.
ఒకపుడు రాళ్లతో , తుమ్మ పొదలతోఅడవిని ఆనుకొని ఉన్న రెండు ఎకరాలను సాగులోకి తేవడానికి ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుంది
భూమి చదును చేసుకోవడానికి, పంటకుంటను తవ్వుకోడానికి ఉపాధి హామీపథకం ఆమెకు ఆసరా అయింది.
‘‘ అడవి జంతువులు రాకుండా మా ఆయిన రాత్రుళ్లు కాపలా ఉంటే, పగలు నేను పొలం పని చేసేదాన్ని…గట్ల ఈ నేలను మార్చి సగం జామాయిల్, సగం వరి పండిస్తున్నా…’’ అని అమాయకంగా చెప్పింది.
…………..
కొన్ని నెలల తరువాత…..
ఆమె స్టోరీని పత్రికలో చూసిన ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు ఒక ఉదయం కాల్ చేశారు.
‘‘ శ్యాం, జయమ్మను చూడాలని ఉంది…’’ అని కంచు స్వరం తో అడిగారు.
…………….
అలా ఆ సీన్ కట్ అవ్వగా…
రమణ గారు మాట్లాడిన రెండు రోజుల తరువాత, రాజాపురం లో జయమ్మ ఇంటికి…పంచాయితీరాజ్ శాఖ అధికారులు వెళ్లారు. ‘‘ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ప్రభుత్వం అవార్డు ఇస్తాదమ్మా… రేపు హైదరాబాద్‌కి రండి కార్ పంపుతాం…’’ అన్నారు.
మెట్రో రైల్ నడిపే లేడీ డ్రైవర్, మరో యూనివర్సిటీ ప్రొఫెసర్ తో పాటు మట్టి మనిషి జయమ్మను రమణ చారి గారితో పాటు కొందరు ప్రముఖులు పబ్లిక్ గార్డెన్‌లో సత్కరించారు.
కార్యక్రమం తరువాత జయమ్మ స్టేజీ దిగి వచ్చి, ‘‘ ఎంత కష్టపడినా,ఎన్నడూ రెండు వేల రూపాయల నోట్ ఎట్ల ఉంటదో చూడలేదన్నా..
ఇపుడు, లచ్చరూపాయలిచ్చిండ్రు…ఏమిచేయాలో..? ’’ అని ఆనందంతో ఉధ్వేగంగా…చేతిలోని మెమెంటో, చెక్ చూపించింది.
ఆమె వెనుక రమణగారు పరవశంగా చూస్తున్నారు.
జర్నలిజం లో ఉన్నందుకు తలెత్తుకు నిలబడే సందర్భం ఇది..!!

Share.

Leave A Reply